Minister Dharmana Prasada Rao: ఈ మధ్యన మంత్రి ధర్మాన ప్రసాదరావు పరిస్థితి ఏమంత బాగాలేదు. విస్తరణలో మంత్రి పదవి వచ్చిందన్న ఆనందమే కానీ పవర్ ఎంజాయ్ చేయలేకపోతున్నానన్న బాధ ఆయన్ను వెంటాడుతోంది. అయితే ఎలాగోలా నెట్టుకొస్తున్నారు కానీ.. ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలు, నిలదీతలు, నిరసనలకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. శ్రీకాకుళంలో ధర్మాన సభలంటే గేట్లకు తాళాలు వేసి మహిళలకు నిలువరించాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా అటువంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. ఓటు ఎవరికీ వేస్తావమ్మా అని ఓ పథకం లబ్ధిదారు అయిన మహిళను అడిగితే.. ఇంకెవరికి వేస్తాం.. సైకిల్ కి అనేసరికి మంత్రి ధర్మానకు మైండ్ బ్లాక్ అయ్యింది.
తొలి మూడేళ్లలో జగన్ అంటేనే మండిపడిన ధర్మాన ప్రసాదరావు మంత్రి పదవి దక్కేసరికి మనసు మార్చుకున్నారు. మంత్రి పదవి లేకపోయేసరికి ప్రభుత్వం గురించి కానీ.. పార్టీ గురించి కానీ పెద్దగా మాట్లాడలేదు. జగన్ అంటేనే అంతర్గత సమావేశాల్లో మండిపోయేవారు. అస్సలు జగన్ కు పాలన రాదంటూ ఎద్దేవా చేసిన సందర్భాలున్నాయి. శ్రీకాకుళం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినా హెడ్ క్వార్టర్ లో జరిగే ఏ సమావేశానికి , కార్యక్రమానికి హాజరయ్యేవారు కాదు. కానీ విస్తరణలో మంత్రి పదవి దక్కేసరికి నా సామి రంగా జగన్ ప్రభుత్వాన్ని ఆకాశాన్నెత్తేస్తున్నారు. కానీ ధర్మాన మనసును గుర్తెరిగిన ప్రజలు ఎప్పటికప్పుడు ఝలక్ లు ఇస్తున్నారు.
మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఉత్తరాంధ్ర రాజధానికి మద్దతు సేకరించేందుకు ధర్మాన ప్రయత్నించారు. ఇంతకాలానికి జగన్ గుర్తించి మనకు రాజధాని ఇస్తుంటే మనం ఆహ్వానించలేకపోతున్నామని.. ఇంతకంటే దౌర్భగ్య స్థితి ఉంటుందా? అని ప్రజలకు ఎడ్యుకేట్ చేశారు. కానీ విశాఖ రాజధానికి ఎంత మంది మద్దతు తెలుపుతారు అంటూ సభలు, సమావేశాల్లో బల పరీక్ష చేసేవారు. కానీ ప్రజలు మాత్రం స్వాగతించం.. వ్యతిరేకించం అన్నట్టు తటస్థంగా ఉండిపోయేసరికి ఆశ్చర్యపోవడం ధర్మాన వంతైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చేసరికి ప్రత్యేక ఉత్తరాంధ్ర ఉద్యమం అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. దానికి కూడా ప్రజలు లైట్ గా తీసుకున్నారు.
అయితే ఎందుకొచ్చింది గొడవ అంటూ ఇప్పుడు ధర్మాన తన సొంత నియోజకవర్గానికే పరిమితమయ్యారు. వచ్చే ఎన్నికల్లో తాను తప్పుకొని కుమారుడు రామ్ మనోహర్ నాయుడుకు లైన్ క్లియర్ చేయాలని చూస్తున్నారు. అందుకే కుమారుడ్ని పట్టుకొని శ్రీకాకుళం నియోజకవర్గంలో వరుస పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. కానీ ప్రజలు పెద్దగా రెస్పాండ్ కావడం లేదు. ఆ మధ్యన ఆసరా సమావేశాలకు వెళ్లిన ధర్మానకు మహిళలు చుక్కలు చూపించారు. చుట్టూ ప్రహరీ ఉండి.. ఒకటి రెండు గేట్లు ఉండే ప్రాంగణాలను ఎంచుకొని సమావేశాలు నిర్వహించారు. కానీ మహిళలు ప్రహరీలు దాటుకొని పరుగెత్తారు. ఇదేం పద్ధతి అని ప్రశ్నించిన ధర్మానకి ఏం ఒత్తినే ఇస్తున్నారా? మా డబ్బులే కదా.. అనేసరికి మైండ్ బ్లాక్ అయ్యింది. తాజాగా జగనన్న సురక్షలో మేము సైకిల్ కే ఓటేస్తామని ఓ మహిళ చెప్పడంతో ధర్మాన నీరుగారిపోయారు.