Modi: మోడీపై పీకే సంచలనం

Modi: తాజాగా నరేంద్ర మోడీ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ కిషోర్. కాంగ్రెస్తో పోల్చుకుంటే బిజెపి బలం మూడింతలు అధికంగా ఉందని..

Written By: Dharma, Updated On : June 10, 2024 11:47 am

Prashant Kishor sensational comments on Modi

Follow us on

Modi: ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే.. ఇప్పుడు కొత్త అవతారం ఎత్తారు. మొన్నటి వరకు రాజకీయ వ్యూహ కర్తగా ఉండేవారు. తరువాత రాజకీయ పార్టీ స్థాపించి నాయకుడిగా అవతారం ఎత్తారు. ఇప్పుడు సరికొత్త విశ్లేషకుడిగా సమకాలిన రాజకీయ అంశాలపై మాట్లాడుతున్నారు. తాను సేవలందించిన మమతా బెనర్జీ, జగన్మోహన్ రెడ్డికి దారుణ పరాజయం తప్పదని ఎన్నికలకు ముందే హెచ్చరించారు పీకే. దీంతో వారికి టార్గెట్ అయ్యారు. కానీ ఆయనచెప్పింది చెప్పినట్టు జరిగింది. ఏపీలో జగన్మోహన్ రెడ్డికి దారుణ పరాజయం ఎదురయ్యింది. అటు పీకే జోష్యం చెప్పినట్టు కేంద్రంలో బిజెపి కూడా అధికారంలోకి వచ్చింది.

తాజాగా నరేంద్ర మోడీ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ కిషోర్. కాంగ్రెస్తో పోల్చుకుంటే బిజెపి బలం మూడింతలు అధికంగా ఉందని.. వారిలా సంబరాలు ఎందుకు చేసుకోవడం లేదని పీకే ప్రశ్నించారు. 2014లో బిజెపి ప్రభంజనం సృష్టించింది. 2019లో సైతం అదే పరంపరను కొనసాగించింది. కానీ ఈ ఎన్నికలకు వచ్చేసరికి బలం కాస్త తగ్గింది.మిత్రులపై ఆధారపడాల్సి వచ్చింది.బిజెపి సొంతంగా అధికారానికి రాలేకపోయింది. దీంతో ఆ పార్టీలో ఒక రకమైన నిర్వేదం కనిపిస్తోంది. దానినే తప్పుపడుతున్నారు ప్రశాంత్ కిషోర్. ఇప్పటికీ దేశంలో అతిపెద్ద బలమైన పార్టీ బిజెపిగా గుర్తు చేస్తున్నారు.

2014లో కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం ఎదురైంది. 2019లో సైతం ఆ పార్టీ కోలుకోలేదు. ఎన్నికల్లో కొద్దిపాటి బలాన్ని పెంచుకుంది. కానీ 100 సీట్లను దాటి వెళ్ళలేదు. దీనినే గుర్తు చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్. 90 శాతం మార్కులు తెచ్చుకునే బిజెపి 70 శాతానికి పడిందని.. అసలు పాస్ మార్కు దాటని కాంగ్రెస్ పార్టీ కేవలం ఉత్తీర్ణత సాధించిందని.. కానీ మోడీ ఎందుకోఆందోళన చెందుతున్నారని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారు. దేశంలో బలమైన అతి పెద్ద పార్టీ బిజెపి అన్న విషయాన్ని మోడీ గుర్తించుకోవాలన్నారు. 99 సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటే.. 240కు పైగా సీట్లు సాధించిన బిజెపి ఎందుకు సంబరాలు చేసుకోవడం లేదని పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ నిలదీసినంత పని చేస్తున్నారు. కాంగ్రెస్ సంబరాలకు అర్థం లేదని చెప్పుకొస్తున్నారు. మొత్తానికైతే ప్రధాని మోదీ విషయంలో ప్రశాంత్ కిషోర్ విశ్లేషణ సంచలనంగా మారింది.