MLA Vasupalli Ganesh Kumar: ఫుల్ బాటిల్, రెండు కిలోల కోడి.. విశాఖలో వైసిపి ఎమ్మెల్యే తాయిలాలు

విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన గణేష్ కుమార్ గెలుపొందారు. కొద్ది రోజులకే వైసీపీలోకి ఫిరాయించారు. 2024 ఎన్నికల్లో మరోసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.

Written By: Dharma, Updated On : January 17, 2024 9:22 am

MLA Vasupalli Ganesh Kumar

Follow us on

MLA Vasupalli Ganesh Kumar: ఎన్నికల ఏడాది కావడంతో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అప్పుడే ఓటర్లకు తాయిలాలు ప్రారంభమయ్యాయి. విశాఖ జిల్లాలో అయితే పండుగ సందర్భంగా ఓ ఎమ్మెల్యే ఫుల్ బాటిల్ మద్యం తో పాటు రెండు కిలోల కోడిని పంపిణీ చేశారు. ఒకటి కాదు రెండు కాదు 400 ఫుల్ బాటిల్స్, అదే స్థాయిలో కోళ్లు పంపిణీ చేశారు విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. కనుమ సందర్భంగా తాను నిర్వహిస్తున్న కళాశాల వేదికగా చేసుకుని ఈ తాయిలాల పర్వానికి దిగారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వార్త.

విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన గణేష్ కుమార్ గెలుపొందారు. కొద్ది రోజులకే వైసీపీలోకి ఫిరాయించారు. 2024 ఎన్నికల్లో మరోసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయనకు టిక్కెట్ ఇవ్వొద్దని స్థానిక నాయకులు కోరుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కడం అనుమానమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో గణేష్ కుమార్ గట్టి ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. ముందుగా పార్టీ కేడర్ను తనవైపు తిప్పుకోవాలని భావిస్తున్నారు. దీనికి కనుమను వేదికగా చేసుకున్నారు.

నగరంలో రామబాణం పేరిట జూనియర్ కళాశాలను గణేష్ కుమార్ నిర్వహిస్తున్నారు. కాలేజీలోని ఓ గదిని తన కార్యాలయంగా వినియోగిస్తున్నారు. మంగళవారం వందల కోళ్లు, 400 వరకు మద్యం బాటిళ్లను కళాశాలకు తీసుకొచ్చారు. ఓ తరగతి గదిలో కార్యకర్తలను కూర్చోబెట్టి ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలపై చర్చించారు. అనంతరం మద్యం తో పాటు కోళ్లను పంపిణీ చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సాధారణంగా ఒక వ్యక్తి వద్ద మూడు ఫుల్ బాటిళ్లకు మించి ఉండకూడదు. అయితే వాసుపల్లి ఏకంగా 400 ఫుల్ బాటిళ్లు నిల్వ ఉంచడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.