AP Capital Visakha: మూడు రాజధానుల విషయంలో వైసీపీ ప్రభుత్వ వ్యూహమేమిటి? న్యాయపరమైన చిక్కులు అధిగమించలేమని సీఎం జగన్ భావిస్తున్నారా? అటువంటప్పుడు ఇప్పుడు చేస్తున్న హడావుడి ఏమిటి? అమరావతి రైతుల మహా పాదయాత్ర 2.0 నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే ఈ పన్నాగం పన్నారా? లేకుంటే ప్రభుత్వం వద్ద ప్రత్యేక వ్యూహం ఏమైనా ఉందా? ఇప్పుడు అందరి మదిలో తొలుస్తున్న ప్రశ్న ఇది. దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టత వస్తుందని భావించినా.. మరింత సంక్లిష్టంగా మారిందే తప్ప…దీనికి తుది పరిష్కారమంటూ ఏదీ కనిపించడం లేదు. అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులపై స్వల్పకాలిక చర్చ అయితే జరిగింది. సీఎం జగన్ దీనిపై ప్రసంగించారు. పాలనా వికేంద్రీకరణే తమ ప్రభుత్వ ధ్యేయమని ప్రసంగించారు.ఈ చర్చ జరుగుతున్నప్పుడు కానీ.. తన ప్రసంగం ముగుస్తున్నప్పుడు కానీ ఎక్కడా బిల్లు ప్రవేశపెడతామన్న మాట చెప్పలేదు. అసలు దాని గురించి ప్రస్తావనే లేదు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ షెడ్యూల్ ప్రకటించిన తరువాత మూడు రాజధానుల బిల్లుకేనంటూ వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి డ్రాఫ్ట్ కూడా రెడీ అయ్యిందని టాక్ నడిచింది. మూడు రాజధానులపై ప్రభుత్వ పట్టు బిగిస్తుందని అంతా భావించారు. కానీ దానికి విరుద్ధంగా జరిగింది. కేవలం వికేంద్రీకరణే మా విధానమంటూ చెప్పి ముగించారు. అసలు బిల్లే ప్రవేశపెట్టనప్పుడు వికేంద్రీకరణ ఎలా సాధ్యమన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

మంత్రి అమర్నాథ్ ప్రకటన…
మరోవైపు వచ్చే విద్యాసంవత్సరం నుంచి విశాఖ రాజధాని పాలన ప్రారంభమవుతుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ అసెంబ్లీలో ప్రకటించారు. అంటే ప్రస్తుతానికి తాత్కాలికంగా ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టేనన్న భావన వ్యక్తమైంది. మూడు రాజధానుల విషయం మరింత సంక్లిష్టంగా మార్చి..చర్చకు దారితీయ్యాలన్నది ప్రభుత్వ అభిమతంగా తేలింది. ఒకటి న్యాయపరమైన చిక్కులు అధిగమించలేమని ప్రభుత్వం భావించి ఉండవచ్చు. ఎందుకంటే మూడు రాజధానులకు మద్దతుగా ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు శాసనసభలో బిల్లు పెట్టింది. ఓ సారిశాసనమండలిలో సెలక్ట్ కమిటీకి పంపినా.. దానిని పరిగణలోకి తీసుకోకుండా శాసనసభలో మరో బిల్లును ప్రవేశపెట్టారు.ఏకపక్షంగా ఆమోదం తెలిపారు. చివరకు గవర్నర్ ఆమోదం తెలిపినా.. న్యాయపరమైన చిక్కులు రావడంతో హైకోర్టులో విచారణ జరుగుతుండగా బిల్లును వెనక్కి తీసుకున్నారు. కానీ ఈ బిల్లుపైనా వేసిన పిటీషన్లు పెండింగ్ లో ఉన్నాయి.
Also Read:
Pawan Kalyan- Ram Charan: చరణ్ దగ్గర అప్పు చేసి తీర్చలేకపోయిన పవన్… ఎంత ఇవ్వాలో తెలిస్తే షాక్ అవుతారు!
అసాధ్యమని తెలిసినా..
సాంకేతికంగా, న్యాపరంగా చూస్తే మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో పెట్టడం అసాధ్యం. ఈ విషయంలో రాజధాని రైతులు కోర్టులో వేసిన పిటీషన్ విచారణ సమయంలో హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. రిట్ ఆఫ్ మాండమస్ ప్రకటించింది. అంటే రాజధాని మార్పు విషయంలో చట్టసభలకు కూడా హక్కులేదని తేల్చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని కూడా స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రకారం అసెంబ్లీలో ప్రభుత్వం మాత్రం బిల్లుపెడితే రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుంది. ఆమోదం తెలిపితే మాత్రం రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుంది. దీనిపై న్యాయ నిపుణులు హెచ్చిరించడంతోనే జగన్ సర్కారు తాత్కాలికంగా వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది.

ఆ తగ్గడం వెనుక?
అయితే ఆది నుంచి అమరావతి విషయంలో జగన్ సర్కారు కర్కశంగా ముందుకెళుతోంది. విపక్షాలు వ్యతిరేకించినా, రైతుల నుంచి ప్రతిఘటన ఎదురైనా వెనక్కి తగ్గలేదు. ఇప్పడు కూడా మూడు రాజధానుల బిల్లు విషయంలో జగన్ మరింత కఠినంగా ముందుకెళతారన్న వాదన ఉంది. గతంలోనూ ఇదే అంశంపై జగన్ సుదీర్ఘంగా మాట్లాడారు. న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థలోకి చొచ్చుకొస్తోందని ఆరోపణలు చేశారు. దీనిని అంగీకరించమంటూనే ప్రత్యేకంగా తీర్మానం రూపొందించారు. ఇప్పుడు కూడా మా విధానం పాలనా వికేంద్రీకరణే అంటూ ప్రకటించారు. తద్వారా మూడు రాజధానులే తమ అభిమతమని.. దీనిని నుంచి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. అయితే తాత్కాలికంగా మాత్రం వెనక్కి తగ్గిన సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా అసెంబ్లీ సమావేశాలకు ఒక రోజు గడువు ఉన్న నేపథ్యంలో ఎటువంటి ప్రకటన వస్తుందో చూడాలి మరీ.