Munugodu By-Election : దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న మునుగోడు ఉప ఎన్నికను పకడ్బందీగా నిర్వహించేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటున్నది. మునుగోడు వైపు వెళ్లే దారులను చెక్ పోస్టులతో అష్టదిగ్బంధం చేసింది. ప్రధాన రహదారులు, గ్రామాల్లో కలిపి నియోజకవర్గ వ్యాప్తంగా 84 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది.. నియోజకవర్గం లోకి వెళ్లే, బయటకు వచ్చే వాహనాలను నాలుగు సార్లు చొప్పున తనిఖీలు చేస్తోంది. ఆర్టీసీ బస్సులు, గ్రామాల మధ్య తిరిగే ఆటోలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నది. కేంద్ర, రాష్ట్ర మంత్రులు సైతం పలుమార్లు వాహనం దిగి తనకి పూర్తయ్యే దాకా పక్కనే నిలబడుతున్నారు. ప్రతి చెక్ పోస్ట్ లో ఒక ఎస్ఐ లేదా ఏఎస్ఐ నిరంతరం విధుల్లో ఉండేలా చూస్తున్నారు. గ్రామానికి ఎనిమిది మంది పోలీసులు ప్రణాళికలు రూపొందించారు.

స్టాటిస్టిక్ సర్వే టీం ల ఏర్పాటు
మునుగోడులో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా స్టాటిస్టిక్ సర్వే టీం లను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది.. కెమెరాల ద్వారా పార్టీల ఎన్నికల ఖర్చులు రహస్యంగా వీడియో తీస్తాయి. వాహనాల తనిఖీని కూడా వీడియో తీస్తాయి. ఈ వీడియో మొత్తాన్ని లైవ్ లో పెడతాయి. ఈ కెమెరాలు మొత్తం నల్లగొండ కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానమయి ఉన్నాయి. మునుగోడు లో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఒక్కొక్క షాడో టీంను ఏర్పాటు చేశారు. ప్రలోభాలను అడ్డుకునేందుకు, ఇతర విషయాలను పర్యవేక్షించేందుకు మండలానికి మూడు చొప్పున సర్వై లెన్స్ బృందాలను ఏర్పాటు చేశారు.. పోలింగ్ సమయంలో బ్యాలెట్ యూనిట్లలో సాంకేతిక సమస్యలు ఏర్పడితే వాటి పరిష్కారం కోసం 30 మంది బెల్ ఇంజనీర్లను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు..
సీ విజిల్ యాప్
ఎన్నికల సమయంలో ఏ పార్టీ అయినా నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే దానిని ఫోటో తీసి విజిల్ అనే యాప్ లో అప్లోడ్ చేస్తే అది నిమిషాల్లో జిల్లా అధికారులకు తెలుస్తుంది.. వెంటనే వారు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఎన్నికల్లో మద్యం ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఎక్సైజ్ శాఖ నుంచి ప్రత్యేకంగా ఏడు మండలాలకు 128 మంది సిబ్బంది కేటాయించారు. బెల్ట్ షాపులను పూర్తిగా మూయించారు.. సాధారణంగా ఒక వ్యక్తి 6 ఫుల్ బాటిళ్ళు, 12 బీర్లను మాత్రమే వెంట తీసుకెళ్లేందుకు ఎక్సైజ్ చట్టం అనుమతిస్తోంది. మునుగోడు లో ఈ నిబంధనలను పక్కన పెట్టారు. ఎవరైనా రెండు బాటిళ్లకు మించి మద్యం తీసుకెళ్తే వాటిని బయటపడేస్తున్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో నవంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు నియోజకవర్గ పరిధిలో ఉన్న వైన్ షాపులను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు పోలీసులు 2,705 లీటర్ల మద్యం, రెండు బైకులు సీజ్ చేశారు. 28 మందిని అరెస్టు చేశారు.. ఈనెల 3 నుంచి శనివారం వరకు 27, 380 మద్యం క్వార్టర్లు, 48,448 బీర్ క్వార్టర్లు విక్రయించగా 31.99 కోట్ల ఆదాయం ఎక్సైజ్ శాఖకు లభించింది.
ముందుగానే డంప్ చేరిందా
ఎన్నికల కమిషన్ మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో పటిష్ట చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో రాజకీయ పార్టీల నాయకులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా అధికార పార్టీ మంత్రుల పైలట్ వాహనాల ఆసరాతో ఒక్కో వాహనంలో ప్రతిసారి రెండు కోట్ల చొప్పున నియోజకవర్గంలో వారు గుర్తించిన ప్రాంతంలో సంబంధిత వ్యక్తుల ఆధీనంలో డబ్బు డంపులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మరో ప్రధాన పార్టీ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల మీదుగా గ్రామాలకు వచ్చిన నేతల ద్వారా నగదు నియోజకవర్గంలో గుర్తించిన ప్రాంతాలకు చేరవేసినట్టు తెలుస్తోంది. ఒక నేతకు 50 వేల వరకు అందజేసి మూడు రోజుల పాటు వేలాదిమంది తమ పార్టీ నేతల ద్వారా ఆయా గ్రామాలకు డబ్బును సురక్షితంగా చేర్చినట్లు తెలుస్తోంది. మద్యం మీద కూడా ఆంక్షలు ఉండడంతో బూత్ స్థాయిలో ఉన్న ప్రతీ నేత ఎనిమిది క్వార్టర్లు చొప్పున కొనుగోలు చేసి వారి పరిధిలో పంపకాలు చేసుకొనేలా ఎత్తుగడ వేసినట్టు సమాచారం.