Microplastics Human Breast Milk: అమ్మపాలు అమృతంతో సమానం అంటుంది వైద్య శాస్త్రం. పుట్టిన బిడ్డకు కనీసం ఆరు నెలలు తల్లిపాలు పడితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, అనారోగ్యం దరిచేరదని శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే డాక్టర్లు కూడా పుట్టిన బిడ్డకు వెంటనే తల్లిపాలు పట్టించాలని సూచిస్తుంటారు. కానీ అమృతం లాంటి అమ్మపాలు కూడా కలుషితమవుతున్నాయి. ప్లాస్టిక్ తల్లిపాలను విషతుల్యం చేస్తోంది. తాజాగా ఈ నిజాన్ని ఇటలీ శాస్త్రవేత్తల బృందం ఇటీవల గుర్తించింది. తల్లిపాలల్లో మైక్రో ప్లాస్టిక్ అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు పరిశోధకులు. ఇన్నాళ్లూ బిడ్డకు అమృతంగా భావించే పాలు విషతుల్యం కావడంతో ఈ పాలు బిడ్డల ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం చూపుతాయో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన 34 ఏళ్ల మహిళపై పరీక్షలు చేసి ఆమె పాలల్లో ప్లాస్టిక్ కణాలను గుర్తించారు. ఈ ఘటనతో పాలివ్వడం మంచిదని చెప్పాల? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నారు పరిశోధకులు. ఈ పాలతో ఉపయోగాల కంటే ప్రమాదమే ఎక్కువగా ఉండటంతో పరిశోధకులు భయాందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని పరిశోధనలు..
తల్లి పాలల్లో ప్లాస్టిక్ అవశేషాలు గుర్తించిన నేపథ్యంలో త్వరితగతిన మరిన్ని పరిశోధనలు చేయాల్సిన ఆవశ్యకతను శాస్త్రవేత్తలు గుర్తించారు. తాము ఇంతవరకు సుమారు 5 మిల్లి మీటర్ల కంటే తక్కువ ఉండే ప్లాస్టిక్ కణాలను మానవ కణ తంతుల్లోనూ, జంతువుల్లో, సముద్ర జీవుల్లోనూ గుర్తించామని తెలిపారు. అవన్నీ ల్యాబ్‌లో చనిపోయిన వాటిపై జరిపిన పరిశోధనల్లో బయటపడినట్లు పేర్కొన్నారు. తాజా పరిశోధనల ఆధారంగా గర్భిణి మహిళ గర్భధారణ సమయంలో ప్లాస్టిక్ వాటిల్లో సర్వ్ చేసే ఏ ఆహారాన్ని తీసుకోవద్దని హెచ్చరించారు.
ఆహారం విషయంలో జాగ్రత్త..
తీసుకునే ఆహారం విషయంలో కూడా గర్భిణులు కాస్త జాగ్రత్తగా ఉండాలంటున్నారు సైంటిస్టులు. ఎందుకంటే మానవుని కార్యకలాపాల కారణంగానే జంతువుల శరీరాల్లో ప్లాస్టిక్ కణాలు ఉంటున్నాయని అన్నారు. మరీ ముఖ్యంగా గర్భిణులు సీ ఫుడ్ తీసుకునేటప్పుyడు, పాలు తాగే విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ప్రస్తుతం మైక్రోప్లాస్టిక్‌తో కలిగే నష్టాల కంటే తల్లిపాల ప్రయోజనాల గురించే నొక్కి చెప్పాల్సిన అవసరం ఎంతైన ఉందని ఇటలీ వైద్యుడు నోటార్‌స్టెషానో తెలిపారు.
కాలుష్య నియంత్రణతోనే..
కాలుష్యాన్ని నియంత్రణతోనే ప్లాస్టిక్ అవశేషాలను మనుషుల్లో, జంతువుల్లో పూర్తిగా లేకుండా చేయగలుగుతామంటున్నారు శాస్త్రవేత్తలు. ఈమేరకు ప్లాస్టిక్ నిషేధ చట్టాలను ప్రోత్సహించేలా పాలకులపై ఒత్తిడి తీసుకురావాలని పేర్కొంటున్నారు. తల్లి పాలలో ప్లాస్టిక్ అవశేషాలు ఉన్నాయని, పిల్లలకు బాటిల్ పాలను అలవాటు చేయడం మంచిద కాదంటున్నారు. పోతపాలతో పిల్లల శరీరంలోకి మరింత ప్లాస్టిక్ వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్‌తో ప్యాక్ చేసే ఆహారం, పానీయాలు, సౌందర్య ఉత్పత్తులు, టూత్ పేస్ట్‌లు, సింథటిక్ ఫ్యాబ్రిక్‌తో చేసే దుస్తులు కూడా వాడకుండా ఉండాలని గర్భిణిలకు సూచిస్తున్నారు.

మనం చేసే తప్పే.. మనకు ముప్పు..
మనం చేసే తప్పే మనకు ముప్పుగా పనిణమిస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు తాజాగా తల్లి పాలల్లో ప్లాస్టిక్ అవశేషాలు బయటపడడమే నిదర్శనం. ప్లాస్టిక్ వద్దుముర్రో అని ప్రభుత్వాలు, పర్యావరణ వేత్తలు ఎంత మొత్తుకుంటున్నా మనం పెడచెవిన పెడుతున్నాం. ప్రభుత్వాలు కేవలం చట్టాలు చేసి చేతులు దులుపుకుంటున్నాయి. నిషేధం పటిష్టంగా అమలు చే యడంలో విఫలమవుతున్నాయి. ప్లాస్టిక్ ఫ్యాక్టరీలను మూసివేయడానికి సంకోచిస్తున్నాయి. ఫలితంగా టన్నుల కొద్ది ప్లాస్టిక్ నిత్యం జనాల్లోకి వెళ్తోంది. మనం కూడా ఏమౌతుందిలే అని వినియోగం ఆపడం లేదు. ఫలితంగా చాపకింద నీరులు ప్లాస్టిక్ మన శరీరంలోకి ప్రవేశిస్తోంది. ఇప్పటి వరకు మనం పశువుల కడుపులో ప్లాస్టిక్ వ్యర్థాలను తీయడం గుర్తించాం. ఇప్పటికైనా మనం అప్రమత్తం కాకుంటే భవిష్యత్తులో మన కడుపులో నుంచి కూడా ప్లాస్టిక్ అవశేషాలను ముద్దలు ముద్దలుగా తీసే రోజులు వస్తాయనడంలో అనుమానం లేదు. ఇప్పటికైనా మేల్కొనాల్సిన అవసరం బాధ్యత అటు పాలకులు, ఇటు ప్రజలపై ఉంది.