
తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. గడిచిన వారం పదిరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పేద, ధనిక, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా కరోనా అందరినీ సమానంగా చూస్తుంది. కరోనా వారియర్స్ గా విధులు నిర్వహిస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, జర్నలిస్టులు పెద్దసంఖ్యలో ఈ మహమ్మరి బారినపడ్డారు. కొందరు ప్రాణాలను సైతం పొగట్టుకోవడం విషాదకారంగా మారింది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5వేలకు చేరువలో ఉంది. 2,377మంది కరోనా నుంచి కోలుకోగా 185మంది కరోనా మృత్యు వాతపడ్డారు.
ఇటీవల తెలంగాణలో లాక్డౌన్ సడలింపులు భారీగా ఇవ్వడంతో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఇందులో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఎమ్మెల్యేలు సైతం ఉండటంతో ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా తాజాగా నిజామబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. నిజామబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు ఇటీవలే కరోనా పాజిటివ్ తేలింది. దీంతో ఆయన కాంటాక్ట్ కావడంతో ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు సైతం కరోనా సోకినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన నిజమాబాద్ నుంచి నేరుగా హైదరాబాద్ కు కారులో వెళ్లి ఆసుప్రతిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఈ ఇద్దరు ఎమ్మెల్యేతో కాంటాక్ట్ అయిన అధికారులు, ప్రజాప్రతినిధులు హోంక్వారంటైన్ కు వెళ్లారు.
ఇటీవలే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి సైతం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే ఎమ్మెల్యే భార్య, వంట మనిషి, కారు డ్రైవర్, గన్‌మెన్‌కు కూడా కరోనా సోకింది. అయితే ముత్తిరెడ్డికి కరోనా లక్షణాలు లేకపోవడంతో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. మంత్రి హరీశ్ రావు పీఏకు సైతం కరోనా సోకింది. దీంతో హరీష్ రావు హోంక్వారంటైన్లోకి వెళ్లారు. మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్‌కు సైతం కరోనా పాజిటివ్ తేలడంతో మేయర్ కరోనా పరీక్షలు చేయించుకోగా నెగిటివ్ వచ్చింది.
ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఓఎస్డీకి సైతం కరోనా పాజిటివ్ తేలింది. ఇప్పటికే పెద్దసంఖ్యలో వైద్యులు, వైద్య సిబ్బంది కరోనా బారినపడ్డారు. దీంతో వైద్యులపై అధిక భారం పడుతుంది. ఈనేపథ్యంలో ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతుండటం మరింత ఆందోళన కలిగిస్తుంది. వీరితో ఎవరూ కాంటాక్ట్ అయ్యారో వారు హోంక్వారంటైన్లోకి వెళ్లిపోతున్నారు. దీంతో తెలంగాణలో కరోనా సోకిన ఎమ్మెల్యే సంఖ్య ముగ్గురికి చేరింది. మున్ముందు మరింత మందికి కరోనా సోకే అవకాశం లేకపోలేదని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.