IPL 2023 DC Vs CSK: ఐపీఎల్ లో నేడు కీలక మ్యాచ్ లు.. చెన్నై, లక్నోకు చావోరేవో..!

శనివారం రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. మొదట ఢిల్లీ క్యాపిటల్స్ తో చెన్నై జట్టు తలపడనుంది. సాయంత్రం మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఆడనుంది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 13 మ్యాచ్ ల్లో ఏడు విజయాలు

Written By: BS, Updated On : May 20, 2023 1:57 pm

IPL 2023 DC Vs CSK

Follow us on

IPL 2023 DC Vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో శనివారం రెండు కీలక మ్యాచులు జరగనున్నాయి. ఈ రెండు మ్యాచ్ ల్లో మధ్యాహ్నం జరిగే మ్యాచ్ లో చెన్నై, ఢిల్లీ జట్లు తలపడుతుండగా, సాయంత్రం జరిగే మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం ఆడే మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ కు, సాయంత్రం ఆడే మ్యాచ్ లక్నో జట్టుకు అత్యంత కీలకంగా మారింది. శనివారం నాటి మ్యాచ్ ల్లో గెలిస్తేనే ఈ రెండు జట్లు ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశం ఉండడంతో ఈ రెండు జట్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని బరిలోకి దిగుతున్నాయి.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ ముగింపు దశకు వస్తోంది. ఎనిమిది జట్లు ఒక్కో మ్యాచ్ ఆడితే లీగ్ దశ ముగుస్తుంది. అయితే, ప్లే ఆఫ్ కు దగ్గర పడుతున్న కొద్ది ఐపీఎల్ మరింత ఆసక్తికరంగా మారింది. ప్లే ఆఫ్ రేసులో ఎక్కువ జట్లు పోటీ పడుతుండడంతో ఎవరు ప్లే ఆఫ్ ఆడతారు అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే, ప్లే ఆఫ్ కు వెళ్లేందుకు దగ్గరగా ఉన్న జట్లు మాత్రం చివరి మ్యాచ్ లో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరి మ్యాచ్ లో గెలిస్తే తప్ప ప్లే ఆఫ్ సమీకరణాలు ఆయా జట్లకు అనుకూలంగా లేవని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

గెలిస్తేనే ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశం..

శనివారం రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. మొదట ఢిల్లీ క్యాపిటల్స్ తో చెన్నై జట్టు తలపడనుంది. సాయంత్రం మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఆడనుంది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 13 మ్యాచ్ ల్లో ఏడు విజయాలు, 5 ఓటములతో 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. శనివారం జరిగే మ్యాచ్ లో గెలిస్తే మిగిలిన జట్ల గెలుపోటములతో సంబంధం లేకుండా చెన్నై జట్టు ప్లే ఆఫ్ చేరుతుంది. అలాగే, లక్నో జట్టు కూడా చెన్నై మాదిరిగానే 15 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. శనివారం కోల్ కతాతో జరిగే మ్యాచ్ లో విజయం సాధిస్తే చెన్నై జట్టు మాదిరిగానే మిగిలిన జట్ల విజయాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లే ఆఫ్ దశకు చేరుకుంటుంది. పొరపాటున ఈ రెండు జట్లు ఓడితే మాత్రం మిగిలిన జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్లే ఆఫ్ చేరాలంటే చెన్నై, లక్నో జట్లకు శనివారం నాటి మ్యాచులు అత్యంత కీలకంగా మారాయి.

ఈ జట్లకు ప్లే ఆఫ్ అవకాశం..

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 13 మ్యాచ్ ల్లో ఏడు విజయాలు, ఆరు ఓటములతో 14 పాయింట్లతో పాయింట్లు పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ జట్టు కూడా 13 మ్యాచుల్లో ఏడు విజయాలు, ఆరు ఓటములతో 14 పాయింట్లతోనే ఆరో స్థానంలో ఉంది. ఈ రెండు జట్ల నుంచి చెన్నై, లక్నో జట్లకు తీవ్రమైన పోటీ నెలకొంది. శనివారం నాటి మ్యాచ్ లో లక్నో, చెన్నై జట్టు ఓడి, ముంబై, బెంగళూరు జట్లు మిగిలిన ఒక్కో మ్యాచ్ లో విజయం సాధిస్తే నేరుగా ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తాయి. ముంబై జట్టు హైదరాబాద్ తోనూ, బెంగళూరు జట్టు గుజరాత్ టైటాన్స్ తోను మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ రెండు జట్లు ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే తప్పనిసరిగా ఈ మ్యాచ్ లో గెలవడంతోపాటు.. శనివారం నాటి మ్యాచ్ లో చెన్నై, లక్నో జట్లు ఓడిపోవాల్సి ఉంటుంది. ఏదో ఒక జట్టు ఓటమిపాలైన నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండే జట్టులో ఏదో ఒకటి వెళ్తుంది. కాబట్టి, ప్లే ఆఫ్ రేస్ ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా మారింది.