Hyderabad Press Club: ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటి.. అన్యాయాలు, అక్రమాలు వెలికితీసే జర్నలిస్టుల్లోనూ పదవుల కోసం రాజకీయాలు మొదలు కావడం పరువు తీసేలా తయారయ్యాయని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలను చూస్తే అర్థమవుతోంది. ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కు జరిగిన ఎన్నికల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ ఎన్నికలు హైఓల్టేజీ రాజకీయ పోరును గుర్తుకు తెచ్చాయి. కుల, రాజకీయ అనుబంధాలకు అతీతంగా సాగాల్సిన జర్నలిస్టుల ఎన్నికల్లోనూ రాజకీయ, కుల పొత్తులు స్పష్టంగా బహిర్గతమయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ‘హైదరాబాద్ ప్రెస్ క్లబ్’ ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జర్నలిస్టులు కుల, ప్రాంతీయ ప్రాతిపదికన విభజించబడ్డారని.. అందుకే ఇప్పుడు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయని అంటున్నారు.
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఒక ప్యానెల్ బహిరంగంగా ‘రెడ్డి-ఆధిపత్య వర్గం’గా ఓపెన్ గా పేర్కొంది. ప్రత్యర్థి వర్గంలో ‘బ్రాహ్మణులు-కాపులు’ ఆధిపత్యంలో ఉన్నారు.ఇక ఇతర సామాజికవర్గాల వారు తక్కువ సంఖ్యలో వేరుగా ఉన్నారు. కానీ ఈ రెండు కుల సమూహాలు ప్రెస్ క్లబ్ పై పట్టు సాధించడానికి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద జర్నలిస్టుల క్లబ్ అయిన హైదరాబాద్ లో పదవులు నిర్వహిస్తే అది వారిని అధికార పార్టీలకు చేరువ చేస్తుందని.. అందుకే మేనేజ్ మెంట్ కమిటీని కైవసం చేసుకునేందుకు బడా జర్నలిస్టులంతా రంగంలోకి దిగి గెలిచేందుకు చాలా తతంగం నడిపారని ఆరోపణలున్నాయి.
ఇక మరో ప్రధాన ఆరోపణ ఏంటంటే.. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. వారు ప్రత్యేకంగా అగ్ర కుల ప్యానెల్ కు అండగా నిలిచి తమ అభ్యర్థులకు ఓట్లు రాబట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేసినట్టు భోగట్టా..
Also Read: Janasena-TDP: టీడీపీతో వెళితే పవన్ కు లాభమా? నష్టమా? కార్యకర్తల డిమాండ్లు ఇవీ!
ఇక ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో భారీగా డబ్బు చేతులు మారిందని.. పోలింగ్ కు ఒకరోజు ముందు కొందరు ప్రెస్ క్లబ్ సభ్యులకు డబ్బు పంచి సీనియర్ జర్నలిస్టుల మద్దతును కొనుగోలు చేశారని ప్రచారం సాగుతోంది.
ఇక అసలు తెలంగాణ జర్నలిస్టులు మాత్రమే ప్రెస్ క్లబ్ కు ప్రాతినిధ్యం వహించాలని.. బయట వ్యక్తులకు, ఆంధ్రా జర్నలిస్టులకు క్లబ్ లో చోటు లేదని టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ సెంటిమెంట్ కార్డ్ ను కూడా ఉపయోగించినట్టు సమాచారం. అందుకే ఇప్పుడు తెలంగాణ ప్రెస్ క్లబ్ పేరుతో ప్రత్యేక క్లబ్ ఏర్పాటు చేసి తెలంగాణ జర్నలిస్టులకే సభ్యత్వం ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు తెలిసింది. ఇలా జర్నలిజాన్ని కూడా రాజకీయంగా మార్చేసి పదవుల కోసం కొట్టుకునేలా చేస్తున్న రాజకీయాలను చూసి సీనియర్ జర్నలిస్టులంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
-ఇక హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో అవకతవకలంటూ ఆరోపణలు..
హైద్రాబాద్ కు కొత్త కార్యవర్గం కోసం జగిన ఎన్నికల్లో భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. బ్యాలెట్ పేపర్ పైన ఓటు వేయడానికి స్వస్తిక్ గుర్తును మాత్రమే ఉపయోగించాలి. కానీ కొన్ని బ్యాలెట్ పేపర్ల పై రౌండ్ ముద్ర, మరికొన్ని బ్యాలెట్ పేపర్ ల పైన ఇంటూ గుర్తులు ఉన్నాయి. ఇవి గమనించిన ప్రెసిడెంట్ అభ్యర్థి సూరజ్ భరద్వాజ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన అభ్యంతరాన్ని తెలియజేశారు.
అదే విధంగా పోలైన మొత్తం ఓట్లు, అభ్యర్థులకు పడ్డ ఓట్లు, చెల్లని ఓట్లు, మొత్తం సమానం కాలేదు. అంటే మొత్తం ఓట్లలో కొన్ని ఓట్లు గల్లంతయ్యాయి. ఈ అంశాలపై ప్రధానంగా అభ్యంతరం తెలపడంతో స్వస్తిక్ గుర్తుకు బదులు రౌండ్ సీల్ ఎలా వచ్చింది. కొన్ని బ్యాలెట్ పేపర్ల పై ఇంటూ గుర్తు ఎలా వేశారు అనేది తేలేంత వరకు హైద్రాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్ అధికారి నిలిపి వేశారు. దీనిపై విచారణకు ఆదేశించారు.
Also Read: Nagababu: జగన్ మళ్లీ గెలిస్తే వస్తే ఏపీ నుంచి వలసలు : నాగబాబు సంచలన వ్యాఖ్యలు