Telangana: తెలంగాణ రాష్ర్టంలో కర్ణాటక రాష్ర్టంలోని రాయచూర్ ను కలపాలని అక్కడి బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. పక్క స్టేట్ల నుంచి పలువురు తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో నేతల్లో పలు కోణాల్లో సామాజిక మాధ్యమాల్లో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే చేసిన ప్రతిపాదనపై మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ శివరాజ్ వ్యాఖ్యలపై ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. చప్పట్లతో తమ నిర్ణయం వెలిబుచ్చడం తెలిసిందే.

ఇప్పటికే గతంలోనే టీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ మహారాష్ర్టలోని నాందేడ్ ను సైతం తెలంగాణలో కలపాలని డిమాండ్ వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రతిష్ట మరింత పెరిగిందని చెబుతున్నారు. అందుకే ఆ ప్రాంతాలు మన రాష్ర్టంలో కలిసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నాయని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న పథకాలతో ఆకర్షితులై తెలంగాణలో చేరాలని నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తోంది.
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో ప్రాంతాల విలీనం ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత వారి పైనే ఉంటుందని చెబుతున్నారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ నెలకొనడంతో ఈ ప్రాంతాల విలీనంపై నిర్ణయాన్ని కేంద్రానికి వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేంద్రపైనే భారం పెడుతూ తమకు ఏ అభ్యంతరాలు లేవని సూచిస్తున్నారు. దీంతో రాయచూర్, నాందేడ్ విలీన ప్రతిపాదన పట్టాలెక్కుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ర్టంలో టీఆర్ఎస్ చేపడుతున్న సంక్షేమ పథకాల పట్ల పలు ప్రాంతాలు ఆకర్షితులవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. కానీ ఇది సాధ్యమయ్యే ప్రక్రియ కాదు. దీనికి ఎన్నో న్యాయసంబంధమైన విషయాలు అడ్డంకిగా మారతాయి. కానీ వారిలో ఉన్న ఆతృతను మన నాయకులు కూడా ఆహ్వానిస్తున్నారు. తమ అభివృద్ధితోనే వారు ఇక్కడికి రావాలని చూస్తున్నారని చెబుతున్నారు.