Vidadala Rajini: మంత్రి విడదల రజిని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లో ఆమెకు పరిస్థితులు అనుకూలించడం లేదా? స్థానిక వైసీపీ శ్రేణులు ఆమెకు సహకరించడం లేదా? ఆమె పునరాలోచనలో పడ్డారా? ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా ఆమె పరిస్థితి మారిందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తనకు దెబ్బ తప్పదని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. తొలిసారి చిలకలూరిపేట నుంచి పోటీ చేసిన ఆమె.. సిట్టింగ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పై విజయం సాధించారు. విస్తరణలో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. కానీ ఇప్పుడు జగన్ ఆమెకు స్థానచలనం కల్పించడంతో.. కక్కలేక మింగలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
చిలకలూరిపేటకు ప్రాతినిధ్యం వహిస్తున్న విడదల రజనీని జగన్ గుంటూరు పశ్చిమ కు పంపించారు. కానీ ఆమెకు అక్కడ పట్టు దొరకడం లేదు. ఆ నియోజకవర్గంలో అధికార పార్టీకి నాయకులు ఎక్కువే. వారందరినీ కలుపుకొని వెళ్లడం రజనీకి సాధ్యపడడం లేదు. ప్రస్తుతం ఆమె వెంట ద్వితీయ శ్రేణి క్యాడర్ మాత్రమే ఉంది. కీలక నాయకులు ఆమెకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. అది అలానే కొనసాగితే ఎన్నికల్లో ప్రభావం చూపుతోందని ఆమె ఆందోళన చెందుతున్నారు. పోనీ చిలకలూరిపేట వెళదామంటే అక్కడ కూడా పరిస్థితి బాగాలేదు. జగన్ సైతం ఒప్పుకోవడం లేదు. మరి ఎలా ముందుకెళ్లాలో ఆమెకు తెలియడం లేదు.
గత ఐదు సంవత్సరాలుగా చిలకలూరిపేటలో రజిని తన ముద్ర చూపించారు. చివరకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు సైతం లెక్క చేయలేదు. తన నియోజకవర్గంలో పర్యటించాలంటే తప్పకుండా అనుమతి తీసుకోవాలని పెద్ద హెచ్చరిక పంపేవారు. కేవలం రజిని వైఖరి కారణంగానే శ్రీకృష్ణదేవరాయలు పార్టీని వీడినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే చిలకలూరిపేటలో టిడిపి పట్టు బిగిస్తోంది. పైగా అక్కడ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, మల్లెల రాజేష్ నాయుడు రజినిని తీవ్రంగా వ్యతిరేకించారు. వారి ఒత్తిడి మూలంగానే విడదల రజినీని జగన్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపించారు. కానీ అక్కడ కూడా పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో రజిని ఆందోళన చెందుతున్నారు.
చిలకలూరిపేటకు షిఫ్ట్ అయితే ఎలా ఉంటుంది అని రజిని ఆలోచిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గానికి చెందిన కీలక నాయకుడు జాన్ సైదా తో రజిని చర్చలు జరిపారు. సైదా సైతం గతంలో చిలకలూరిపేట టికెట్ కోసం ప్రయత్నించారు. అప్పట్లో సైదాను రజిని పక్కన పడేశారు. ఇప్పుడు అదే నాయకుడిని పిలిపించుకొని మాట్లాడుతుండడం విశేషం. ఒకవేళ చిలకలూరిపేట తిరిగి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? పార్టీ క్యాడర్ సహకరిస్తుందా? లేదా? గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే ఉండిపోవడం శ్రేయస్కరమా? ఇలా రకరకాల ప్రశ్నలతో రజిని ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు సమాచారం. చిలకలూరిపేటలో హాయిగా ఉంటున్న తరుణంలో తనను.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడాన్ని ఆమె సహించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. కానీ బయట పెట్టలేని స్థితి ఆమెది. అయితే చిలకలూరిపేట టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నిస్తారని ప్రచారం జరుగుతోంది. మరి రజిని ఎలా ముందుకు వెళతారో చూడాలి.