NTR Centenary Celebrations: ఎన్టీఆర్..ఈ మహా నటుడిని తెలుగు రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా నాయకులు ఆరాధిస్తారు. నేటికీ పలు పార్టీల్లో ఉన్న కీలక నాయకులు ఎన్టీఆర్ ద్వారా రాజకీయ భిక్ష పొందినవారే. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు.. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. ఎన్టీఆర్ ఎవరికైతే రాజకీయ భిక్ష పెట్టాడో వారే ఆయనకు వెన్నుపోటు పొడిచారు.. వైస్రాయ్ హోటల్ సాక్షిగా చెప్పులు విసిరారు. అదంతా వేరే ముచ్చట. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ 100వ జయంతి జరుపుకుంటున్నారు.. నిన్న ఆ కార్యక్రమాన్ని విజయవాడలో అనుమోలు గార్డెన్స్ లో అట్టహాసంగా నిర్వహించారు.. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు స్తుతి కీర్తనలతో సాగుతాయి కాబట్టి.. కార్యక్రమం ఆసాంతం అలానే సాగిపోయింది.
బాబు సేవలో జ్యోతి, ఈనాడు
అయితే ఇప్పుడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో అర్జెంటుగా అధికారంలోకి రావాలి. 23 సీట్ల నుంచి మ్యాజిక్ ఫిగర్ దాటిపోవాలి. అందుకే ఈనాడు, జ్యోతి జాకీలు పెట్టి లేపేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే నిన్న రజనీకాంత్ మాట్లాడిన మాటల్లో చంద్రబాబును స్తుతించిన వరకే తీసుకొని.. వాటినే తాటికాయంత అక్షరాలతో అచ్చేసాయి. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారత దేశంలో నెంబర్ వన్ గా నిలిపేందుకు చంద్రబాబు రచించిన ప్రణాళికలు మహా గొప్పవని రజినీకాంత్ చెప్పిన నేపథ్యంలో.. వాటికి ఎక్కడా లేని ప్రయారిటీ ఇచ్చాయి. చంద్రబాబు స్తుతి రాగంలో సీనియర్ ఎన్టీఆర్ ను మర్చిపోయాయి.
NTR Centenary Celebrations
కెసిఆర్ కు డప్పుకొట్టడంలో నమస్తే బిజీ బిజీ
ఇక ఈ సమావేశంలో రజనీకాంత్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేశారు. నేను ఉన్నది హైదరాబాదులోనా, న్యూయార్క్ లోనా అన్న రజనీ కాంత్ మాటలను ప్రధానంగా తీసుకొని.. మా కెసిఆర్ గొప్పోడు అన్న రేంజ్ లో నమస్తే ఏకంగా రెండు పేజీల వార్తలు కుమ్మేసింది.. పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా కెసిఆర్ అవసరం ఉందని రాసేసింది.. అసలు కేసీఆర్ అనే వాడు లేకుంటే హైదరాబాద్ ఉండేదా అనే తీరుగా సాగిపోయింది దాని వార్తా రచన.
NTR Centenary Celebrations
ప్లాప్ అని నిర్ధారించిన సాక్షి
ఇక ఈ కార్యక్రమానికి రజనీకాంత్ లాంటి స్థాయి వ్యక్తులు రావడంతో దాన్ని ఇగ్నోర్ చేయలేక సాక్షి ఆపసోపాలు పడింది. అదే సమయంలో సీనియర్ ఎన్టీఆర్ గురించి రజనీకాంత్ మాట్లాడిన మాటలను ఉటంకించలేక జగన్ భక్తిని ప్రదర్శించింది. చంద్రబాబు స్తుతి కీర్తనలను తను ఎలాగూ రాయదు కాబట్టి దర్జాగా పక్కన పెట్టేసింది. అంతేకాదు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు రజనీకాంత్ లాంటి వ్యక్తిని తీసుకువచ్చిన ఫ్లాఫ్ అయిందని రాసుకొచ్చింది. మొత్తానికి ఒక శకపురుషుడికి జరిగిన జయంతి కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించలేదు. కళ్యాణ్ రామ్ కనిపించలేదు. అసలు హరికృష్ణ కుటుంబమే వేదిక మీద లేదు. మొన్నటికి మొన్న చంద్రబాబు పుట్టినరోజు జరుపుకుంటే జూనియర్ ఎన్టీఆర్ క్యాంప్ నుంచి ఒక్క ట్వీట్ కూడా రాలేదు. అంటే మాడు వాసన గట్టిగానే వస్తున్నది. దాన్ని కవర్ చేసేందుకేనా చంద్రబాబు సీనియర్ ఎన్టీఆర్ శతజయంతిని ఇలా జరిపించింది.. ఏమో నందమూరి లోగుట్టు చంద్రబాబుకు ఎరుక.