Mega Fans for Janasena: ఏపీలో ఇప్పుడు జనసేన చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆ పార్టీకి ఎన్నడూ లేనంత అడ్వంటేజ్ కనిపిస్తోంది. అటు అధికార పక్షం, ఇటు విపక్షాలు జనసేన ప్రాపకం కోసం పరితపిస్తున్నాయి. ఇతర విపక్షాలతో జనసేన కలవకూడదని అధికార పక్షం భావిస్తుండగా.. జనసేనను కలుపుకొని విజయతీరాలకు చేరాలని మిగతా పక్షాలు ఆలోచిస్తున్నాయి. ఈ సమయంలో ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా గత అనుభవాలను ద్రుష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా జనసేన నాయకత్వం ముందుకు సాగుతోంది. మెగా అభిమానులను ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటు వచ్చే ఎన్నికల్లో జనసేన తరుపున క్రియాశీలకం చేయాలని భావిస్తొంది. అందులో భాగంగా జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మెగా అభిమానులతో వరుసగా భేటీ అవుతున్నారు. వారిని దిశా నిర్దేశం చేస్తున్నారు. రాజకీయంగా జనసేన పార్టీ రూపంలో ఒక క్లీన్ ప్లాట్ ఫామ్ ఉందని, పార్టీని గెలిపించుకుని పవన్ కళ్యాణ్ ను సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిస్తున్నారు. గత అనుభవాల నేపథ్యంలో గతంలో జరిగిన తప్పిదాలు, పీఆర్పీ సమయంలో జరిగిన తప్పిదాలు, వాటిని ఎలా అధిగమించాలని అన్న విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు సైతం రంగంలోకి దిగారు. వచ్చే ఎన్నికల నాటికి మెగా అభిమానులందర్నీ సంఘటితం చేసే గురుతర బాధ్యతను తీసుకున్నారు. జిల్లాల వారీగా సమీక్షించి సంఘాల నాయకులకు క్రియాశీల బాధ్యతలు అప్పగించనున్నారు.

త్యాగాలకు సిద్ధంగా..
కేవలం రాజకీయ కోణంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి రాలేదని.. సమాజానికి ఏదో సేవచేయాలని వచ్చారని చెప్పడం ద్వారా మెగా అభిమానులకు ఒకరకమైన స్ఫూర్తి సంకేతాలను పంపుతున్నారు. కేవలం అభిమానం ఉంటే సరిపోదని.. దానిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లుగా మలుచుకోవడంపై ద్రుష్టిపెట్టాలని సూచిస్తున్నారు. సేవా కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే రాజకీయ పార్టీగా ఎలా ముందుకు వెళ్లాలి… ఎలా బలపడాలి అనే అంశం మీద దృష్టి సారించడం ముఖ్యమన్నారు. అభిమాన సంఘాలకు, రాజకీయాలకు తేడా ఉంటుందని.., రాజకీయంగా ప్రతి రోజు గొడవలు ఉంటాయని.. దానికి సిద్ధపడాలన్నారు.గతంలో జరిగిన తప్పులు ఈసారి జరగకుండా ఉండేందుకు జనసేన చర్యలు తీసుకుంటోందని.. పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా వందసార్లు ఆలోచించే తీసుకుంటున్నట్లు నాదేండ్ల మనోహర్ వెల్లడించారు. ఏ నిర్ణయం తీసుకున్నా బహిరంగంగా మాట్లాడాలి అనే స్థాయిలో పాలసీలు తీసుకువస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారని.., ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని ఆయనకు నష్టం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎంతో మంది నష్టపోయారన్నారు. సినీ రంగాన్ని దెబ్బ కొట్టి ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా బలంగా ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమైనట్లు గుర్తుచేశారు.

జెండా మోసేందుకు..
దేశంలో ఎవరికీ లేని విధంగా మెగా అభిమానులు ఉన్నారని.. వారంతా తలచుకుంటే రాజ్యాధికారం ఎంతో దూరంలో లేదని జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. అభిమాన సంఘాలు వందశాతం జనసేన జెండా మోసేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తున్నారు. గత ఎన్నికల్లో ఎదురైన ఆటుపోట్లు, సవాళ్లను ధీటుగా ఎదుర్కోవడమే మన ముందున్న కర్తవ్యంగా చెబుతున్నారు. గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు పార్టీని తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యవర్గంతో పూర్తి స్థాయి కలయిక ఏర్పడడానికి మీకు కొంత సమయం పడుతుందని.., జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఈ తరహా సమావేశాలు ఏర్పాటు చేసుకుందామన్నారు. ప్రస్తుతం 9 జిల్లాలకు అధ్యక్షులు, జిల్లా స్థాయి, మండల స్థాయి కమిటీల ఏర్పాటు పూర్తయ్యిందని.., వారి వివరాలు తీసుకుని వారితో కలవాలని అభిమానులకు సూచించారు. మొత్తానికి వచ్చే ఎన్నికల నాటికి మెగా అభిమానులు కీ రోల్ వహించేలా వ్యూహాత్మకంగా జనసేన నేతలు ముందుకు సాగుతున్నారు.