Mudragada Padmanabham: మరోసారి కాపు కాక రేగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఘాటు లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు నేపథ్యంలో 80 అసెంబ్లీ స్థానాలు, రెండేళ్ల సీఎం పదవి పవన్ అడగాల్సిందని ముద్రగడ తేల్చి చెప్పారు. జనసేన పోటీ చేసే 24 మంది కోసం నా అవసరం రాదు.. రాకూడదని కోరుకుంటున్నానని తేల్చి చెప్పారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన పరపతి పెంచడానికి పవనే కారకులు అన్నారు. పవన్ నన్ను కలవాల్సిందని.. కానీ ఆయన కలవలేదని.. నా దగ్గరికి వచ్చి ఉంటే సీట్ల సర్దుబాటు పై సలహా ఇచ్చి ఉండేవాడినని చెప్పుకొచ్చారు. తాను ఎటువంటి ఫలితం ఆశించని సేవ పవన్ తో చేయించాలని అనుకున్నట్లు కూడా తెలిపారు. ముద్రగడ లేఖ ఇప్పుడు వైరల్ గా మారుతోంది.
ముద్రగడ వైసీపీలో చేరుతారని బలమైన చర్చ నడిచింది. అయితే ముద్రగడ ఆశిస్తున్న సీట్ల విషయంలో జగన్ పెద్దగా మొగ్గు చూపలేదు. ఆయనకు కానీ.. కుటుంబ సభ్యులకు కానీ సీట్లు ప్రకటించలేదు. దీంతో ముద్రగడ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. అదే సమయంలో జనసేన తో పాటు టిడిపి నాయకులు ముద్రగడను కలిశారు. జనసేన నాయకులయితే త్వరలో ముద్రగడతో పవన్ భేటీ అవుతారని చెప్పుకొచ్చారు. ముద్రగడ జనసేన లో చేరడం ఖాయమని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఇది జరిగి నెలలు గడుస్తున్న పవన్ మాత్రం ముద్రగడను కలవలేదు. మరోవైపు పొత్తులో భాగంగా జనసేనకు కేవలం 24 అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంట్ స్థానాలు కేటాయించడంపై కాపు సామాజిక వర్గంలో ఆగ్రహం ఉంది. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే ముద్రగడ పవన్ కు లేఖ రాయడం విశేషం.
ముద్రగడ తన లేఖలు కీలక అంశాలను ప్రస్తావించారు.’ మన ఇద్దరి కలయిక జరగాలని యావత్ జాతి చాలా బలంగా కోరుకుంది. నా గతం, నా బాధలు, అవమానాలు, ఆశయాలు, కోరికలు అన్నీ మరిచి మీతో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డా. రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వరవడి తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించా. మీరు అదే ఆలోచనలో ఉన్నారని నమ్మాను. కానీ దురదృష్టవశాత్తు నాకు మీరు అవకాశం ఇవ్వలేదు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు మొత్తం టిడిపి క్యాడర్ బయటకు రావడానికి భయపడింది. ఇళ్లకే పరిమితం అయ్యారు. అటువంటి కష్టకాలంలో తమరు జైలుకు వెళ్లి వారికి భరోసా ఇవ్వడం అన్నది సామాన్య విషయం కాదు. చరిత్ర తిరగరాసినట్టు అయింది. వారి పరపతి విపరీతంగా పెరగడానికి ఎవరు ఎన్ని చెప్పినా మీరే కారకులని బల్లగుద్ది చెప్పగలను. గౌరవ ప్రజలు ఇంచుమించుగా అందరూ మిమ్మల్ని ఉన్నత స్థానంలో చూడాలని తహతహలాడారు. పవర్ షేరింగ్ కోసం ప్రయత్నం చేసి అసెంబ్లీ సీట్లు 80, రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ముందుగా మిమ్మల్ని చేయమని కోరి ఉండాల్సింది. ఆ సాహసం మీరు చేయలేకపోవడం చాలా బాధాకరం. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం గానీ, పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం కానీ చేయలేదు. భగవంతున్ని ఆ పరిస్థితి రాకుండా చేయమని తరచూ కోరుకుంటున్నా. కానీ మీలా గ్లామర్ ఉన్నవాడిని కాకపోవడం, ప్రజల్లో పరపతి లేని వాడిని అవ్వడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా, తుప్పు పట్టిన ఇనుము లాంటి వాడినిగా గుర్తింపు పడటం వల్ల మీరు వస్తానని చెప్పించి, రాలేకపోయారు. మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు. ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాలి. మీ పార్టీ పోటీ చేసే 24 మంది కోసం నా అవసరం రాదు.. రాకూడదని భగవంతుని ప్రార్థిస్తున్నాను’ అంటూ ముద్రగడ లేఖ సాగింది.
అయితే తనను ప్రశ్నించిన వారు కాదని.. తనను నమ్మి తన వెంట వచ్చిన వారే తనవారని పవన్ చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా ఇవ్వలేదని.. అలా ఇచ్చి ఉంటే మీరు అడిగిన అన్ని సీట్లు అడిగేవాడినని పవన్ తేల్చి చెప్పారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ముద్రగడ లేఖ రాయడం విశేషం. అయితే ఇప్పటికే వైసిపి ముద్రగడను పట్టించుకోకపోవడం, ఇప్పుడు కలుస్తానన్న పవన్ కూడా ఆయనను కలవలేకపోవడంతోనే ముద్రగడ లేఖ రాసినట్లు తెలుస్తోంది. దీనిపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.