PM Modi and Punjab CM: పంజాబ్ లో రాజకీయ విభేదాలు రాజుకున్నాయి. ఎన్నికల వేళ ఈడీ దాడులు చేయడం సంచలనం కలిగిస్తోంది. ఓ వైపు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా మరోవైపు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేయడంతో ఇవి జరుగుతున్నాయని అధికార పార్టీ కాంగ్రెస్ వాపోతోంది. బీజేపీ కావాలనే దాడులు చేయిస్తోందని విమర్శలకు దిగుతోంది. కుట్రలతోనే దాడులకు పురమాయించిందని వాపోతోంది. ఫిబ్రవరి 20 నుంచి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దాడులు జరగడం సంచలనం సృష్టిస్తోంది
దీనిపై కాంగ్రెస్ రాద్దాంతం చేస్తోంది. బీజేపీ బురద జల్లే కార్యక్రమంలో భాగంగానే ఇలా దాడులకు తెగబడటం చోటుచేసుకుందని ఆరోపణులు చేస్తోంది. పంజాబ్ లో సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపీందర్ సింగ్ హనీ ఇంటితో పాటు మరో పది ప్రాంతాల్లో నేడు (మంగళవారం) ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం తెలిసిందే. దీంతో ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి ఇదివరకే ఆప్, మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఆరోపణలు చేసిన సందర్భంలో దాడులు జరిగాయనేది కొందరి వాదన.
పంజాబ్ లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో ఈడీ అధికారులు దాడులు కాంగ్రెస్ కు ఆశనిపాతంగా మారాయి. బీజేపీ ప్రోద్భలంతోనే దాడులు జరుగుతున్నట్లు కాంగ్రెస్ ఎదురు దాడి చేస్తోంది. అయితే దీనిపై మాకు సంబంధం లేదని బీజేపీ వాదిస్తోంది. కాంగ్రెస్ కు మైనింగ్ వ్యాపారాలతో సంబంధాలు ఉన్నాయనే గతంలోనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారని బీజేపీ చెబుతోంది.
పంజాబ్ లో ఈనెల 14న ఎన్నికలు జరగాల్సి ఉండగా 16న గురు రవిదాస్ జయంతి ఉన్న నేపథ్యంలో 20కి వాయిదా వేశారు. దీంతో పార్టీలన్ని ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్న సందర్భంలో ఈడీ అధికారుల దాడులు చర్చనీయాంశం అవుతున్నాయి. మొత్తానికి ఆప్ కు లాభమా? బీజేపీకి సహకారమో తెలియడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. దీంతో పంజాబ్ ఎన్నికల ముఖచిత్రం మారిపోతోంది.