
నోటి దురద వారికి మంత్రిపదవులను దూరం చేయబోతోంది. నోటికాటికి వచ్చిన మంత్రిపదవులు వీరి కామెంట్లతో దూరం కానున్నాయి. పార్టీ కోసం ఏదో మాట్లాడుదామని.. ఇంకేదో మాట్లాడేసరికి అసలుకే ఎసరు ఏర్పడింది. ఇటీవల ఇద్దరు సీనియర్ వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు వారి ప్లేసును పొగొట్టుకునే ప్రమాదంలో పడేశాయన్న చర్చ సాగుతోంది. త్వరలో ఏపీ కేబీనెట్ విస్తరణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొందరు మంత్రులు తమ పదవులు ఎక్కడ ఊడుతాయోనన్న ఆందోళనలో ఉన్నారు. అయితే ఇద్దరి కీలక వైసీపీ ఎమ్మెల్యేలు తమకు ఈసారి మంత్రి పదవులు ఖాయం అనుకున్నారు. కానీ వారు చేసిన తీవ్ర వ్యాఖ్యలే కొంప ముంచేటట్లు ఉన్నాయి.
వైసీపీ మంత్రివర్గంలో అంబటి రాంబాబు అంటే జగన్ మనిషి అని చర్చించుకుంటారు. ప్రతిపక్షంను తిప్పికొట్టడంలోనూ..పార్టీ గురించి చెప్పడంలోనూ ఆయనది ప్రత్యేక శైలి. దీంతో ఆయన జగన్ కు సన్నిహిత నేతగా పేరుపొందాడు. అయితే అంబటి రాంబాబు ఇటీవల కాపు సామాజిక వర్గంపై కొన్ని వ్యాఖ్యలు చేశాడు. వాస్తవానికి అంబటి కూడా కాపు వర్గానికి చెందినవారే. అయినా ఆయన ఆ వర్గం వారిని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన క్షమాపణలు చెప్పారు.
ఇప్పటికే కాపు సామాజిక వర్గం వైసీపీకి దూరం అవుతోంది. ఈ తరుణంలో అంబటి చేసిన వ్యాఖ్యలు పార్టీ పరువును తీసేలా ఉన్నాయి. దీంతో ఆయనను మంత్రి పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం సాగుతోంది. గతంలో కాపు సామాజికవర్గం పెద్ద ఉద్యమమే చేసింది. దీంతో మరోసారి ప్రభుత్వంపై వారు తిరగబడకముందే అంబటిని తప్పిస్తే ఆ వర్గం నుంచి పెద్దగా మైనస్ జరిగే అవకాశం ఉండదని జగన్ వర్గం భావిస్తోంది.
ఇక మరో వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన ఈయన సొంత పార్టీపైనే విమర్శలు చేశారు. జగన్ పక్కా ఇళ్లు శోభనానికి కూడా పనికిరావు అంటూ వ్యాఖ్యలు చేయడం దూమారం రేపినట్లయింది. దీంతో ఆయనకు మంత్రి పదవి ఈసారి దక్కే అవకాశాలు లేవని భావిస్తున్నారట. వచ్చే కేబినెట్ లో చోటు ఖాయం అనుకున్న నల్లపురెడ్డిని తప్పించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. మరోవైపు విజయలక్ష్మికి అవకాశం ఇచ్చేందుకు కూడా ప్రసన్నకుమార్ రెడ్డి పక్కనపెడుతారనే చర్చ సాగుతోంది.