Jammu and Kashmir: ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ప్రయాణికులతో వెళ్తున్న బస్సుపై కాల్పులు జరిపి 10 మంది మరణానికి కారణమయ్యారు. భారత్ లో ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం వేళ అల్లకల్లోలం సృష్టించాలని అందుకు ప్రయాణికుల బస్సును లక్ష్యం చేసుకున్నారు. మరణించిన వారితో పాటు 33 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్‌పీ) రియాసి మోహిత శర్మ ఉగ్రదాడిపై వివరాలు తెలిపింది. ఆదివారం సాయంత్రం బస్సు జమ్ము-కశ్మీర్ లోని రియాసి జిల్లాలోని శివఖోరి ఆలయం నుంచి కత్రాకు తిరిగి వస్తుంది. దారి మధ్యలో దుండగులు ఒక్కసారిగి తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ హఠాత్ పరిణామంతో డ్రైవర్ బస్సు బ్యాలెన్స్ కోల్పోయాడు. దీంతో పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఇందులో ప్రయాణికులు ఎక్కడి వారు అనేది ఇంకా నిర్ధారణ కాలేదని ఆమె తెలిపారు.
స్థానికుల సాయంతో ప్రమాద స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించామని, ఇది రాత్రి 8.10 గంటల వరకు పూర్తయిందని, క్షతగాత్రులను రియాసి, ట్రెయత్, జమ్మూలోని వివిధ ఆసుపత్రులకు తరలించినట్లు పేర్కొన్నారు. మరోవైపు జమ్ము-కశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హాకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి పరిస్థితి గురించి తెలుసుకున్నారు.
పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మనోజ్ సిన్హాను ప్రధాని కోరారు. ‘ఈ హేయమైన చర్య వెనుక ఉన్న వారిని శిక్షిస్తామన్నారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం, సంరక్షణ అందించాలని ప్రధాని సూచించార’ని ఎల్జీ జమ్ము-కశ్మీర్ కార్యాలయం ఎక్స్‌పో ఒక పోస్ట్ లో పేర్కొంది.
Also Read: Modi: మోడీపై పీకే సంచలనం
ఈ ఉగ్రదాడిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా స్పందించారు. క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించేందుకు స్థానిక జమ్ము-కశ్మీర్ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోందని తన పోస్టులో పేర్కొన్నారు. యాత్రికులపై దాడి వెనుక ఉన్న వారిని వదిలిపెట్టేది లేదన్నారు.
రియాసీలో ఘటన పిరికి పంద చర్య అని, మృతుల కోసం ప్రార్థిస్తున్నానని మండి లోక్ సభ ఎంపీ కంగనా రనౌత్ అన్నారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ దాడిపై జమ్ము-కశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా స్పందిస్తూ.. పిరికిపంద పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత సైన్యం, జమ్ము-కశ్మీర్ పోలీసులు, మన పారామిలటరీ దళాలను ఎదుర్కోలేరన్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదులు తమ నేరానికి భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు.
Also Read: Modi Cabinet : కేంద్ర క్యాబినెట్లో జనసేనకు నో ఛాన్స్.. కారణమేంటి?
ఘటనా స్థలంలో రాష్ట్ర పోలీసులు, ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్ సంయుక్త ఆపరేషన్ హెడ్ క్వార్టర్స్ ను ఏర్పాటు చేసి దుండగుల కోసం ఆపరేషన్ ప్రారంభించారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు రాజౌరీ, రియాసి, పూంచ్ ఎగువ ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు భావిస్తున్నారు.