Munugode By Election Effect- KCR: ఫామ్ హౌస్ దాటి బయటికి రాడు. అపాయింట్మెంట్ అసలు ఇవ్వడు. మాట్లాడాలంటే కుదరదు. కలవాలంటే వీలుపడదు. ఇది మొన్నటిదాకా టిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల్లో కేసీఆర్ పై ఉన్న అభిప్రాయం. కానీ ఇప్పుడు దీనిని మార్చుకోవాలేమో.. ఒక్కోసారి నెలల తరబడి పత్తా ఉండని కేసీఆర్… ఇప్పుడు ప్రతిక్షణం వార్తల్లో వ్యక్తి అవుతున్నారు. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్ వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. ఎనిమిది కిలోమీటర్ల లోతులో మీడియాను పాతి పెడతానని హెచ్చరించిన ఆయన ఇప్పుడు.. అదే మీడియాకు విజ్ఞప్తి చేయడం కనిపిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిస్తున్న తీరు కొత్తగా ధ్వనిస్తోంది. ఇన్ని పరిణామాల వెనుక, ఇన్ని మార్పుల వెనుక ఉన్నది.. కనిపిస్తున్నది.. వినిపిస్తున్నది ఒకే ఒక పేరు. మునుగోడు ఉపఎన్నిక.

పూర్తిగా మార్చేసింది
మునుగోడు ఉపఎన్నిక కేసీఆర్ వ్యవహార శైలి పూర్తిగా మార్చివేసింది. నిన్న అంటే గురువారం ఉదయం 11:30 నిమిషాలకు రోడ్లు భవనాల శాఖ అధికారులతో రెండున్నర గంటల పాటు సమీక్ష నిర్వహించారు.. మధ్యాహ్నం 2: 30 నిమిషాలకు వైద్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాయంత్రం 4:30 కు సచివాలయం భవనం వద్దకు కెసిఆర్ వెళ్లి పనులను పరిశీలించారు.. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కళాశాలల్లోని దాదాపు 11,000 మంది కాంట్రాక్టు సిబ్బంది, అధ్యాపకులను క్రమబద్ధీకరించే విషయాన్ని అధికారులతో చర్చించారు. ఇక పరిపాలనకు సంబంధించిన విషయాలపై కేసీఆర్ వేగంగా స్పందిస్తున్నారు. గతంలో ఫైళ్లు నెలల తరబడి పెండింగ్లో ఉండేవి.. వాటి గురించి తిరిగి తిరిగి మంత్రుల మోకాళ్ళు. అరిగిపోయేవి. అధికారుల్లో నీరసం వచ్చేది
ఎన్నికల సమీపిస్తున్నందునేనా
మరో ఏడాది మాత్రమే ఎన్నికలకు సమయం ఉంది.. ఈ నేపథ్యంలో కేసీఆర్ పాలనపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.. మునుగోడు ఉప ఎన్నిక లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి చావు తప్పి కన్ను లొట్ట పోయిన తీరుగా గెలిచారు. ఒకవేళ కేసీఆర్ ప్రచారానికి వెళ్లకుంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇంతా చేస్తే పదివేల మెజార్టీ రావడంతో కెసిఆర్ అంతర్మథనం చెందారని తెలుస్తోంది. నిజానికి మునుగోడుపోయిందిక అధికార టీఆర్ఎస్ పార్టీకి చెమటలు పట్టించింది.

అంగ, అర్థ బలం ప్రయోగించినా ఆశించినంత మేర మెజార్టీ రాలేదు. పైగా ప్రత్యర్థి బిజెపికి అనూహ్య ఓటింగ్ పెరిగింది. రానున్న రోజుల్లో ఈ ప్రభావం మిగతా నియోజకవర్గాల పైన ఉంటుందా అనే చర్చ జరుగుతోంది.. అసెంబ్లీ ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని కేసీఆర్ ప్రకటిస్తున్నారు. దానికి ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉంది.. ఈ అంశాలు పరిగణనలోకి తీసుకొని కెసిఆర్ స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. గురువారం ఒక్కరోజే వైద్య ఆరోగ్యం, రోడ్ల నిర్మాణం పై ఆయన వరుస సమీక్షలు నిర్వహించారు. జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని, అధికారులు ఇందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత పాలనలో వేగం పెంచకపోతే మొదటికే మోసం వస్తుంది, అందుకే సీఎం హంగామా చేస్తున్నారని ప్రతిపక్షాల విమర్శిస్తున్నాయి. పొద్దస్తమానం రాజకీయాల గురించే మాట్లాడుకుంటున్నారని ధ్వజమెత్తుతున్నాయి.