Naga Babu : ఏ పార్టీకైనా ఇప్పుడు సోషల్ మీడియా వింగే ప్రధానం. పార్టీ అనుబంధ విభాగాల్లో ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఒక భాగమైంది. ఇతర విభాగాల కంటే కీలకంగా మారిపోయింది. అందుకే పార్టీ నాయకత్వాలు సైతం ఎనలేని ప్రాధాన్యమిస్తున్నాయి. కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతున్నాయి. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో వాటి బలోపేతంపై ఫోకస్ పెట్టాయి. అయితే ఏపీలో ఏ పార్టీకి లేనంతగా జనసేనకు సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంది. మిగతా పార్టీలు డబ్బులతో వాటిని నడిపిస్తుండగా.. ఒక్క జనసేన మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ తో నెట్టుకొస్తోంది. కానీ సమన్వయం లేక కొన్ని లోపాలు వెలుగుచూస్తున్నాయి. వాటిని సరిచేసే పనిలో పడ్డారు మెగా బ్రదర్ నాగబాబు.
ఇటీవలే పదవి..
గత కొద్దిరోజులుగా జనసేన కార్యకలాపాల్లో నాగబాబు యాక్టివ్ అయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ సోషల్ మీడియాను దారిలో పెట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. గత నాలుగురోజులు వర్చువల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లాల నేతలతో మాట్లాడుతున్నారు. కీలకమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. పార్టీ బలోపేతం.. నేతల మధ్యనున్న గ్యాప్.. స్థానికంగా ఉన్న సమస్యలపై ఫోకస్ పెట్టారు. అయితే ప్రధానంగా సోషల్ మీడియా టీమ్ ఎలా పనిచేయాలో సూచించారు.
పార్టీ గైడ్ లైన్స్..
గత ఎన్నికలకు ముందు జనసేనకు ప్రత్యేక సోషల్ మీడియా వింగ్ ఉండేది. కానీ ఎన్నికల తరువాత ఆర్థిక సమస్యలతో నిలిపివేసింది. కానీ జనసేన సోషల్ మీడియా యాక్టివిటీస్ మాత్రం తగ్గలేదు. పార్టీ కోసం పని చేసేవారు, అభిమానులు ఉన్నారు. వారంతా పార్టీకి అనుకూలంగా.. ప్రభుత్వ వైఫల్యాలపై పెద్దఎత్తున పోస్టింగులు పెడుతున్నారు. అయితే ఈ వ్యవహారంలో కొంతమంది శృతిమించుతున్నారు. ప్రభుత్వ బాధితవర్గాలుగా మిగులుతున్నారు. వారికి పార్టీ తరపు నుంచి గైడ్ లైన్స్ ఉండదు. ఏ పోస్టు పెట్టాలో కూడా వారికి తెలియదు. తమకు నచ్చనివాటి గురించి పెట్టేస్తుంటారు. ఈ విషయంలో కొన్నిసార్లు ప్రత్యర్థులకు దొరికిపోతున్నారు. పార్టీని సైతం ఇబ్బందుల్లో పెడుతున్నారు. అటువంటి వాటి విషయంలో నాగబాబు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది.
దిద్దుబాటు చర్యలు..
అదే సమయంలో జనసేన పేరు చెప్పి చాలామంది వసూళ్ల పర్వానికి దిగినట్టు వార్తలు వచ్చాయి. విరాళాల సేకరణ పేరిట భారీగా దండుకున్న సందర్భాలున్నాయి. ఇవన్నీ నాయకత్వం దృష్టికి వచ్చాయి. అందుకే నాగబాబు తక్షణ దిద్దుబాటు చర్యలకు దిగినట్టు తెలుస్తోంది. పార్టీ లైన్ ప్రకారమే సోషల్ మీడియా సైనికులు ఉండేలా ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పవన్.. జనసైనికులకు కొన్ని ప్రత్యేకమైన సూచనలు చేశారు.. వాటి ప్రకారం .. ఎవరూ గీత దాటకుండా చూడాలనుకుంటున్నారు. కారణం ఏదైనా… నాగబాబు ముందుగా వర్చువల్ మీటింగ్ ల ద్వారా పార్టీలో ఉన్న లోపాలను సవరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే నాగబాబు ఇదే దూకుడుతో జిల్లాల పర్యటన చేసే అవకాశమున్నట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి.