Homeజాతీయ వార్తలు2000 Notes Ban: 2000 నోట్ల రద్దుపై మీమర్స్‌ రియాక్షన్‌.. ఓ ఆటాడుకున్నారు..!

2000 Notes Ban: 2000 నోట్ల రద్దుపై మీమర్స్‌ రియాక్షన్‌.. ఓ ఆటాడుకున్నారు..!

2000 Notes Ban: 2023 , మే 19.. సాయంత్రం స్టాక్‌ మార్కెట్లు ముగిసి ప్రశాంతంగా ఉన్న వేళ.. ఒక్కసారిగా అలజడి మెుదలైంది. ఇంతకీ వార్తేంటంటే రిజర్వు బ్యాంక్‌ 2016లో తీసుకొచ్చిన రూ.2000 కరెన్సీ నోట్లను చలామణి నుంచి వెనక్కి తీసుకుంటోంది. ఈ వార్త మెుదట విన్న వారు ఫేక్‌ అనుకున్నారు. కానీ అది నిజమేనని వెల్లడైంది.

నాడు కూడా అలాగే..
2016లో ఇలాగే ఒక సాయంత్రం ప్రధాని మోదీ ప్రియమైన దేశ ప్రజలకు పెద్ద నోట్ల రద్దు గురించిన వార్త ప్రకటించారు. ఆ తర్వాత పుట్టిన రూ.2000 నోటు ప్రస్తుతం తన ప్రస్థానాన్ని భారత ఆర్థిక వ్యవస్థలో ముగించింది. క్లీన్‌ నోట్‌ పాలసీ కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిజర్వు బ్యాంక్‌ నిన్న సాయంత్రం స్పష్టం చేసింది. పైగా తమ వద్ద ఉన్న నోట్లను బ్యాంకుల వద్ద మార్చుకోవాలని పౌరులకు సూచించింది.

మీమర్స్‌ రియాక్షన్‌..
ఈ వార్త వెలువడిన వెంటనే ట్విట్టర్‌ మీమ్స్‌ తో నిండిపోయింది. ఇకపై రూ.2000 నోట్లను మే 23 నుంచి సెప్టెంబరు 30 వరకు మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించబడింది. అయితే రోజువారీ మార్పిడికి ఒక వ్యక్తికి రూ.20,000 వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు రిజర్వు బ్యాంక్‌ వెల్లడించింది. దీనికి ముందు 2018–19లో రూ.2000 నోట్ల ముద్రణను భారతీయ రిజర్వు బ్యాంక్‌ నిలిపివేసింది. మెుత్తం ముద్రించిన రూ.2000 నోట్లలో ప్రస్తుతం 10.8 శాతం మాత్రమే చలామణిలో ఉన్నాయని రిజర్వు బ్యాంక్‌ గణాంకాలు చెబుతున్నాయి.

సోషల్‌ మీడియాలో మీమ్స్‌..
2000 నోట్ల ఉపసంహరణపై చాలా మంది స్పందిస్తున్నారు. నెటిజన్లు ఆసక్తి కరమైన పోస్టులు పెడుతున్నారు. 2000 నోటుకు దండ వేసి రిప్‌ అని కొందరు.. వెళుతున్నా వెళుతున్నా.. వెళ్లాలని లేకున్నా.. అంటూ కొంతమంది.. బై బై 200 అని కొంతమంది.. ఏమైందమ్మా ఈవేళ.. చినబోయిందే అంటూ మరికందు ఆసక్తి కరమైన పోస్టుతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో మీమ్స్‌ పెట్టారు. కొంతమంది అంత్యక్రియల తరహాలో ఫొటోతో ట్వీట్‌ చేయగా, కొంతమంది రాహుల్‌గాంధీ డైలాగ్‌ తరహాలో కథం.. హోగయా అంటూ ట్వీట్‌ పెట్టారు.

2000 ఉప సంహరణపై నేతల రియాక్షన్‌…
రూ. 2000 నోట్ల రద్దుపై విపక్షాలు మరోసారి నరేంద్రమోడీ సర్కార్‌పై విమర్శలకు దిగాయి. మరికొన్ని పార్టీలు అచితూచి స్పందించాయి.

ఈ సలహా మనదే తమ్ముళ్లు..
పెద్ద నోటు రద్దుపై చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లిలో జరిగిన సభలో మాట్లాడిన చంద్రబాబునాయుడు.. రూ. 2 వేలు, రూ.500 నోట్లను రద్దు చేయాలని సలహా ఇచ్చింది తానేనని చెప్పారు. ఆ మేరకు ఆర్‌బీఐకి ఒక రిపోర్టును తాను అందజేసినట్టు వెల్లడించారు. తన రిపోర్టు ఆధారంగానే నేడు ఆర్‌బీఐ రూ.2 వేల నోటును రద్దు చేసిందని చంద్రబాబు చెప్పారు. రూ.500 నోటు కూడా రద్దు చేయాలని కోరారు.

మంచి నిర్ణయం…
రూ. 2వేల నోటు ఉపసంహరణ మంచి నిర్ణయమని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. దీని వల్ల రాబోయే ఎన్నికల్లో ధన ప్రభావం నియంత్రణలోకి వస్తుందన్నారు.

విశ్వగురు ఇదే తీరు..
విశ్వగురు అని చెప్పుకునే నరేంద్రమోదీ∙పనితీరుకు రూ.2వేల నోటు రద్దు ఒక ఉదాహరణ అని కాంగ్రెస్‌ ఎద్దేవా చేసింది. తొలుత తోచింది చేసేయ్‌.. ఆ తర్వాత ఆలోచించు అన్న సూత్రాన్ని నరేంద్రమోడీ ఫాలో అవుతున్నారని విమర్శించింది. అప్పట్లో పెద్ద నోట్ల రద్దు ఒక మూర్ఖపు చర్య అయితే.. ఆ గాయానికి మందుపూతగా రూ.2వేల నోటు తెచ్చారని.. అప్పట్లో నోట్ల రద్దు విఫలమైనట్టుగానే ఇప్పుడు కూడా 2వేల నోటు రద్దు విఫలమవుతుందని కాంగ్రెస్‌ అభిప్రాయపడింది.

ఊహించిందే..
రూ.2వేల నోటు రద్దు రద్దు ఊహించినదేనని.. ఈ నోటును కూడా వెనక్కు తీసుకుంటారని తాము 2016లోనే చెప్పామని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ట్వీట్‌ చేశారు. నోట్ల రద్దు సంపూర్ణమైందని… ఫలితం మాత్రం శూన్యమని విమర్శించారు. పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చిందన్నారు.

ఏం లాభమో చెప్పాలి..
రూ.2000 నోటును తీసుకురావడం ద్వారా.. తిరిగి ఇప్పుడు రద్దు చేయడం ద్వారా సాధించింది ఏంటో ప్రజలకు సమాధానం చెప్పాలని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ డిమాండ్‌ చేశారు. నోట్ల రద్దు విజయవంతమైందని చెప్పుకున్న వారు ఇప్పుడు పెద్ద నోటు రద్దుకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version