Daggubati Purandeswari: నవ్వుల పాలైన పురందేశ్వరి

రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలిగా నియమితులైన పురందేశ్వరి వైసీపీ సర్కార్ పై గట్టిగానే పోరాటాన్ని ప్రారంభించారు. కానీ ఆమె చేస్తున్న ఆరోపణలను వైసీపీ నేతలు గడ్డి పూచలా తీసేస్తున్నారు.

Written By: Dharma, Updated On : August 1, 2023 10:29 am

Daggubati Purandeswari

Follow us on

Daggubati Purandeswari: ఏపీ బీజేపీని హైకమాండ్ లైట్ గా తీసుకుంటుంది. అన్ని రాష్ట్రాల మాదిరిగా ఒక శాఖని ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. మీ పని మీరు చేయండి.. మా పని మేం చేస్తాం అన్నట్టు వ్యవహరిస్తోంది. రాష్ట్ర పార్టీ ప్రయోజనాల కంటే.. జాతీయస్థాయి ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెబుతోంది. దీంతో జగన్ సర్కార్ పై పోరాటానికి దిగుతున్న రాష్ట్ర బీజేపీ నాయకులకు ఝలక్ తగులుతోంది.

రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలిగా నియమితులైన పురందేశ్వరి వైసీపీ సర్కార్ పై గట్టిగానే పోరాటాన్ని ప్రారంభించారు. కానీ ఆమె చేస్తున్న ఆరోపణలను వైసీపీ నేతలు గడ్డి పూచలా తీసేస్తున్నారు. వైసిపి పై ఆమె ఆరోపణలు చేస్తుంటే.. టిడిపి మనిషిగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. మరిది చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని చౌకబారు విమర్శలు చేస్తున్నారు. తమకంటే ముందు టిడిపిని తిట్టాలని సూచిస్తున్నారు. లేకుంటే ఆమెను నమ్మలేమంటూ ఎద్దేవా చేస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నా బిజెపి హై కమాండ్.. వైసీపీ నేతలను కట్టడి చేసే చర్యలేవి చేపట్టడం లేదు.

అయితే కేంద్ర బీజేపీ నేతలు తమ సొంత పార్టీ నేతలు కంటే సీఎం జగన్ ఎక్కువయ్యారు. ఆయన ఇమేజ్ ను కాపాడేందుకే ప్రయత్నిస్తున్నట్టు మరోసారి వెల్లడయ్యింది. ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులన్నింటినీ లెక్కలు వేసి మరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రజల ముందు పెట్టారు. దాదాపు పది లక్షల కోట్ల అప్పులు తీసుకున్నారని.. కట్టడి చేయాలని కోరుతూ ఢిల్లీ వెళ్లి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు వినతి పత్రం అందజేశారు. కానీ ఇవేవీ పరిగణలోకి తీసుకొని నిర్మలమ్మ వైసిపి చెప్పిన లెక్కల్ని చెప్పి జగన్ సర్కార్ కు అంతులేని సాయాన్ని అందించారు. దీంతో నవ్వుల పాలవడం పురందేశ్వరి వంతు అయ్యింది.

2019 మార్చి నెలాఖరు నాటికి ఏపీ అప్పు రూ.2,61,451కోట్లు..2023 మార్చికి రూ.4,42,442కోట్లకు చేరుకున్నట్లు నిర్మలా సీతారామన్ పార్లమెంట్ కు తెలిపారు. అయితే ముందు రోజే నిర్మలాను కలిసిన పురందేశ్వరి పూర్తి లెక్కలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కానీ దానిని కనీస పరిగణలోకి తీసుకోలేదు. వైసిపి చెప్పిన లెక్కల ఆధారంగానే పార్లమెంట్లో ప్రకటించారు. దీంతో సొంత పార్టీ నేతలకంటే వైసీపీ ప్రయోజనాలే బిజెపి హై కమాండ్ కు ముఖ్యమన్న సంకేతాలు వెలువడ్డాయి. దీంతో వైసిపి నాయకులు రాష్ట్ర బిజెపి నాయకులను మరింత చులకనగా చూస్తున్నారు.