Chandrababu Modi : చంద్రబాబును అలా వాడుకోనున్న మోదీ

బిజెపితో ప్రతిష్ట బంధాన్ని ఏర్పరచుకునేందుకు ప్రయత్నిస్తారని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు వారణాసి లో ఎన్నికల ప్రచారానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Written By: NARESH, Updated On : May 16, 2024 2:57 pm

Modi will use Chandrababu like that

Follow us on

Chandrababu Modi : ప్రధాని మోదీ తరఫున చంద్రబాబు ప్రచారానికి వెళ్తారా? వారణాసిలో పర్యటిస్తారా? అక్కడ తెలుగువారిని ప్రభావితం చేస్తారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. తెలుగు వారు ఎక్కడ ఉన్నా.. అక్కడ చంద్రబాబుకు ఇమేజ్ ఉంది. ఇది చాలా సందర్భాల్లో స్పష్టమైంది. రాజకీయాల వల్ల ఏపీ ప్రజలు చంద్రబాబు విషయంలో భిన్నంగా ఆలోచించినా.. ఇతర ప్రాంతాల్లో ఉండే తెలుగు వారు మాత్రం సదాభిప్రాయంతో ఉంటారు. అందుకే బిజెపి చంద్రబాబు సేవలను ఉపయోగించుకోవాలని చూస్తోంది. వారణాసిలో చంద్రబాబుతో ప్రచారం చేయిస్తే తెలుగు ప్రజలను ఆకర్షించవచ్చని భావిస్తోంది. అందుకే ప్రధాని మోదీ స్వయంగా చంద్రబాబును ప్రచారం చేయాలని ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇటీవల వారణాసిలో జరిగిన ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమానికి పవన్ తో పాటు చంద్రబాబు హాజరయ్యారు. ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ఎన్నికల్లో మీరు కష్టపడ్డారని.. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం జూన్ 4న చూడబోతున్నారని ప్రధాని మోదీ చంద్రబాబుతో అన్నారు. అంతటితో ఆగకుండా అంతటి ఎండల్లో కష్టపడ్డారని.. నాకోసం ప్రచారం చేయగలరా? అని చంద్రబాబును ప్రధాని మోదీ అడిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రధాని నోటి నుంచి ఈ తరహా మాటలు వినేసరికి చంద్రబాబుకు ఏం చెప్పాలో తెలియలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు తప్పకుండా వారణాసి వెళ్లే అవకాశం ఉందని.. అక్కడఉపాధి, వ్యాపారాల నిమిత్తం చాలామంది తెలుగువారు స్థిరపడినట్లు తెలుస్తోంది. చంద్రబాబు వారణాసి వెళ్తే వారంతా ఎన్డీఏకు మద్దతు తెలుపుతారని ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చురుగ్గా పాల్గొన్నారు. మార్చి 27 నుంచి.. మే 11 వరకు మొత్తం 90 సభల్లో చంద్రబాబు పాల్గొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మధ్యలో రాజకీయ వ్యూహాలు, సీట్ల సర్దుబాట్లు వంటి అంశాల్లో కూడా బిజీబిజీగా గడిపారు. ఈ విషయం తెలుసుకునే కాబోలు ప్రధాని మోదీ చంద్రబాబుతో ఆ మాటలు అన్నట్లు టిడిపి వర్గాలు భావిస్తున్నాయి. అయితే వారణాసిలో ఏడో విడత పోలింగ్ జరగనుంది. అయితే ప్రధాని విన్నపం మేరకు చంద్రబాబు వారణాసికి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ తో పాటు ప్రచారం చేసే అవకాశాన్ని చంద్రబాబు జారవిడుచుకోరని.. బిజెపితో ప్రత్యేక బంధాన్ని ఏర్పరచుకునేందుకు ప్రయత్నిస్తారని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు వారణాసి లో ఎన్నికల ప్రచారానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.