
ABN RK: నీతులు చెప్పడం సులువే. వాటిని పాటించడమే కష్టం. వెనకటికి ఒక పెద్దమనిషి ఊళ్లో వాళ్లను ఉల్లిగడ్డలు తినకండి, ఆరోగ్యానికి మంచివి కావని హితబోధ చేశాడు. ఆ బోధన విన్నవారిలో అతని భార్య కూడా ఉంది. శ్రీవారి మాట జవదాటని ఆ వివాహిత.. తాను వండిన కూరలో ఉల్లిపాయ వేయలేదు. కంచంలో అన్నం తింటున్న ఆయనకు ఉల్లిపాయ రుచి తగలలేదు. దీంతో విషయం ఏంటని భార్యను ఆరా తీస్తే.. అసలు విషయం చెప్పింది. దీంతో ఆ పెద్దమనిషి ఒళ్ళు మండిపోయింది..” పిచ్చి దానా నీతులు అనేవి పైకి మనం చెప్పేందుకే. వాటిని మనం ఆచరించాల్సిన పనిలేదు..ఇంకో సారి కూరలో ఉల్లిపాయ వేయకుంటే బాగోదు” అని హెచ్చరించాడు. ఇలానే ఉంటుంది దమ్మున్న పత్రిక యజమాని వేమూరి రాధాకృష్ణ వ్యవహార శైలి.
కోవిడ్ ప్రబలుతున్నప్పుడు, హైదరాబాదులో ఉన్న రోగులకు పడకలు సరిపోనప్పుడు పొరుగున ఉన్న ఆంధ్ర ప్రదేశ్ నుంచి రోగులు తెలంగాణకు రాకుండా ప్రభుత్వం అప్పట్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. దీనిని వేమూరి రాధాకృష్ణ వ్యతిరేకించాడు. అక్కడిదాకా ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, రోగులను ఆస్పత్రులు దోపిడీ చేస్తున్నాయని రాసుకొచ్చాడు. దీంతో జనాల్లో నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయి వారంతా కూడా హైదరాబాద్ బాట పట్టారు. ఇక్కడి రోగులకు బెడ్లు సరిపోకపోవడంతో ప్రభుత్వం వారిని సరిహద్దులోనే వెనక్కి పంపింది. ఇది రాధాకృష్ణకు తప్పుగా గోచరించింది. అదే రమేష్ హాస్పిటల్ లో అగ్నిప్రమాదం జరిగితే రాధా కృష్ణ అసలు పట్టించుకోలేదు. పైగా అగ్ని ప్రమాదం జరిగింది, జనాలు చచ్చారు అనే యాంగిల్ లో రాసుకొచ్చాడు. అంటే తనవాళ్ళు అయితే ఒకలా, నచ్చని వాళ్ళైతే ఒకలా ఉంటుంది ఆయన జర్నలిజం.

బయటికి ఆయన నీతులు చెబుతున్న రాధాకృష్ణ.. కోవిడ్ టైంలో ఏం చేశాడో మాత్రం చెప్పట్లేదు. అసలే బయట ఉపాధి దొరకని పరిస్థితుల్లో.. తననే నమ్ముకున్న ఉద్యోగులను ఉన్న ఫళంగా ఉద్యోగం నుంచి తొలగించాడు.. ఉన్న ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించాడు. తర్వాత పరిస్థితులు చక్కబడ్డాక వేతనాల్లో కలుపుతామని హామీ ఇచ్చాడు. కానీ ఇంతవరకు పైసా కలిపిన పాపాన పోలేదు.అదే ఎన్ టీవీ, టీవీ9 తన ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వేతనాలు ఇచ్చాయి. కష్టకాలంలో ఆదుకున్నాయి..కానీ ఉదయం లేస్తే లోకానికి సుద్దులు చెప్పే రాధాకృష్ణ మాత్రం తన ఉద్యోగుల పొట్ట కొట్టాడు. కోవిడ్ పరిస్థితులు చక్కబడ్డ తర్వాత అవసరాల కోసం ఉద్యోగులను మళ్లీ పిలిస్తే ఎవరూ తిరిగి రాలేదు. అంతే కాదు సెంట్రల్ డెస్క్ లో కూడా చాలామంది సబ్ ఎడిటర్లను తొలగించారు. దీంతో వారంతా ఇతర ఉద్యోగాలు చూసుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సెంట్రల్ డెస్క్ లో సబ్ ఎడిటర్ల అవసరం పడింది. వరుస నోటిఫికేషన్లు ఇస్తున్నప్పటికీ ఎవరూ ముందుకు రావడం లేదు..
ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న రోగులపై ఒక కన్నేసి ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇది రాధాకృష్ణకు నేరం లాగా కనిపించింది.. అందుకే తెలంగాణ ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నాడు. కానీ ఇక్కడ రాధాకృష్ణ మరిచిపోయిన లాజిక్ ఏంటంటే.. ఏపీలో ప్రవేట్ ఆసుపత్రుల దోపిడీ ఎక్కువగా ఉందని తన పేపర్లో రాస్తాడు. అది జగన్ మీద తనకు ఉన్న అక్కసు. కానీ దానిని వేరే విధంగా రాయడమే ఇక్కడ మరింత విషాదం. ఒకవేళ జగన్ స్థానంలో చంద్రబాబు ఉంటే రాధాకృష్ణ రాత మరో విధంగా ఉండేది.అన్నట్టు కొవిడ్ కాలంలో చాలామంది ఆంధ్రజ్యోతి ఉద్యోగులు కన్నుమూశారు. కానీ ఇవాల్టికి ఒక్కరి కుటుంబాన్ని కూడా యాజమాన్యం ఆదుకోలేదు. పైసా కూడా ఇవ్వలేదు. పైగా ఉద్యోగుల జీతాల నుంచి కోతలు విధించింది. ఉద్యోగులకు వచ్చే అత్తెసరు జీతాల నుంచే వెల్ఫేర్ ఫండ్ కలెక్ట్ చేసింది..కానీ ఆ ఫండ్ నుంచి ఒక్కరికి కూడా నయా పైసా ఇవ్వలేదు.. చివరికి ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సహాయమే కోవిడ్ బాధిత కుటుంబాలకు ఆసరా అయింది.