ఉత్తరప్రదేశ్ రాజకీయాలు మారుతున్నాయి. పొత్తులతో ఎత్తులు వేస్తున్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో పంథాల వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ వంద సీట్లలో ఎంఐఎం పోటీ చేస్తుందని ప్రచారం జోరందుకోవడంతో రాజకీయాలు రసకందాయంలో పడనున్నాయని తెలుస్తోంది. ఎంఐఎం బీజేపీ విజయానికి పరోక్షంగా సహరిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న సందర్భంలో యూపీపై అందరి దృష్టి పడుతోంది. దేశంలోనే అత్యధిక స్థానాలున్న ప్రాంతంగా గుర్తింపు పొందిన యూపీ ప్రస్తుత రాజకీయాలు హల్ చల్ చేస్తున్నాయి. రాబోయే ఎన్నికల నాటికి సమూల మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బీహార్ లో గత ఎన్నికల సందర్భంలో ఎంఐఎం వల్లే ఆర్జేడీ అధికారం కోల్పోయి బీజేపీ కూటమి విజయం సాధించింది. దీంతో ఈ ఫలితాలే ఉత్తరప్రదేశ్ లో కూడా రిపీటయ్యే సూచనలు కనిసిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో బీజేపీకే ఎంఐఎం పరోక్షంగా మద్దతు పలుకుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమాజ్ వాదీ పార్టీ కూడా ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడిపోయింది. ఎంఐఎం ప్రాబల్యం తగ్గించేందుకు పావులు కదుపుతోంది.
ఉత్తరప్రదేశ్ లో ముస్లిం సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు సమాజ్ వాదీ పార్టీ ప్రయత్నిస్తోంది. గతంలో ముస్లింలు ఎక్కువగా కాంగ్రెస్ వైపు చూసినా ప్రస్తుతం వారి వైఖరిలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వారి ఓట్లు రాబట్టుకునే క్రమంలో అన్ని పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వారిని తమ వైపు తిప్పుకునేందుకు దారులు వెతుక్కుంటున్నాయి.
యూపీలో అసదుద్దీన్ కు చెక్ పెట్టేందుకే సమాజ్ వాదీ పలు మార్గాలు అన్వేషిస్తోంది. ముస్లిం సామాజిక వర్గాన్ని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నంలో అన్ని రకాలుగా ఆలోచిస్తోంది. ఎంఐఎం వల్ల బీజేపీ లాభ పడుతోందని ప్రచారం చేస్తూ ముస్లిం ఓట్లు దానికి పోకుండా కట్టడి చేస్తోంది. దీంతో యూపీలో రాజకీయ పరిణామాలు విచిత్రంగా మారనున్నాయి. రాబోయే ఎన్నికల నాటికి పలు రంగాల్లో మార్పులు చోటుచేసుకుంటాయనే ఆలోచన అందరిలో నెలకొంది.