Minister Viswarup and MLA Satish: వైసీపీ అధినేత తీరు వైసీపీ శ్రేణులకు సైతం అంతుపట్టడం లేదు. ఆయన వ్యవహార శైలి వారికి మింగుడు పడడం లేదు. కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ జరిగిన హింసాత్మక ఆందోళనపై జగన్ ఇంతవరకూ స్పందించలేదు. కనీసం దాని గురించి వాకబు చేసిన పాపాన పోలేదు. ఘటన జరిగినప్పుడు ఆయన దావోస్ లో ఉండడం వల్ల స్పందించలేదు. కనీసం రాష్ట్రానికి తిరిగి వచ్చిన తరువాత పట్టించుకోలేదు. చివరికి… గృహదహనాలకు బాధితులుగా మారిన మంత్రి పినిపె విశ్వరూప్, సీనియర్ ఎమ్మెల్యే సతీశ్‌లను సీఎం జగన్‌తోపాటు… పార్టీ ముఖ్యనేతలెవరూ పలకరించకపోవడం, పరామర్శించకపోవడం వైసీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక వైపు ‘సామాజిక న్యాయభేరి’ అంటూ… మరోవైపు దళిత మంత్రి విశ్వరూప్, బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే సతీశ్‌ను పలకరించకపోవడం తప్పుడు సంకేతాలకు దారి తీస్తోందని పార్టీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉండగా వైఎస్ జగన్ భారీ స్థాయిలో ఓదార్పు యాత్రలు చేసేవారు. ప్రమాదాలు, ఇతర దుర్ఘటనలు జరిగిన వెంటనే అక్కడికి చేరుకుని బాధితులను పరామర్శించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో వైసీపీ శ్రేణులకు సైతం విస్మయపరుస్తోంది.
అధినేత తీరుపై గుస్సా
వైసీపీ దిగువ స్థాయి కేడర్ అయితే స్థానిక ప్రజాప్రతినిధులు పరామర్శల పేరిట సరిపుచ్చుకునేవారు. కానీ ఇప్పుడు సొంత కేబినెట్‌లోని మంత్రి, సొంత పార్టీ ఎమ్మెల్యేలే బాధితులుగా మారినా పట్టించుకోకపోవడం గమనార్హం. గత నెల 24వ తేదీన అమలాపురంలో హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఆ సమయంలో జగన్ దావోస్‌లో ఉన్నారు. అక్కడి నుంచే మొత్తం పరిస్థితిని సమీక్షించి… మంత్రిని, ఎమ్మెల్యేను ఫోన్‌లో పరామర్శించవచ్చు.
Also Read: Sonali Bendre: అద్దె కట్టలేని సోనాలి బింద్రే అలాంటి సినిమాలు చేసిందా?
అయినా… ఆ పని చేయలేదు. దావోస్ పర్యటన నుంచి గత నెల 31న జగన్ తిరిగి వచ్చారు. గురువారం ఒక పెళ్లి రిసెప్షన్‌కు కూడా హాజరయ్యారు. బాధిత మంత్రి, ఎమ్మెల్యేను మాత్రం పరామర్శించలేదు. కనీసం పలకరించిన పాపాన పోలేదు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు హాజరవుతున్న ఆయన విధ్వంస ఘటనలో బాధితులను మాత్రం ఓదార్చకపోవడం విమర్శలకు తావిస్తోంది. అదే రెడ్డి సామాజికవర్గం వారైతే అదరాబాదరాగా పరామర్శించిన ఉదాంతాలు ఉన్నాయి. దీంతో ఈ విధ్వంసం వెనుక వైసీపీ ఉందన్న అనుమానాలకు ఏరికోరి జగనే అవకాశమిచ్చినట్టయ్యిందని వైసీపీ శ్రేణులు సైతం అంగీకరిస్తున్నాయి.
పెరుగుతున్న అనుమానాలు
అమలాపురం విధ్వంసం ఘటనకు సంబంధించి కేసు నెమ్మదించడం అనుమానాలు పేరుగుతున్నాయి. జిల్లా పేరుమార్పును వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళన భారీ హింసకు దారి తీసిన సంగతి తెలిసిందే. వాహనాలకు నిప్పంటించి, మంత్రి ఇంటికి నిప్పంటించినా పోలీసులు ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’కే పరిమితమవడంపై అప్పుడే కొంత చర్చ జరిగింది. ఈనెల 24వ తేదీతో జిల్లా పేరు మార్పు వ్యతిరేక ఉద్యమం కూడా ఆగిపోయింది. ఆ విషయం ఎలా ఉన్నా… రాష్ట్ర మంత్రి , ఎమ్మెల్యే ఇళ్లకు నిప్పు పెట్టినా హోంమంత్రి తానేటి వనిత అమలాపురం వెళ్లలేదు. డీజీపీ కూడా సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించకపోవడంపైనా వైసీపీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే సజ్జల రామకృష్ణా రెడ్డికానీ… పార్టీ అనుబంధ విభాగాల అధిపతి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డికానీ బాధిత మంత్రి, ఎమ్మెల్యేను పరామర్శించలేదు. పార్టీ గోదావరి జిల్లాల సమన్వయకర్త , టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా దీని గురించి పట్టించుకోలేదు. ఇక… సామాజిక న్యాయ భేరి పేరిట బస్సు యాత్ర చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మంత్రులు… పనిలోపనిగా అదే బస్సులో విశ్వరూప్, సతీశ్‌ల వద్దకు వెళ్లి, వారిని పరామర్శించి, సంఘీభావం ప్రకటించి ఉంటే బాగుండేదని పార్టీ నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు.
Also Read:Anusha Dandekar: బ్రేకప్ ల తరువాత ఆ నటి/యాంకర్ తల్లి ఎలా అయ్యింది?