MLA Rajaiah: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పథకం దళితబంధు. ప్రస్తుతం విమర్శలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇప్పటికే హుజురాబాద్ లో ఎమ్మెల్యేల అనుచరులకే వర్తింపజేశారనే అపవాదును మూటగట్టుకున్న ప్రభుత్వానికి తాజాగా మరో అప్రదిష్ట ఆపాదించింది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య సోదరుడు సర్పంచ్ సురేష్ కుమార్ కు దళితబంధు పథకం వర్తింపజేయడం వివాదాస్పదమవుతోంది. దీంతో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. పేదల కోసం ఉద్దేశించిన పథకంలో ప్రజాప్రతినిధులకు ఎలా స్థానం ఉంటుందనే ప్రశ్నలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి.
దీనికి ఏం సమాధానం చెబతారు. ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక కార్యకలాపాల్లో ఇదో మచ్చుతునక మాత్రమేనని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. హుజురాబాద్ లో కూడా ఇలాగే ప్రజాప్రతినిధుల అనుచరులకే దళితబంధు పథకం వర్తింపజేశారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల ఒత్తిడితో వారి బంధువులకు కొమ్ముకాస్తూ లబ్ధిపొందుతున్నారని కాంగ్రెస్, బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం లెక్కచేయడం లేదు. ఇదంతా మామూలే అని లైట్ గా తీసుకుంటోంది.
Also Read: Janasena Party: జనసేనలోకి ఆ రెండు పార్టీలు.. ఏపీ భవిష్యత్తు సీఎం పవన్ కళ్యాణ్ యేనా?
ఇంకా ఎంపీపీ భర్తతోపాటు రఘునాథపల్లి జెడ్పీటీసీ అజయ్ కుమార్ పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో మొత్తం ప్రజాప్రతినిధుల అనుచరులకే వర్తింపజేశారని సమాచారం. దీనిపై ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో వేచి చూడాలి. అన్నింటికి ఎగిరిపడే కేటీఆర్ ఈ విషయంలో ఏం చెబుతారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. గతంలో కూడా ఎమ్మెల్యే రాజయ్య వ్యవహారం వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన సంగతి అందరికి విధితమే.
పేదలకు లాభం చేకూర్చాలని తీసుకొచ్చిన పథకం ఇలా అడ్డదారులు తొక్కుతుంటే ఇక పేదలకు లాభమా? లేక పెద్దలకు ప్రయోజనమా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలతో లబ్ధి చేకూర్చే పథకానికి ఆదిలోనే తూట్లు పొడవడం చూస్తుంటే ప్రభుత్వం ఎంత బాగా పనిచేస్తోందో అర్థమవుతోంది. పేదలకు చేరాల్సిన పథకాలు ఎమ్మెల్యేల ఇంటి సభ్యులకు చేదోడుగా నిలవడం ఆశ్చర్యకరమే. దీంతో ఎమ్మెల్యే రాజయ్య మరో వివాదంలో ఇరుక్కోవడంతో ఇప్పుడు ఏం చేస్తారనే వాదనలు కూడా వస్తున్నాయి.