Dharmaana Prasad Rao: నిత్యం ఏదో ఒక వివాదంతో ఏపీ ప్రభుత్వం వార్తల్లోకెక్కుతోంది. తాజాగా రాష్ట్రంలో ‘చెత్త’ వివాదం రాజుకుంది. ప్రభుత్వం చెత్త సేకరణకు రూ.100 వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో చెత్త వసూలుకు పన్ను కట్టడమేంటని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. పథకాలకు డబ్బులు పంచే ప్రభుత్వం చెత్త సేకరణకు పన్ను వేస్తే తప్పేంటి..? అని అన్నారు. దీంతో ఆ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా దూమారం లేపాయి. కొర్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో విధిస్తున్న ఈ చెత్త పన్నును చాలా చోట్ల వ్యతిరేకిస్తున్నారు. చెత్తపై పన్ను ఎందుకు కట్టాలని అడుగుతున్నారు. పన్ను కట్టేది లేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ధర్మాన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని కొత్త పద్ధతులను ప్రవేశపెట్టినప్పుడు వాటికి అనుగుణంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం ఏ లక్ష్యంతో చేస్తోందో ప్రజలకు వివరించాలన్నారు. ఇళ్లల్లో రోజూ చెత్త నిండిపోతుందని, వాటిని సేకరించకపోతే ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
‘సాధారణంగా నగరాలు, పట్టణాలు, మున్సిపాలిటీల నుంచి సేకరించిన చెత్తను ఎక్కడా వేయడానికి వీలులేకుండా మారింది. అంటే సేకరించిన చెత్తను ప్రాసెస్ చేసి ఇతర అవసరాలకు ఉపయోగించాలి. అలాంటప్పుడు కొన్ని డబ్బులు అవసరం పడుతున్నాయి. చెత్తను ఎక్కడ వేసినా అక్కడి గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి సమయంలో రూ.100 వసూలు చేస్తే తప్పేంటి..?’ అని ధర్మాన వివరించారు. చెత్తను సేకరించి శివారులో వేస్తే సమీప గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాంటప్పుడు ఇంకో ప్లేసులో వేయాలి. కానీ డంప్ యార్డు వేసే స్థలాలు తక్కువగా ఉన్నాయి.. అందువల్ల చెత్త ప్రాసెస్ కోసం రూ.100 వసూలు చేయక తప్పడం లేదు’ అని అన్నారు.
నెలకు రూ.100 ఇవ్వమని అడుగుతున్నాం. అంటే సంవత్సరానికి రూ.1200. ఇంత పెద్ద కార్యక్రమం చేపడుతున్నప్పుడు ఏడాది పొడవునా ఆ మొత్తాన్ని ఇచ్చుకోలేరా..? దీనికి ఇంత రాద్ధాంతం ఎందుకు..? చెత్త ప్రాసెస్ కోసం ప్రత్యేకంగా ఈమాత్రం చేయలేరా..? అని ధర్మానా లాజిక్ ప్రశ్నలు లేవదీశారు.
ఇక ప్రభుత్వం నుంచి అనేక పథకాల ద్వారా డబ్బులు వస్తున్నాయి కదా..? ఇలాంటి వాటికి పైసా కట్టం అంటే ఎలా..? అని ప్రశ్నించారు. చెత్త సేకరణకు రూ.100 రీజనబుల్ గా ఉంది. ఎంత వీలైతే అంత తగ్గిస్తారు. మిగతాది చెల్లించమని వార్డుల్లో ఉండే నాయకులు, సెక్రటేరియేట్ సిబ్బంది, చైతన్యవంతులైనా పౌరులు అందరూ దీనిపైన పనిచేయాలి అని ధర్మాన కోరారు.
అయితే ధర్మాన ఎంత కవర్ చేయాలని చూసినా.. చెత్తపై పన్ను ఏంటి అని అందరూ నిలదీస్తున్నారు. ప్రజలు దీన్ని అంగీకరించే పరిస్థితిలో లేరు. ఇప్పటికే చాలా చోట్ల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. పథకాలు భారీగా ఇస్తున్నప్పుడు పన్నులు వేస్తే తప్పేంటి అన్న వైసీపీ నేతల వ్యాఖ్యలు పుండుమీద కారం చల్లినట్లుగా మారాయి.