Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా తప్పటడుగులు వేస్తోందా? చంద్రబాబు అరెస్టు తరువాత కన్ఫ్యూజన్ నెలకొందా? ఎప్పటికప్పుడు స్టాండ్ మార్చుకోవడం దేనికి సంకేతం? ఇప్పుడు ఇదే అంతటా చర్చనీయాంశంగా మారింది. అసలు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి జరిగిందా? లేదా? జరిగితే ఎవరు చేశారు? ఇందులో చంద్రబాబు ప్రమేయం ఉందా? లేదా? లేకుంటే అధికారులే చేశారా? వీటన్నింటిపై తెలుగుదేశం పార్టీ రోజుకో ప్రకటన చేస్తూ అయోమయానికి గురిచేస్తుంది. అటు పార్టీ శ్రేణులు సైతం ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అటు కేసు విచారణలో సైతం సాంకేతిక అంశాల చుట్టూనే చంద్రబాబు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. అవే ప్రతికూలతకు కారణమని తెలుస్తోంది.
నిన్న మొన్నటి వరకు స్కిల్ ప్రాజెక్టులో అవినీతికి అవకాశమే లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పుకొచ్చారు. ఇప్పుడు మాత్రం అధికారులు చేసిన తప్పిదానికి చంద్రబాబు ఎలా బాధ్యుడవుతాడని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఎండి ప్రేమ్ చంద్రారెడ్డి, అప్పటి సిఎస్ ఐ వై ఆర్ కృష్ణారావు ప్రధాన కారకులని.. అవినీతి జరిగి ఉంటే వారిని ప్రశ్నించాలని అప్పటి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తాజాగా ప్రకటించారు. అంటే ఈ కేసులో అవినీతి జరిగిందని తెలుగుదేశం పార్టీ ఒప్పుకున్నట్టే. అయితే ఆ తప్పు చేసింది చంద్రబాబు కాదని.. అప్పటి అధికారులదే తప్పిదమని భావన వచ్చేలా తెలుగుదేశం పార్టీ నాయకులు తాజాగా ఆరోపణలు చేస్తున్నారు.
అటు చంద్రబాబు సైతం సీఐడీ కస్టడీలో తాను ఏ తప్పు చేయలేదని మాత్రమే చెప్పుకొస్తున్నారు. తాను తప్ప ఈ వ్యవహారంలో మిగిలిన వాళ్లంతా నేరగాళ్లు లాగా జవాబులు చెబుతుండటంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. డిజైన్ టెక్ సంస్థ ద్వారా చంద్రబాబు 241 కోట్ల రూపాయలు స్వాహా చేశారని ఆరోపణలు ఉన్నాయి. సదరు డిజైన్ టెక్ సంస్థ ఉద్యోగి భార్య అపర్ణ ఐఏఎస్ అధికారిగా కేంద్ర సర్వీసులో ఉండగా… చంద్రబాబు ఒత్తిడితో రాష్ట్ర సర్వీసులోకి డిప్యూటేషన్ పై తీసుకొచ్చారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సీఐడీ చంద్రబాబును ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆమెను తీసుకురావడంలో తన ప్రమేయం లేదంటూ చంద్రబాబు చెప్పుకొచ్చినట్లు సమాచారం.
స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు సంబంధించి నిధుల విడుదలలో నేరుగా ఎందుకు ఒత్తిడి తెచ్చారని సిఐడి ప్రశ్నించగా.. దాంతో తనకు సంబంధం లేదని చంద్రబాబుకు తేల్చేశారు. స్కిల్ కార్పొరేషన్ నిర్వహణలో కమిటీలు, వాటి నిర్ణయాలు అమలులో జరిగిన లోపాల గురించి ప్రశ్నిస్తే.. కింది స్థాయి కమిటీల పనులన్నీ సీఎం ఎలా చూస్తారని? ఆ శాఖలోని ఉన్నతాధికారులు, ఇతర కార్యదర్శులు, అధికారులు చూస్తారని చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే తాను బయటపడేందుకు.. తమను ఇరికిస్తున్నారన్న అనుమానం నాటి అధికారుల్లో నెలకొని ఉంది.