Covishield vs Covaxin : భయపెడుతున్న కోవీ షీల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్ సమాచారం..

ప్రభుత్వం కానీ, వ్యాక్సిన్ కంపెనీలు గానీ ఈ సమాచారాన్ని అడుగడం లేదని, కాబట్టి ఎవరూ ఈ కాల్స్ కు రెస్పాన్స్ కావద్దని, కాల్ వచ్చిన వెంటనే కట్ చేస్తే మంచిదని సూచనలు చేస్తున్నారు.

Written By: NARESH, Updated On : May 16, 2024 3:01 pm

Covishield vs Covaxin

Follow us on

Covishield vs Covaxin : కోవీ షీల్డ్, కోవాక్సిన్ లాంటి వ్యాక్సిన్ల సమాచారం భయపెడుతోంది. వ్యాక్సిన్ తీసుకున్నారా? తీసుకుంటే ఈ నెంబర్ నొక్కండి.. తీసుకోకుంటే ఆ నెంబర్ నొక్కండి.. అంటూ కాల్స్ వస్తున్నాయి. మీరు వారు చెప్పినట్లు నొక్కారా? ఇక ఇబ్బందుల్లో పడినట్లేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

కరోనా మహమ్మారి ప్రత్యక్షంగా దాడి చేసి ప్రాణాలు తీసుకుంటే ఇప్పుడు పరోక్ష దాడి (కాల్స్) తో విలువైన సమాచారాన్ని దోచుకుంటోంది. మీరు చదివింది అక్షరాల నిజం. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఈ రెండు వ్యాక్సిన్ల వివరాలు అడుగుతూ విలువైన సమాచారం దొంగలిస్తున్నారట. ఇటీవల ఇది కోల్ కత్తాలో వెలుగు చూడడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ప్రజలకు అవగాహన కల్పించాలని మేయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నారు.

కరోనా వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు సంబంధించి చర్చలు కొనసాగుతున్న వేళ.. ఇప్పుడు మరో కొత్త టెన్షన్ వచ్చి పడింది. వ్యాక్సిన్‌ వల్ల కలిగే దుష్పరిణామాలపై భయపడేలా చేసి అమాయకుల వ్యక్తి గత సమాచారాన్ని చోరీ చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎవరికీ ఎలాంటి ఆర్థిక నష్టం జరగకపోవడం కొంతలో కొంత ఊరటను ఇచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. అయితే గుర్తు తెలియని నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తే మాత్రం అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా ఇటీవల ఒక వార్తను ప్రచురించింది. ‘కోవీ షీల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్ గురించి గుర్తు తెలియని నెంబర్ల నుంచి కాల్స్ చేస్తున్నారని.. సదరు వ్యక్తి ఆధార్ నెంబర్, బ్యాంక్ వివరాలు, తదితర వ్యక్తి గత సమాచారాన్ని సేకరిస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. ఈ కాల్ ఇటీవల కోల్‌కతా ప్రజలకు వస్తున్నట్లు పేర్కొన్నారు. కొంత మందికి IVRS కాల్ చేసి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం సాయంతో వారితో మోసాలు చేస్తున్నట్లు’ కథనంలో వెల్లడించింది.

ఇదే విషయంపై కోల్‌కతా పోలీస్ సైబర్ సెల్ అధికారి మాట్లాడుతూ.. ఒక వ్యక్తి కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా? లేదా? అని IVRS వాయిస్ మొదట అడుగుతుంది. ఆ తర్వాత కోవీషీల్డ్ అయితే ఒకటి (1) నొక్కండి.. కోవాక్సిన్ అయితే రెండు (2) నొక్కండి అని చెప్తుంది. వారి సూచనలు పాటిస్తే మీ ఫోన్ స్తంభిస్తుంది. దీంతో కొన్ని గంటల పాటు నెట్‌వర్క్ పూర్తిగా ఆగిపోతుంది’ అని చెప్పారు. దీని ద్వారా సదరు సైబర్ నేరగాడు మీ ఫోన్‌పై నియంత్రణ సాధించడంతో పాటు వ్యక్తి గత సమాచారాన్ని దోచుకుంటారని సైబర్ నిపుణులు చెప్తున్నారు.

ప్రభుత్వం కానీ, వ్యాక్సిన్ కంపెనీలు గానీ ఈ సమాచారాన్ని అడుగడం లేదని, కాబట్టి ఎవరూ ఈ కాల్స్ కు రెస్పాన్స్ కావద్దని, కాల్ వచ్చిన వెంటనే కట్ చేస్తే మంచిదని సూచనలు చేస్తున్నారు.