TDP-Janasena: తెలుగుదేశం పార్టీతో పవన్ పొత్తు పెట్టుకోవడం వెనుక కుట్ర కోణం ఉందని జగన్ మీడియా వరుస కథనాలను ప్రచురిస్తోంది. అయితే ఇవి తేలిపోతున్నాయి. ఆ రెండు పార్టీల మధ్య పొత్తుతో వైసీపీకే నష్టమని.. భయంతో ఈ కథనాలు రాయిస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటనకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా తిరుపతిలో పర్యటించారు. ఆ పార్టీ శ్రేణులతో సమావేశం అయ్యారు. ” చంద్రబాబు అరెస్ట్ తో టిడిపికి దిక్కులేదు. టిడిపికి పవనే దిక్కు. తమ్ముడు సీఎం అవుతాడు ” అని నాగబాబు ప్రకటించారు అంటూ సాక్షిలో పతాక శీర్షికన కథనాన్ని ప్రచురించారు. తెలుగుదేశం పార్టీతో అనుకూలంగా ఉంటూనే ఆ పార్టీని హస్తగతం చేసే ప్లాన్ జాతీయస్థాయిలో జరుగుతోందని సాక్షితో పాటు వైసిపి అనుకూల మీడియా ప్రచారం ప్రారంభించింది.
తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు కుదరడం వైసిపికి ఇష్టం లేదు. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు విచ్ఛిన్నం చేయడానికి భారతీయ జనతా పార్టీ ద్వారా వైసిపి పావులు కదిపినట్లు ఎప్పటినుంచో విమర్శలు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆది నుంచి టిడిపి తో పొత్తు విషయంలో సానుకూలంగా ఉన్నారు. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతూ వచ్చారు. చంద్రబాబు అరెస్టు తరువాత ఎటువంటి లాభనష్టాలను, రాజకీయ ప్రయోజనాలను లెక్కచేయకుండా పొత్తు ప్రకటన చేశారు. వైసిపి విముక్త ఏపీ తన లక్ష్యమని స్పష్టం చేశారు. అప్పటినుంచి అధికార వైసీపీలో ఒక రకమైన ఆందోళన ప్రారంభమైంది. అందుకే రకరకాల ప్రచారాలకు తెరతీసింది. కాపు సంఘాలు, పవన్ అభిమానుల పేరిట రకరకాల ప్రచారాలు చేసింది. అయితే ఈ విషయాలపై పవన్ ముందుగానే స్పష్టమైన ప్రకటన చేశారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తెలుగుదేశం, జనసేన ఎన్నికల్లో కలిసి వెళ్తాయని.. బిజెపి వస్తే కలుపుకొని వెళ్తామని.. రాకుంటే ఒంటరి పోరుకైన సిద్ధమని స్పష్టమైన ప్రకటన చేశారు. ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
అయితే నాగబాబు పర్యటనల్లో భాగంగా ఆయన విభిన్నంగా ప్రకటనలు చేస్తున్నారని.. అటు సమావేశాల్లో సైతం జనసేన అభిమానులు పొత్తు వద్దంటున్నారని.. తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తే తమ దారి తాము చూసుకుంటామని హెచ్చరించినట్లు సాక్షితో పాటు వైసీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. అయితే దీనిపై నేరుగా నాగబాబు స్పందించారు. పత్రికా సమావేశంలో సాక్షి ప్రతినిధిని పిలిచి.. నేను అలా మాట్లాడానా? మా పార్టీ కార్యకర్తలు అలా కోరుకున్నారా? అంటూ సుతిమెత్తగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చేశారు. ఈ రాష్ట్ర అవసరాల కోసం తెలుగుదేశంతో కలిసి పని చేస్తామని ప్రకటించారు. తెలుగుదేశం, జనసేన మధ్య సమన్వయానికి తాను జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టినట్లు నాగబాబు చెప్పుకొచ్చారు. దీంతో వైసిపి అనుకూల మీడియా మైండ్ బ్లాక్ అయ్యింది. ఓటమి భయంతోనే పొత్తు విచ్చిన్నానికి ప్రయత్నిస్తున్నారని ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. ఇది అంతిమంగా వైసీపీకి నష్టం చేకూరేలా మారింది.