Etela Rajender: హుజూరాబాద్ రాజకీయం రోజురోజుకు హీటెక్కుతోంది. రాజేందర్ రాజీనామాతో ప్రారంభమైన పొలిటికల్ యుద్ధం మెళ్లిమెళ్లిగా.. క్లయిమాక్స్ కు చేరుతోంది. ఐదు నెలలుగా టీఆర్ఎస్.. ఈటల రాజేందర్ పోటాపోటీగా ప్రజల్లోకి వెళ్తుంటే.. ఇటీవల వెలువడిన నోటిఫికేషన్ తో తమ పోరును మరింత ఉధృతం చేశారు. టీఆర్ఎస్ గెలుపు బాధ్యతను పూర్తిగా హరీశ్ రావు మీదేసుకుని ముందుకు సాగుతుండగా.. రాజేందర్ కమలం పార్టీగూటిలో ఉన్నా.. ఒంటరి గువ్వగానే పోరాటం చేస్తున్నారు. తనకు జరిగిన అన్యాయం గురించి ప్రజలకు చెప్పకుంటూ.. ధర్మం.. న్యాయం నినాదాలతో ముందుకు సాగుతున్నారు. ఇక తాము బరిలో ఉన్నామంటూ.. కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేసిన బల్మూరి వెంకట్ సైతం ప్రచారంలో చురుగ్గానే పాల్గొంటున్నారు. ఇల్లందకుంట కేంద్రంగా తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన బల్మూరికి పార్టీ సీనియర్ నాయకులు కూడా కలిసివచ్చి మద్దతు తెలుపుతున్నారు. సోమవారం నామినేషన్ల పరిశీలన పూర్తిగాకాగా.. 40మందికి పైగా బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు తేల్చారు. ఈ నెల 13న నామినేషన్ల విత్ డ్రా తరువాత బరిలో చివరిదాక నిలిచేది ఎవరనేది స్పష్టం అవుతుంది.

గత పరిణామాలను ధృష్టిలో ఉంచుకుని టీఆర్ఎస్ పార్టీ శరవేగంగా ప్రచారంలో దూసుకెళుతోంది. ప్రముఖులందరూ హుజూరాబాద్ లోనే అడ్డావేశారు. పొద్దున లేస్తే ఓటర్ల ఇళ్లముందు వాలిపోతున్నారు. మంత్రి హరీశ్ రావు నియోజకవర్గ బాధ్యతను పూర్తిగా తీసుకుని రోజుకో ఊరిలో ప్రచారం చేస్తున్నారు. అదే విధంగా మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, తదితరులు హుజూరాబాద్ లోనే మకాంవేసి అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. పొద్దంతా గ్రామాల్లో ప్రచారం చేస్తూ.. సాయంత్రానికి కులసంఘాలు, మహిళా సంఘాలు, వివిధ సంఘాల వారితో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కుల సంఘాలకు చేస్తున్న పనులు, బీజేపీ ప్రభుత్వం పెంచుతున్న నిత్యవసర ధరల గురించి ప్రజలకు వివరిస్తూ.. ఈటలను ఓడించాలని ప్రచారం చేస్తున్నారు.
ఇక బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఈటల రాజేందర్ ఒక్కడే నియోజకవర్గం మొత్తం ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన సతీమణి జమున, రాజేందర్ మినహా ప్రముఖులెవరూ మిగితా చోట్లలో ప్రచారం చేయడం కనిపించడం లేదు. ఇప్పటికే ఓసారి నియోజకవర్గం మొత్తం ప్రచారం నిర్వహించిన రాజేందర్ మరోసారి ఓటర్లను కలుస్తూ.. వస్తున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటున్నారు. ప్రస్తతం రాజేందర్ కమలాపూర్ మండలంలో ప్రచారం నిర్వహిస్తుంగా.. ప్రముఖులు ఎవరూ పెద్దగా కనిపించడం లేదు.. అయితే రాజేందర్ ను ఎలాగైనా ఒడించాలనే లక్ష్యంతో తెలంగాణ సర్కారు పావులు కదుపుతోంది. సోమవారం రాత్రి నియోజకవర్గంలో జరిగిన ఓ సభలో రాజేందర్ నిబంధనలు అతిక్రమించారని పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించిన జనాలను పోగేశారని ఎలక్షన్ ప్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా తొలికేసు నమోదుకాగా.. అది బీజేపీ ఖాతాలో పడడం విశేషం.