Mohammad Azharuddin: తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని పార్టీలు గెలుపు గుర్రాలను బరిలో దించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజల్లో మంచి పేరున్న నాయకులను ఎంపిక చేసి టిక్కెట్లు కట్టబెట్టేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల హడావిడి అధికంగా ఉంది. విపరీతమైన పోటీ నెలకొంది. హేమాహేమీలు రంగంలోకి దిగడం ఖాయంగా తేలుతోంది. మాజీ క్రికెటర్ అజరుద్దీన్ ఈసారి అసెంబ్లీ బరిలోకి దిగుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ నుండి గతంలో మాజీ మంత్రి పిజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. చాలా రోజులుగా ఆయన పార్టీలో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆయన బీఆర్ఎస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. కానీ గులాబీ దళం నుంచి ఎటువంటి పిలుపు లేకపోవడంతో ఆయన పునరాలోచనలో పడిపోయారు. అటు బిజెపి వైపు వెళ్తామన్నా ఆశించిన స్థాయిలో స్పందన లేదు. దీంతో విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ లోనే యాక్టివ్ అవుతున్నారు. అయితే రాహుల్ సభలకు కూడా విష్ణువర్ధన్ రెడ్డి హాజరు కాలేదు. అందుకే నాయకత్వం సైతం ఆయనను సైడు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇంతలో అజరుద్దీన్ జూబ్లీహిల్స్ స్థానంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. నియోజకవర్గంలో ముస్లిం జనాభా అధికం. అక్కడ ముస్లింలే ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తారు. అందుకే అజారుద్దీన్ ఆ నియోజకవర్గం పై దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకి రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉన్నట్లు టాక్ నడుస్తోంది. కానీ ఇటీవల యాక్టివ్ గా మారిన విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు అజరుద్దీన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వివాదాలు ఏర్పడుతున్నాయి. అయినా సరే అజరుద్దీన్ ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు.
మరోవైపు పీజేఆర్ కుమార్తె విజయ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. రేవంత్ రెడ్డి ఆమెను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గ నుంచి ఆమెను పోటీ చేయిస్తారని తెలుస్తోంది. ఒకే ఇంట్లో ఇద్దరికీ టికెట్లు ఇవ్వడం కుదరదు కనుక .. విష్ణువర్ధన్ రెడ్డిని పక్కన పెడతారని ప్రచారం జరుగుతోంది. ఆది నుంచి రేవంత్ రెడ్డి తో విష్ణుకు పొసగడం లేదు. ఇప్పుడదే ఆయనకు మైనస్ గా మారింది. మొత్తానికైతే అజరుద్దీన్ కు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లైన్ క్లియర్ అయినట్టుంది.