Konaseema: ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 7 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. 10 గంటలకు విశ్వరూపం చూపిస్తున్నాడు. వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ లోనే ఇలా ఉంటే మేలో ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప =ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఉదయం 10 గంటలకే రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అయితే ఇటువంటి తరుణంలో ఏపీలోని కోనసీమలో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం – వరకూ తీక్షణమైన ఎండ.. అక్కడ నుంచి వడగాలులు వీచుతున్నాయి. అర్ధరాత్రి దాటిన తరువాత మాత్రం విపరీతమైన పొగమంచు కురుస్తోంది. ఉదయం 8 గంటల వరకూ మంచు వీడడం లేదు. ఇలా మంచు వీడిందో లేదో సూర్యుడు సుర్రుమంటూ వాతాలు పెడుతున్నాడు.
వింటర్ సీజన్ మాదిరిగా..
కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో అయితే భిన్న వాతావరణం కనిపిస్తోంది. కమాన్ గానే ఎండ దంచికొడుతోంది. అయితే రాత్రి నుంచి ఉదయం వరకూ మాత్రం మంచు దుప్పటి కప్పుకుంటోంది. శీతాకాలామా అనే డౌట్ కలిగిస్తోంది. ఉదయం రహదారిపై ఎదుటి వాహనం, మనిషి కనబడని విధంగా మంచు కురుస్తోంది. సేమ్ వింటర్ సీజన్ ను తలపిస్తోంది. శీతాకాలంలో విశాఖ మన్యంలో ఉన్నట్టు అనిపిస్తోంది. ఈ విచిత్ర వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒక వైపు సూర్యుడి ప్రతాపం.. మరోవైపు ఉదయమే మంచు కమ్మేయడం వంటి పరిస్థితులు ఇక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
పది దాటితే పగులగొడుతున్న ఎండ..
ఉదయం లేచే సమయంలో మంచు చూస్తున్న ప్రజలు.. పది గంటలు దాటితే దంచికొడుతున్న ఎండను చూసి బెంబేలెత్తిపోతున్నారు. జలుబు, తలనొప్పి వంటి రుగ్మతలతో బాధపడుతున్నారు. పొగ మంచుతో పంటలకు సైతం తీవ్ర నష్టం కలుగుతోంది. ఎండలు దంచికోడుతున్న వేళ.. మంచు కురవడం ఏంటీ.. అంటూ ఆశ్చర్యపోతున్నారు.శీతాకాలంలో మంచు కురవడం కామన్.. కానీ.. ఎండాకాలంలో మంచు ఏంటని ఆశ్చర్యపోవడం ముమ్మిడివరం వాసుల వంతవుతోంది. గత నాలుగు రోజులుగా చోటుచేసుకున వాతావరణ మార్పులతో నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు..ఇక కోవిడ్ పాజిటివ్ కేసులు పెరగడానికి వాతావరణ పరిస్థితులే కారణం అంటున్నారు వైద్య నిపుణులు..విచిత్ర వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.
అయితే విచిత్ర వాతావరణంపై వాతావరణ శాఖ ఎటువంటి స్పష్టతనివ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.