Homeజాతీయ వార్తలుష‌ర్మిల‌ను ఛాన‌ళ్లు ఎత్తుకుంటే స‌రిపోతుందా?

ష‌ర్మిల‌ను ఛాన‌ళ్లు ఎత్తుకుంటే స‌రిపోతుందా?

మీడియాలో ప్ర‌చారం చేసుకుంటే స‌రిపోతుంది.. జ‌నాల్లో ఒక‌ర‌క‌మైన పాజిటివ్ వేవ్ వ‌చ్చేస్తుంది. ఇక, దాన్ని ప‌ట్టుకు ముందుకు సాగితే.. మంచికాలం ముందు ఉంటుంద‌న్న‌ది రాజ‌కీయ పార్టీల అభిప్రాయం. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితులు విరుద్ధంగా ఉన్నా.. వాటిని క‌ప్పి పుచ్చితే చాలు అన్న చందంగా రాజ‌కీయ పార్టీలు వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇదేవిధ‌మైన ప‌ద్ధ‌తిని అనుస‌రిస్తున్నాయ‌నే విమ‌ర్శ‌లు చాలా కాలంగా ఉన్నాయి. అయితే.. ఇప్పుడు కొత్త‌గా పార్టీ పెట్టిన ష‌ర్మిల సైతం ఇదేవిధ‌మైన ప‌ద్ధ‌తిని ఫాలో అయిపోతోంద‌ని అంటున్నారు.

ష‌ర్మిల తెలంగాణ‌లో పార్టీ పెట్ట‌డం ప‌ట్ల జ‌నాల్లో ఆస‌క్తి ఉందా? అంటే.. అవును అని చెప్పే ప‌రిస్థితి లేదు. ఆమె ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన వ్య‌క్తి. అక్క‌డ ఆమె అన్న ముఖ్య‌మంత్రిగా ఉన్నాడు. ఏ ర‌కంగా చూసిన ఆమె అక్క‌డి మ‌నిషే. మ‌రి, ఏపీని వ‌దిలి తెలంగాణ‌లో వ‌చ్చి పార్టీ పెట్ట‌డ‌మేంటన్న‌దే ఇక్క‌డి జ‌నాల ప్రాథ‌మిక ప్ర‌శ్న‌. పైగా.. ఆమె తండ్రి తెలంగాణ‌ను స్వ‌యంగా వ్య‌తిరేకించిన వ్య‌క్తి. ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డితే.. హైద‌రాబాద్ కు వీసా తీసుకొని రావాల్సి ఉంటుంది అన్నాడు. మ‌రి, ఇప్పుడు ష‌ర్మిల ఏ వీసా తీసుకొని వ‌చ్చి పార్టీ పెట్టింద‌న్న ప్ర‌శ్న ముందుకు వ‌స్తుంది. అస‌లు, వైఎస్ బ‌తికుంటే.. తెలంగాణ వ‌చ్చేదే కాదంటారు విశ్లేష‌కులు.

రాజ్యాంగ ప్ర‌కారం దేశంలో ఎక్క‌డైనా ఎవ‌రైనా పార్టీ పెట్టొచ్చు, ఎన్నిక‌ల్లో పోటీచేయొచ్చు, ప్ర‌జాప్ర‌తినిధులుగా కూడా ఎన్నిక కావొచ్చు. దీన్ని ఎవ్వ‌రూ కాద‌న‌డానికి లేదు. కానీ.. ప్ర‌జ‌లు అంగీక‌రించాలి క‌దా? ఆమోదించాలి క‌దా? అలా చూసిన‌ప్పుడు.. తెలంగాణ‌లో ష‌ర్మిల స‌క్సెస్ అవ్వ‌డానికి ఉన్న శాతం ఎండ‌మావి వంటిదే అన్న‌ది చాలా మంది అంచ‌నా. ష‌ర్మిల పార్టీ ప్ర‌క‌టించిన రోజున సోష‌ల్ మీడియాలో పేలిన జోకులే ఇందుకు నిద‌ర్శ‌నం. మ‌రి, తెలంగాణ‌లో కొత్త పార్టీ రావాల్సినంత రాజ‌కీయ శూన్య‌త ఉందా? అంటే.. అది కూడా లేదు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ సార‌థ్యంలో టీఆర్ఎస్ ప్ర‌బ‌ల శ‌క్తిగా ఉంది. దానికి ప్ర‌త్యామ్నాయం తామే అని నిరూపించుకునేందుకు బీజేపీ త‌హ‌త‌హ‌లాడుతోంది. ఇక‌, రేవంత్ రాక‌తో.. కాంగ్రెస్ దూకుడు మీదుంది. ఈ పార్టీల‌న్నింటికీ సాంప్ర‌దాయ ఓటింగ్‌, క్షేత్ర‌స్థాయిలో బ‌ల‌మైన కేడ‌ర్ ఉంది. మ‌రి, ష‌ర్మిల‌ వీటిని ఢీకొట్ట‌డం సాధ్య‌మ‌వుతుందా? ఢీకొడ‌తాన‌ని చెప్ప‌గానే అయిపోతుందా? అన్న‌ది ప్ర‌శ్న‌.

ప్ర‌స్తుతానికి మాత్రం మీడియా జాకీలు పెట్టి లేపే ప్ర‌య‌త్నం చేస్తోంది. ప్ర‌ధాన మీడియాగా చెప్పుకునే సంస్థ‌లు.. తాము రాసిందే వార్త అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. నిజాలు మాట్లాడ‌డం ఎప్పుడో మ‌రిచిపోయాయ‌ని, గ‌ల్ల‌గురిగిలో పైస‌లు వేస్తే.. తప్ప పెన్ను ముందుకు క‌ద‌ల‌ద‌నే అప‌వాదు కూడా ఉంది. అలాంటి మీడియా.. ష‌ర్మిల పార్టీ అనౌన్స్ కు ముందు, త‌ర్వాత ఓ రేంజ్ లో ఎత్తుకునే ప్ర‌య‌త్నం చేశాయి. ఇత‌ర వాస్త‌వాల‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోని మీడియా.. జ‌నాల్లో ఏమాత్రం అలికిడిలేని ష‌ర్మిల పార్టీ గురించి బూర ఊద‌డంప‌ట్ల విస్మ‌యం వ్య‌క్త‌మైంది.

ఉదాహ‌ర‌ణ‌కు మొన్న చిరంజీవి దాదాపు 30 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి ఆక్సీజ‌న్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే.. క‌నీసం ఓ వార్త రాయ‌డానికి చేతులు రాలేదు. ఎంట‌ర్ టైన్మెంట్లో బిట్టుగా వేశారు. ఆ మ‌ధ్య ప‌వ‌న్ రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన క‌వాతుకు 5 ల‌క్ష‌ల మంది హాజ‌రైతే.. స్క్రోలింగుల‌తో స‌రిపెట్టారు. ఎవ‌రు డ‌బ్బులు వెద‌జ‌ల్లితే.. వాళ్ల వార్త‌లు మాత్ర‌మే ప్ర‌ముఖంగా వేసేలా త‌యారైన‌ మీడియా.. ఇవాళ ష‌ర్మిల‌ను ఏ కార‌ణంతో ఎత్తుకుందో అంద‌రికీ తెలిసిందే. అయితే.. ఛాన‌ళ్లు డ‌బ్బులకు వార్త‌లు అమ్ముకుంటున్నాయి. పార్టీలు కొంటున్నాయి. ఇలా.. వీళ్లూ వీళ్లూ బుడ‌గ‌ను గాలితో నింపిన‌ట్టుగా నింపేసి చూపిస్తే స‌రిపోతుందా? జ‌నం అంగీక‌రించాల్సిన అవ‌స‌రం.. ఆమోదించాల్సిన ప‌ని లేదా? అన్న‌దే అంతిమ ప్ర‌శ్న‌.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version