Minister KTR- Pawan Kalyan: రాజకీయాలు అనగానే.. ఒకరిపై ఒకరు విమర్శలు.. సవాళ్లు.. అవసరమనుకుంటే దాడులు.. ఇవన్నీ ఉంటాయి. ఒక్కోసారి కొందరు నాయకులు చేసే విమర్శలు చేస్తే వీరిద్దర బద్ధ శత్రువులు అని అనుకుంటారు. అయితే రాజకీయాలు వేరు..స్నేహం వేరు.. అని తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజకీయాల్లో ఎంత పెద్ద విమర్శలు చేసుకున్నా.. పర్సనల్ గా అందరూ నాకు మిత్రులే అని అంటున్నారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కల్యాణ్ గురించి చెప్పుకొచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు మంచి మిత్రుడని అన్నారు. ఏపీసీఎం జగన్ తో కూడా మంచి స్నేహం ఉందని అన్నారు. అయితే కేటీఆర్ చేసిన వ్యాఖ్యల మతలబేంటి? అన్న చర్చ సాగుతోంది.
సాధారణ సమయంలో ఘాటు విమర్శలు చేసే బీఆర్ఎస్ నాయకులు ఎన్నికొలొచ్చేసరికి వారి స్వరం మారుతోంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు రాగానే బీఆర్ఎస్ నాయకులు ఆంధ్రా, తెలంగాణ అని విభిజించి మాట్లాడుతున్నారు. ఎన్నికలొస్తున్న ప్రతీసారి కేసీఆర్ ఆంధ్రావాళ్ల పెత్తనం గురించి కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఆంధ్రాలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ విస్తరిస్తుందని చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో గోదావరి, కృష్ఝా జలాల విషయంలో పరుష వ్యాఖ్యలు చేసి ప్రజలను అయోమయంలోకి నెట్టారు.
ఇటీవల కాలంలో ఏపీలో రాజకీయ పరిస్థితులు మారుతున్నట్లు తెలుస్తోంది. అధికారంలో ఉన్న వైసీపీకి పోటీగా ఓ వైపు టీడీపీ..మరోవైపు జనసేనలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పవన్ కల్యాన్ వారాహి విజయయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యాత్రకు అడుగడుగునా జనం ఆదరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పవన్ కల్యాణ్ క్రేజ్ పెరిగిపోతుందని అంటున్నారు. అటు టీడీపీ నుంచి లోకేష్ నిరంతరం పాదయాత్ర చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీలు కలిసి పోయే అవకాశం ఉంటుందన్న ప్రచారం జరగుతోంది.
ఈ తరుణంలో కేటీఆర్ ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రధానంగా ఆయన పవన్ కల్యాణ్ గురించే ఎక్కువగా మాట్లాడారు. పవన్ నాకు మంచి మిత్రుడన్నారు. ఆయన సినిమాలు చూస్తుంటానని తెలిపారు. రాజకీయంగా ఎవరి దారులు వారికి.. కానీ పర్సనల్ గా ఆయనతో మంచి సంబంధాలున్నాయని అన్నారు.అలాగే జగన్ తో కూడా సత్సంబంధాలున్నట్లు చెప్పారు.
భవిష్యత్ లో ఏపీలో రాజకీయ పరిస్థితులు మారితే పవన్ ను కలుపుకోవచ్చన్న ఉద్దేశంతోనే కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని కొందరు అంటున్నారు. అలాగే ఏపీలో విస్తృతంగా పర్యటిస్తున్న పవన్ తెలంగాణలో యాత్ర చేయడం లేదు. అభిమానుల నుంచి ఒత్తిడి ఉన్నా ఇక్కడ కొన్ని రాజకీయ కారణాల వల్ల చేపట్టేలేదని తెలుస్తుంది. గత ఎన్నికల్లోకేసీఆర్ కు మద్దతు ఇచ్చిన పవన్ ఈసారి కూడా అదే బాటలో వెళ్తారని అంటున్నారు. ఇందులో భాగంగానే కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయంగా చర్చ సాగుతోంది.