
కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగిన మరుసటి రోజే మోడీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త కేబినెట్ ముద్రను తొలిరోజే చూపించారు. ఈ సందర్భంగా కరోనాపై తొలి అస్త్రం సంధించారు. దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక ప్యాకేజీకి ఆమోదం తెలిపింది.
కోవిడ్ అత్యవసర స్పందన నిధి కింద రూ.23123 కోట్లు కేటాయించాలని మోడీ కొత్త కేబినెట్ నిర్ణయించింది. ఈ నిధిని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఖర్చు చేయనున్నాయి. రూ.23వేల కోట్లలో రూ.15వేల కోట్లు కేంద్రం ఖర్చు చేయనుండగా.. రూ.8వేల కోట్లు రాష్ట్రాలకు కేటాయించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మన్ సుఖ్ మాండవీయ వెల్లడించారు.
ఈ ప్యాకేజీ జులై 2021 నుంచి మార్చి 2022 వరకు అమలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే 736 జిల్లాల్లో పిల్లల చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కొత్తగా 20వేల ఐసీయూ పడకలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. టెలీ మెడిసిన్ ద్వారా వైద్యానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రైతుల మౌలిక సదుపాయాల నిధి కింద రూ. లక్షకోట్లు ఖర్చు చేసేందుకు కేబినెట్ అంగీకరించిందన్నారు. ఈ నిధిని ఏపీఎంసీలు వాడుకోవచ్చన్నారు. సాగు చట్టాల అమలుతో ఏపీఎంసీలకు మరిన్నినిధులు వస్తాయన్నారు.