తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి కరోనా టెన్షన్ నెలకొంది. రాష్ట్రంలో రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో కరోనా పంజా విసిరింది. శాసనమండలిలో కరోనా మహమ్మారి కలకలం రేపింది. ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే.. శనివారం మండలి సమావేశాలకు హాజరైన ఎమ్మెల్సీ పురాణం సతీష్ మండలిలో మాట్లాడారు.
దీంతో ఇప్పుడు కౌన్సిల్ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారంతా టెస్టులు చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఈ మేరకు ఎమ్మెల్సీ సతీష్ సోషల్ మీడియాలో ఓ పోస్టు కూడా పెట్టారు. ‘పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, ప్రజలకు, నాయకులకు మనవి. నాకు ర్యాపిడ్ టెస్ట్‌లో నెగటివ్ రాగా, ఆర్‌టీపీసీఆర్ టెస్టులో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఐదు రోజులుగా నాతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారు హోమ్ ఐసోలేషన్ తో పాటు కోవిడ్ పరిక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను’ అని ట్విట్టర్‌లో సతీష్ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను షెడ్యూల్‌కు ముందే ముగించే యోచనలో ప్రభుత్వం ఉంది. రేపు లేదా ఎల్లుండి బడ్జెట్ సెషన్స్ క్లోజ్ అవనున్నాయి. అయితే షెడ్యూల్ ప్రకారం ఈనెల 26 వరకు సమావేశాలు నిర్వహించనున్నారు. బీఏసీ సమావేశం పెట్టి నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించనుంది. సతీష్‌కు కరోనా రావడంతో.. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. అసెంబ్లీ సమావేశాలను కుదించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
రోజురోజుకు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అటువైపుగా ఆలోచన చేస్తోంది. కొన్నిరోజులుగా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీనిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కోవిడ్ ఎఫెక్ట్ కాస్త తెలంగాణ అసెంబ్లీని సైతం తాకింది. ఇవాల్టి సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.