CM Jagan Decisions : అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసి వివాహాలు చేయమంటారు పెద్దలు. రాజకీయాలకు కూడా ఈ సూత్రం అతికినట్టు సరిపోతుంది. ఏదైనా పదవులు ఇచ్చినప్పుడు, అవకాశాలు కల్పించినప్పుడు వారి కేరక్టర్ ఏమిటి? వారి ట్రాక్ రికార్డు ఏమిటి? అన్నది పరిశీలించి బాగుంటేనే ఇవ్వాలి. లేకుంటే వారితోనే ముప్పు ఎదురుకాక తప్పదు. అటువంటి పరిస్థితే ఏపీ సీఎం జగన్ కు భవిష్యత్ లో ఎదురుకానుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుడుతున్నారు. జగన్ రాజకీయంగా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ప్రతిబంధకంగా మారతాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాజ్యసభ పదవుల ఎంపిక విషయంలో ఆయన తొందరపడ్డారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి జెండా పట్టుకొని తిరిగి.. పార్టీ బలోపేతానికి క్రుషి చేసిన వారిని కాదని.. వివిధ కారణాలతో ఇతర రాష్ట్రాల వారిని ఎంపిక చేయడం తొలి తప్పు. అందునా వారి గుణ గణాలను తెలుసుకోకుండా పదవులు కట్టబెట్టడం రెండో తప్పు. ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా తెలంగాణకు చెందిన ఆర్. కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డిలను ఎంపిక చేశారు. నలుగురూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో నిరంజన్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఆయనకు అత్యంత ఆప్తులు. నమ్మకస్థులు. తొలి నుంచి జగన్ వెంట నడిచిన వారే. మిగతా ఇద్దరితోనే భవిష్యత్ లో తేడా కొడుతుందని అటు పార్టీ శ్రేణులు, రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.
చేతులు కాల్చుకున్న కేసీఆర్
తెలంగాణాలో ఇటువంటి ప్రయోగం చేసే సీఎం కేసీఆర్ చేతులు కాల్చుకున్నారు. లేనిపోని తలనొప్పులు తెచ్చి పెట్టుకున్నారు. నిప్పుతో తలగొక్కున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న డి.శ్రీనివాస్ ను పార్టీలోకి తీసుకొచ్చారు. అంతటితో ఆగకుండా పార్టీలో సీనియర్లను కాదని డీఎస్ కు రాజ్యసభ పదవి ఇచ్చారు. అదే డీఎస్ పార్టీకి కొరకరాని కొయ్యగా తయారయ్యారు. పార్టీని ఇరకాటంలో పెట్టేలా వ్యవహరించారు.అటు అనర్హత వేయ్యలేక.. చర్యలు తీసుకోలేక కేసీఆర్ ఇబ్బందిపడ్డారు.
అందుకే రాజ్యసభ స్థానాలను ఎంపిక చేసేటప్పుడు నమ్మకం, పార్టీ పట్ల విధేయత వంటివి చూడాలని చెబుతారు. ఎందుకంటే ఆరేళ్లపాటు ఉండే ఈ పదవి ముఖ్యమైనది. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు పార్టీ ప్రయోజనాలను కాపాడేవారికే పెద్దపీట వేయాలి. ఇప్పటికే జగన్ కు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుతో తలబొప్పి కడుతోంది. ఇటువంటి సమయంలో ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాల్సింది పోయి జగన్ ఏరికోరి భవిష్యత్ లో ఇబ్బందులు తెచ్చిపెట్టే వారికి రాజ్యసభ పదవులు కేటాయించడం సొంత పార్టీ శ్రేణుల్లో సైతం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక కొత్తగా ఎంపికయిన నలుగురిలో ఇద్దరి పరిస్థితి భవిష్యత్ లో అనుమానించదగినదేనని అంటున్నారు. ఒకవేళ 2024లో జగన్ అధికారంలోకి రాలేకపోతే ఇద్దరు పార్టీకి వ్యతిరేకంగా మారే అవకాశమూ లేకపోలేదు. అందులో బీద మస్తాన్ రావు ముందు వరుసలో ఉన్నారు.
రాజ్యసభకు ఎంపిక చేసిన బీద మస్తాన్ రావు కొద్దిరోజుల కిందటే టీడీపీ నుంచి వైసీపీ గూటికి వచ్చారు. ఆయన్ను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారో సొంత పార్టీ శ్రేణులకే తెలియడం లేదు. మొన్నటి వరకూ టీడీపీలో ముఖ్యనేతగా కొనసాగారు. ఇప్పటికే టీడీపీ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారంటారు. ఆయన సోదరుడు బీద రవిచంద్ర తెలుగుదేశం పార్టీలో ముఖ్య భూమికను పోషిస్తున్నారు. అధికారంలోకి మళ్లీ జగన్ వస్తే ఈయన నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. రాలేకపోతేనే.. పార్టీకి దూరంగా ఉంటారన్నది సీనియర్ నేతలు అంగీకరిస్తున్నారు. కేవలం బీసీ కార్డు ద్వారా ఎంపిక చేస్తే అనేక మంది రాష్ట్రంలో ఉన్నారని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఇవ్వాల్సిన గతి ఏం పట్టిందన్న ప్రశ్నలు కింది స్థాయి క్యాడర్ నుంచి కూడా వ్యక్తమవుతున్నాయి.
బీసీ నేత క్రిష్ణయ్యది అదే పరిస్థితి. ఆయన ట్రాక్ రికార్డు చూస్తే ఎప్పుడు ఏ పార్టీకి మద్దతిస్తారో? ఏ ఎన్నికలో ఎవర్ని సపోర్టు చేస్తారో తెలియదు. ఒక్క మాటగా చెప్పాలంటే ఆయన మరో సీతయ్య. ఎవరి మాట వినరు. రేపు ఎన్నికల్లో బీసీల తరుపున చంద్రబాబును దూషించడానికి పని చేస్తారు. భవిష్యత్ లో ఈయన ఎటు వైపు టర్న్ తీసుకుంటారో ఎవరికీ తెలియదు. తెలంగాణ కు చెందిన వ్యక్తి. తెలంగాణ ప్రయోజనాలకు భిన్నంగా కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కేంద్రానికి వ్యతిరేకంగా పెద్దల సభలో తన గళం విప్పుతారు. ఆర్. కృష్ణయ్య కూడా టీడీపీ, కాంగ్రెస్ ల నుంచి వచ్చిన వారు. ఏపీ లోని బీసీలను కదిలించే శక్తి ఆయనకు ఉందా? అన్నది కూడా అనుమానమే. ఈయనపై తాజాగా తెలంగాణలో భూ కబ్జా కేసు నమోదయింది. మొత్తానికి రెండు రాజ్యసభ స్థానాలను జగన్ వేస్ట్ చేశారని పార్టీ వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయి. భవిష్యత్ లో జగన్ కు ఈ ఇద్దరు తలనొప్పిగా మారతారన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.
Also Read:Sonali Bendre: అద్దె కట్టలేని సోనాలి బింద్రే అలాంటి సినిమాలు చేసిందా?