Telangana Rain Alert: తెలంగాణకు ఎల్లో అలర్ట్‌.. బయటకు రాకపోవడమే మంచిది!

తెలంగాణలో చాలా ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రకటిచింది.

Written By: Raj Shekar, Updated On : April 29, 2023 1:55 pm
Follow us on

Telangana Rain Alert: తెలంగాణకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఆవిరించి ఉన్న ద్రోణి ప్రభావంతో శనివారం ఉదయం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గంట వ్యవధిలో 7 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. ఆదివారం కూడా ఉరుములు, మెరుపులు, ఈదుగు గాలులతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

పిడుగులు పడే చాన్స్‌..
తెలంగాణలో చాలా ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రకటిచింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇంటీరియర్‌ తమిళనాడు నుంచి రాయలసీమ వరకు, ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా విదర్భ వరకు, సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. ఒక ఉపరితల ఆవర్తనం రాయలసీమతోపాటు పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వర్ష సూచనతో రైతులు, పౌరులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ అధికారులు కోరుతున్నారు.

అనవసరంగా బయటకు రావొద్దు..
ఇక భారీ వర్షాలు, బలమైన గాలులు, పిడుగుల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి ఓ చిన్నారి నాలాలో పడి మృతిచెందింది. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు పొలం పనులకు వెళ్లకపోవడమే మంచిదని తెలిపింది. పొలాల వద్ద ఉన్నప్పుడు వర్షం కురిస్తే చెట్ల కింద నిలబడొద్దని సూచించింది. సమీపంలోని గుడిసెల్లో గానీ, లేదా ఇళ్లలోకి వెళ్లాలని పేర్కొంది. చెట్లు పిడుగులను ఆకర్షిస్తాయని చెట్ల కిందన నిలబడితే ప్రమాదమని హెచ్చరించింది.

విద్యుత్‌ అధికారుల అలర్ట్‌..
ఇక ద్రోణి ప్రభావంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున విద్యుత్‌ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విద్యుత్‌ స్తంభాలు విరిగి పడే అవకాశం ఉందని, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉందని తెలిపింది. ఇళ్లలో కూడా విద్యుత్‌ షార్ట్‌ సర్యూట్‌ జరిగే అవకాశం ఉన్నందున వర్షం కురిసే సమయంలో విద్యుత్‌ సరఫరా నిలివేయడమే మంచిదని పేర్కొంది. తడిసిన గోడలు, కూలర్లు ముట్టుకోవద్దని సూచించింది.

ఆదివారం కూడా వర్షాలు..
ద్రోణి ప్రభావంతో ఆదివారం కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.