Modi AP Tour: ఏపీ రాజకీయాలను గమనించాలంటే ఒకసారి జగన్ సాక్షి మీడియాను చూస్తే సరిపోతుంది. అలాగని వారు రాసేవి, చెప్పేవి అన్ని కరెక్ట్ కాదు. అయితే ఆ కథనాలను చూసి ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. వైసీపీ సర్కారుకు, జగన్ కు మైలేజీచ్చే క్రమంలో లేనివి ఉన్నట్టు.. ఉన్నవి లేనట్టు.. కనికట్టు చేసే విధంగా రాతలు ఉంటాయి. విశాఖకు ప్రధాని మోదీ వచ్చే క్రమంలో… వైసీపీ సర్కారు చొరవతో రాష్ట్ర ప్రయోజనాలు, విభజన హామీలు నెరవేర్చేందుకేనన్నట్టు సాక్షి మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ తీరా ప్రధాని పర్యటనకు వస్తున్న ముందురోజు విడుదలైన షెడ్యూల్ తో సాక్షి చెప్పినవన్నీ ఉత్త కథలేనని తేలిపోయాయి. కొద్ది నెలల కిందటే ప్రధాని పర్యటన ఖరారైంది. అప్పటి నుంచి వైసీపీ నేతలు ఆర్భాటపు ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. విశాఖ ప్రత్యేక రైల్వేజోన్, భోగాపురం ఎయిర్ పోర్టు, గిరిజన యూనివర్సిటీ.. ఇలా కేంద్ర ప్రభుత్వంతో లింకున్న విభజన హామీలను గుర్తుచేస్తూ సాక్షిలో వరుసగా కథనాలు వచ్చాయి. తమ కృత్రిమ రాజధాని విశాఖకు మద్దతు సమీకరించాలని ఉత్తరాంధ్ర ప్రజలకు నమ్మించాలని చూశారు. కానీ గత పుష్కరకాలంగా సాక్షి మీడియాను చూస్తున్న ప్రజలు మాత్రం దీనిని లైట్ తీసుకున్నారు.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. విశాఖకు రైల్వేజోన్ రాకుంటేతన పదవికి రాజీనామా చేస్తానని కూడా ప్రకటించారు. ప్రధాని వస్తున్నది విశాఖ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనుల ప్రారంభోత్సవానికి కాదు.. అంతకు మించి అంటూ నేరుగా రైల్వేజోన్ అని ప్రకటించే సాహసం లేక… ట్విట్టర్ లో తెగ పోస్టులు వైరల్ చేశారు. అటు భోగాపురం ఎయిర్ పోర్టుకు సైతం లైన్ క్లీయర్ అయ్యింది. ప్రధాని మోదీ పనులకు ప్రారంభోత్సవంచేయడమే తరువాయి రన్ వే పై విమానాలు పరుగులు పెడతాయన్న రీతిలో బిల్డప్ ఇచ్చారు. ఎప్పటి నుంచో విజయనగరం జిల్లాలో ఏర్పాటుచేస్తారనుకున్న గిరిజన యూనివర్సిటీని ప్రారంభించి అడ్మిషన్లు ఇచ్చేస్తారన్న ప్రచారం మొదలు పెట్టారు. తీరా రేపు ప్రధాని మోదీ పర్యటన ప్రారంభమవుతుందనగా.. నేడు పీఎం కార్యాలయం నుంచి షెడ్యూల్ విడుదలైంది. అందులో రైల్వేజోన్ ప్రస్తావన లేదు.. భోగాపురం ఎయిర్ పోర్టు ఊసేలేదు. గిరిజన యూనివర్సిటీ అసలు సోదిలో కూడాలేకపోయింది. మొత్తానికి అటు విజయసాయి, ఇటు సాక్షి మీడియా నవ్వులపాలైంది.
అయితే ఇప్పుడు ఏపీ ప్రజల్లో జగన్ సర్కారు పాత్రపై చర్చ ప్రారంభమైంది. అత్యధిక ఆదాయం తెచ్చి పెట్టే రైల్వేస్టేషన్ లో విశాఖ ఒకటి. దానిని ఆధునీకరించాలన్న ప్రయత్నం చేస్తున్న రైల్వేశాఖకు అభినందిస్తున్నారు. అటు కేంద్ర సంస్థలకు సంబంధించి అభివృద్ధి పనులు చేస్తున్నారు. తద్వారా సాగర నగరం ప్రాముఖ్యత పెంచినట్టవుతారు. ఇదీ అభినందనీయమే. అయితే ఇందులో రాష్ట్ర ప్రభుత్వ చొరవేమిటన్నది ఇప్పుడు సగటు రాష్ట్ర ప్రజానీకం ప్రశ్న. ప్రధాని పర్యటనతో విభజన హామీలకు మోక్షం కలుగుతుందా? రాష్ట్రానికి మేలుచేసే ఏవైన నిర్ణయాలను ప్రధానితో ప్రకటింపజేస్తారా? కాదు కూడదు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయమని చెప్పించగలరా? అన్న సమాధానాలకు మాత్రం జగన్ కానీ, వైసీపీ ప్రజాప్రతినిధులు కానీ చెప్పలేకపోతున్నారు.

వైసీపీ నేతలు మాత్రం ఒక మంచి పనిచేస్తున్నారు. అది రాష్ట్ర ప్రజలకు కాదు. రాష్ట్ర బీజేపీ నాయకులకు. వారికి శ్రమ లేకుండానే లక్షలాది మంది జన సమీకరణ చేస్తున్నారు. ప్రధాని వస్తున్నది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి. ఆయన పర్యటనకు భద్రతలో పాలుపంచుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కానీ లక్షలాది మంది జన సమీకరణ చేయడానికి నిర్ణయించడం వెనుక కచ్చితంగా ఏదో రాజకీయ లబ్ధి ఉందని విశ్లేషకులు సైతం అనుమానిస్తున్నారు. ఉత్తరాంధ్రలో అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలను తరలించి ప్రధాని ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారంటే ఏదో ప్రయోజనం లేకుండా ఎందుకింత అన్న ప్రశ్న అయితే అందరి మదిలోనూ ఉంది. మొత్తానికైతే నెలల ముందు ప్రచారం మొదలు పెట్టి హైజాక్ చేసిన ప్రధాని పర్యటన మాత్రం వైసీపీ నేతలకు ప్రతికూల ఫలితాలు ఇచ్చే అవకాశముంది.