రాష్ర్టంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 9.5 లక్షల మందికి పైగా నిరుద్యోగ యువత ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తోంది. సొంత కాళ్లపై నిలబడి కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆసక్తి చూపుతోంది. దరఖాస్తులు లక్షల్లో ఉండగా కొద్దిమందికే మంజూరు చేస్తున్నారు. దీంతో నిరుద్యోగుల్లో నైరాష్యం పెరుగుతోంది. మరోవైపు మూడేళ్ల క్రితం మంజూరైన రూ.300 కోట్లలో సగం నిధులు కూడా బీసీ కారొ్పరేషన్ ఖర్చు చేయలేదు. దీంతో నిరుద్యోగులు ఏళ్లుగా ఎదురుచూపులు తప్ప ఫలితం కనిపించడం లేదు.
గిరిజన సహకార ఆర్థిక సంస్థ పరిధిలో ప్రస్తుతం 2018-19 ఏడాదికి సంబంధించిన దరఖాస్తుల్ని ఇప్పుడు పరిష్కరిస్తున్నారు. ఈ ఏడాది మరో లక్ష మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 2 లక్షల మంది యువత రాయితీ రుణాల కోసం ఎదురు చూస్తున్నారు. గత ఏఢాది రూ.650 కోట్లు కేటాయించినా ఇప్పటికి నిధులు విడుదల కాలేదు. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్ల పరిధిలో 2014 తరువాత రుణాల కోసం 2017-18లో ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంది. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లు సహకార సమాఖ్యల పరిధిలో 5.70 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో ఏటా 2 లక్షల మందికి పైగా అభ్యర్థులు రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటారు. 2018-19 నుంచి పంపిణీ నిలిచిపోయింది. ఇప్పటి వరకు ఏళ్లుగా ఎదురుచూస్తున్న 2.47 లక్షల మంది దరఖాస్తులన్నింటిని ప్రభుత్వం రద్దు చేసి కొత్తగా పెట్టుకోవాలని సూచించింది. 2020-21 ఏడాదికి 1.73 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 18,285 మందికే రుణాలివ్వాలని ఎస్సీ కార్పొరేషన్ నిర్ణయించింది. 2020-21 ఏడాదికి రూ.786 కోట్లు కేటాయించినా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.