AP Govt Advisors : ఏపీలో ఇప్పుడు సలహాదారుల హవా నడుస్తోంది. వంద మందికిపైగా సలహాదారులు వైసీసీ సర్కారుకు ఉన్నారు. పాలనాపరమైన సలహాలు అందించి.. ప్రభుత్వానికి మెరుగైన సేవలందించడం వీరి పని. కానీ వీరెక్కడ ఉంటారో.. వీరి కార్యాలయాలు ఏమిటో అన్నది ఎవరికీ తెలియదు. ఠంచనుగా జీతం మాత్రం నెల తిరిగేసరికి వీరి ఖాతాల్లో చేరుతోంది.సలహదారులంటే వీరేదో తెలివైన వారూ కాదు. వైసీపీకి విధేయత ప్రదర్శించి పార్టీకి ఉపయోగపడిన వారే. అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి ఉపయోగడపడతారనుకున్న వారందరికీ జగన్ సలహాదారులుగా నియమించుకుపోతున్నారు. ప్రతీనెలా ఇద్దర్నే..ముగ్గుర్నో భర్తీ చేస్తున్నారు. తాజాగా సినీ నటుడు అలీని ఏపీ మీడియా సలహాదారుగా నియమించారు. అయితే అలీ సినీ నటుడిగా ఉండడంతో ప్రాచుర్యం లభించింది. కానీ ఈ నెల ప్రతీ తంతు కొనసాగుతోంది. గత ఎన్నికల్లో పార్టీ గెలుపునకు సహకరించారని, ఇప్పుడు ప్రభుత్వం చేసే అప్పులకు మార్గం చూపుతున్నారని కొందరు బ్యాంకు మాజీ అధికారులను సలహాదారులుగా నియమించుకున్నారు. సరాసరి వారికి నెలకు రూ.3 లక్షలకు పైగా వేతనాలు,అలవెన్స్ రూపంలో అందిస్తున్నారు.

దేవుపల్లి అమర్ అనే జర్నలిస్టు గుర్తున్నారు కదూ. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏపీ ప్రజలను అమ్మనా భూతులు తిట్టిన సదరు అమర్ కు అటు సాక్షి మీడియాలో, ఇటు వైసీపీ పవర్ లోకి వచ్చిన తరువాత మంచి గుర్తింపే లభించింది. సాక్షిలో లక్షలకు లక్షలు వేతనాలరూపంలో ఇవ్వలేమనుకున్నారో ఏమో కానీ అమర్ కు ఏకంగా సలహాదారుడిగా నియమించారు. నెలకు రూ.3 లక్షల వేతనం.. ఆపై అలవెన్స్ లు అందిస్తున్నారు. గత మూడున్నరేళ్లుగా ఈయనకు కోట్లాది రూపాయలు వేతనాల రూపంలో అప్పనంగా అప్పగించారు. అసలు ఈయన ఇస్తున్న సలహాలేమిటో? చేస్తున్న పనులేమిటో? ఎవరికీ తెలియడం లేదు. పైగా మూడు కార్యాలయాలను మెయింటెన్ చేస్తున్నట్టు చూపి భారీగా అలవెన్స్ లు పొందుతున్నారు.
ఇటీవల ఎస్సీ నియోజకవర్గం శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త సాంబశివరావుకు విద్యాశాఖలో సలహదారుడిగా నియమించారు. కానీ పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఆ మధ్యన ఎస్బీఐ మాజీ అధికారి రజనీష్ కు సలహాదారు పదవి కట్టబెట్టారు. నెలనెలా అప్పుల కోసం బ్యాంకుల తలుపులు తడుతున్న ఏపీ సర్కారుకు ఆయన అవసరముండడంతో సలహాదారు పదవి ఇచ్చి భారీగా సమర్పించుకుంటున్నారు. అయితే సలహాదారు నియామకాల వార్తకు సాక్షిలో సైతం పెద్దగా ప్రాధాన్యం దక్కడంలేదు. ఎందుకంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనిప్రజలకు తెలిసిపోతుందని ఏదో మూలన వార్త సరిపుచ్చుకుంటున్నారు. ఇక్కడే ఓ లాజిక్ ను ప్రదర్శిస్తున్నారు. ముందుగా నియామక ఉత్తర్వులిస్తున్నారు. తరువాత ఉత్తర్వుల్లో వేతనాలు, అలవెన్స్ ల ప్రకటన చేస్తామని చెబుతున్నారు.
వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇద్దరు, ముగ్గురు సలహాదారులు ఉండేవారు. చంద్రబాబు కూడా అదే పంథాను కొనసాగించారు. జగన్ మాత్రం ఈ విధానానికి సమూల మార్పులు తీసుకొచ్చారు. రాజకీయంగా పదవులు ఇవ్వలేనివారందరికీ సలహాదారులుగా నియమించారు. ఇప్పటికీ నియమిస్తునే ఉన్నారు. దేవదాయ శాఖలో సలహాదారు నియామకంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. వాద ప్రతివాదనలు విన్న కోర్టు ప్రజాప్రతినిధులు, వేలకు వేలు జీతాలుతీసుకున్న అధికారులు ఉండగా.. కొత్తగా ఈ సలహాదారులెందుకని ప్రశ్నించింది.సలహాదారు నియామకాన్ని రద్దుచేసింది. అయితే ఇదే తీర్పు అన్ని శాఖలకు వర్తిస్తుంది. కానీ వైసీపీ సర్కారు మాత్రం పట్టించుకోలేదు. రాజకీయ నిరుద్యోగులకు సలహాదారులుగా మార్చి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా వారికి అప్పగిస్తోంది.