Raghu Rama Krishnam Raju- CM Jagan
Raghu Rama Krishnam Raju- CM Jagan: ఏపీ సీఎం జగన్ కు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గిఫ్ట్ ఇచ్చారు. మీరు చదివింది నిజమే. అత్యంత క్లిష్టమైన సమయంలో రఘురామరాజు వైసీపీ సర్కార్ కు స్వాంతన చేకూర్చేలా వ్యవహరించారు. పరిమితికి మించి అప్పులు చేస్తుందన్న అపవాదు నుంచి గట్టెక్కించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి జగన్ కు కితాబు వచ్చేందుకు కారణమయ్యారు.
జగన్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల మయంగా మార్చిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేంద్రం విధించిన పరిమితికి మించి అప్పులు చేసి రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలో నెడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నాలుగేళ్లలో రాష్ట్ర అప్పు ఎనిమిది లక్షల కోట్లకు చేరుకుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే అందులో నిజం లేదని అర్థం వచ్చేలా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.2023 మార్చి నెలాఖరు నాటికి రూ.4,42,442 కోట్ల అప్పు మాత్రమేనని తేల్చేశారు. లోక్ సభలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అడిగిన ప్రశ్నకు మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పారు.
ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని, వివిధ మార్గాల్లో చేస్తున్న అప్పులను ఎప్పుడైనా సమీక్షించారా? అంటూ ఎంపీ రఘురామరాజు ప్రశ్నించారు. అయితే దీనిపై మంత్రి నిర్మలా సీతారామన్ సూటిగా సమాధానం చెప్పలేదు. పొడి పొడిగా మాట్లాడి ముగించారు. కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పుల గురించి ప్రస్తావించలేదు. కానీ జగన్ అనుకూల మీడియా దీనికి భిన్నమైన కలరింగ్ ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పరిమితులకు లోబడే అప్పులు చేస్తున్నట్లు కేంద్రం సర్టిఫికేట్ ఇచ్చినట్లు ప్రచారంతో హోరెత్తిస్తోంది. రఘురామరాజు జగన్ సర్కార్ కు మేలు చేసినట్టుగా వ్యంగ్యంగా చెబుతోంది. లోక్ సభలో మంచి ప్రశ్న వేసి.. విపక్షాల నుంచి తప్పించారని ఆనందం వ్యక్తం చేస్తోంది.
అయితే అప్పులపై ఇన్నాళ్లు ఏపీ ప్రభుత్వం చెప్పిన నివేదికలనే నిర్మలా సీతారామన్ ప్రకటించడం విశేషం. కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులను ఆమె దాటవేశారు. ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. నాలుగేళ్లుగా కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులను రాష్ట్ర ప్రభుత్వం చూపడం లేదని కాగ్ సైతం తప్పు పట్టింది. దీనిని నిగ్గు తేల్చేందుకు కేంద్రం సైతం ప్రత్యేక అధికారుల బృందాన్ని రాష్ట్రానికి పంపింది. కానీ కార్పొరేషన్ అప్పులను మాత్రం పరిగణలోకి తీసుకోకపోవడం విశేషం. ఇది ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న డ్రామాగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి.