సరిగ్గా ఏడాది క్రితం చిన్నగా మొదలైన వైరస్ ప్రభావం ప్రవాహంగా మారింది. ఒకటిరెండు కేసుల నమోదు ప్రారంభమైన కోవిడ్ 19 దాడి.. లక్షల్లో చేరింది. ఎందరో అమాయకులను బలి తీసుకుంది. ఆస్పత్రి పాలు.. అప్పుల పాలు చేసింది. సుదీర్ఘ లాక్ డౌన్ తో ప్రజా వ్యవస్థను అతలాకుతలం చేసింది.. తరువాత తీసుకున్న జాగ్రత్తల నేపథ్యంలో రానురాను పరిస్థితి అదుపులోకి వచ్చింది. వైరస్ అంతరించిపోయిందని అంతా అనుకున్నారు. సంబరాలు చేసుకున్నారు. జాగ్రత్తలు పక్కకు పెట్టేశారు. కానీ..కానీ..
Also Read: ప్రపంచం చూపు.. క్వాడ్ వైపు
ఎక్కడ మొదలైందో మళ్లీ అక్కడికే చేరితే ఎలా ఉంటుంది..? ఇప్పుడు నాగపూర్ పరిస్థితి ఇంచుమించు ఇలానే తయారవుతోంది. గత ఏడాది మార్చి చివరిలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం.. కరోనా కేసులు పెరగకుండా ఉండేందుకు తీసుకున్న చర్యలు అంతో ఇంతో మేలు చేశాయి. అన్ లాక్ తరువాత అంతకంతకూ పెరుగుతున్న నిర్లక్ష్యం.. కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పరిస్థితి ఇప్పుడు మళ్లీ మొదటికి వచ్చినట్లు కనిపిస్తోంది.
రోజుకు లక్షకు పైగా కేసుల స్థాయినుంచి పన్నెండు వేలకు తగ్గిపోయిన పరిస్థితి. గడిచిన కొద్దిరోజులుగా పెరుగుతున్న కేసుల పుణ్యమా అని దేశంలో తాజాగా రోజుకు ఏకంగా 22వేలకు పైగానే కేసులు నమోదైన పరిస్థితి. ఈ మొత్తంలో కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర వాటానే ఎక్కువగా ఉండడం విశేషం. అంతకంతకూ కేసులు పెరుగుతుండడంతో నాగ్ పూర్ జిల్లాలో ఈనెల 15 నుంచి 21 వరకు కఠిన లాక్ డౌన్ విధిస్తూ.. నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్తో ప్రయివేటు సంస్థలన్నీ మూతపడగా.. ప్రభుత్వ సంస్థలు మాత్రం 25శాతం సిబ్బందితో పని చేస్తున్నాయి.
Also Read: మోడీ బాటలో కేసీఆర్.. 75 ఏళ్ల స్వాతంత్య్ర పండుగకు పెద్దపీట
కాగా.. నిత్యవసర సరుకుల దుకాణాలు తెరిచే ఉంటాయని మహారాష్ట్ర సర్కారు తెలిపింది. పెరుగుతున్న కేసులకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించింది. దేశంలో అత్యధిక కేసులు నమోదు అయిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటిస్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో నాగపూర్ ముందు వరుసలో ఉంది. దీంతో జిల్లాలో లాక్ డౌన్ విధిస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. నిర్లక్ష్యాన్ని వదిలి జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్