New Zealand Vs Australia 1st Test: స్వదేశంలోనే మూడు టి20లు కోల్పోయింది. అప్పనంగా ట్రోఫీ అప్పగించుకుంది. ఇక ఇందులో ఏం ఆడుతుంది.. ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్ కు ముందు న్యూజిలాండ్ జట్టు మీద ఆ దేశ అభిమానులు సామాజిక మాధ్యమాలలో చేసిన వ్యాఖ్యలివీ. కానీ వారి అనుమానాలను న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్లు పటాపచలు చేశారు. బౌలింగ్ కు అనుకూలించే తమ మైదానాలపై న్యూజిలాండ్ బౌలర్లు సత్తా చాటారు. నిప్పులు కురిపించే బంతులు వేస్తూ కంగారులను బెంబేలెత్తించారు.
రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ వెల్లింగ్టన్ లోని బెస్ రిజర్వ్ మైదానం వేదికగా గురువారం ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ కోల్పోవడంతో న్యూజిలాండ్ జట్టు టెస్ట్ సిరీస్ ఎలాగైనా గెలవాలనే కసితో బరిలోకి దిగింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. స్టీవెన్ స్మిత్, ఉస్మాన్ ఖవాజా ఆస్ట్రేలియా తరఫున ఓపెనర్లుగా బరిలోకి దిగారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 61 పరుగులు జోడించారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ 24.1 ఓవర్ వద్ద స్టీవ్ స్మిత్(31) ను ఔట్ చేశాడు. దీంతో 61 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం వన్ డౌన్ బ్యాటర్ గా మైదానంలోకి అడుగుపెట్టిన లబూషేన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి కుగెల్ జిన్ బౌలింగ్లో ఔటయ్యాడు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు 64 పరుగులు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన కామెరున్ గ్రీన్ తో కలిసి ఉస్మాన్ ఖవాజా ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో మరోసారి హెన్రీ మ్యాజిక్ చేశాడు.. ఈసారి ఉస్మాన్ ఖవాజాను(33) ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు మూడు వికెట్ల నష్టానికి 88 పరుగులు. ఖవాజా అవుట్ అయిన తర్వాత ట్రావిస్ హెడ్ క్రీజ్ లోకి వచ్చాడు. అతడు కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి విలియం ఓరూర్క్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు 4 వికెట్ల నష్టానికి 89 పరుగులు.
ఆదుకున్న గ్రీన్, మార్ష్
89 పరుగులకే నాలుగో వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఆస్ట్రేలియా జట్టును గ్రీన్, మార్ష్ ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్ కు 67 పరుగులు జోడించారు. ఆస్ట్రేలియా స్కోర్ ను 156 పరుగుల వద్దకు తీసుకెళ్లారు. జోడి కుదురుకుంటున్నదనే క్రమంలో మార్ష్(40) ను హెన్రీ ఔట్ చేశాడు. మార్ష్ ఔట్ అయిన తర్వాత వచ్చిన బ్యాటర్లు క్యారీ(10), స్టార్క్(9) వెంటవెంటనే అవుట్ అయ్యారు దీంతో ఆస్ట్రేలియా ఏడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజ్ లో గ్రీన్(72), కమిన్స్ (10) ఉన్నారు. కడపటి వార్తలు అందే సమయానికి ఆస్ట్రేలియా జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది.
న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ మూడు, ఓరూర్క్, కుగెల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అంతకు ముందు జరిగిన మూడు t20 ల సిరీస్ లో న్యూజిలాండ్ దారుణంగా ఓడిపోయింది. స్వదేశంలో వైట్ వాష్ తో ఆస్ట్రేలియాకు సిరీస్ అప్పగించింది. టి20 సిరీస్ ముగిసిన తర్వాత రెండు టెస్టుల సిరీస్ గురువారం ప్రారంభమైంది. రెండవ టెస్ట్ క్రైస్ట్ చర్చి వేదికగా మార్చి 8న ప్రారంభమవుతుంది. ప్రస్తుతం టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కనుక కోల్పోతే ఇండియా మొదటి స్థానంలోకి వస్తుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు ఐదవ స్థానంలో కొనసాగుతోంది.