JP Nadda: ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల వ్యవధి ఉంది. కానీ అన్ని రాజకీయ పక్షాలు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. పొత్తల అంశంతో శరవేగంగా రాజకీయాలు మారుతున్నాయి.. అన్ని పార్టీలు గెలుపు దిశగా ఇప్పటికే నుంచే భారీ అంచనాల్లో ఉన్నాయి. వీలైనంతవరకూ రెండేళ్లు ప్రజల్లో ఉండాలని నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే టీడీపీ మహానాడు సక్సెస్ కావడంతో జోష్ మీద ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత ఉందని స్పష్టత రావడంతో దూకుడు పెంచాలని నిర్ణయించింది. మరోవైపు పవన్ కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టడంతో పాటు మెగా బ్రదర్ నాగబాబు అన్ని జిల్లాలను చుట్టేస్తున్నారు. మంగళగిరిలో పార్టీ శ్రేణులతో సమావేశమైన పవన్ భవిష్యత్ కార్యాచరణ రూపొందించారు. అటు బీజేపీ కూడా ఏపీ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో రెండు రోజుల పర్యటనకు నేడు రాష్ట్రానికి వస్తున్నారు. విజయవాడ సిద్ధార్థ ఫార్మసీ కాలేజీ గ్రౌండ్‌లో శక్తికేంద్రాల ఇన్‌చార్జీల సమావేశానికి హాజరవుతారు. సాయంత్రం ఐదుగంటలకు విజయవాడ నగర, ఎన్టీఆర్ జిల్లా పురప్రముఖులతో వెన్యూ ఫంక్షన్‌హాల్‌లో సమావేశమవుతారు. రాత్రి బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ, ప్రధాన కార్యదర్శులతో సమావేశమై పార్టీ భవిష్యత్ వ్యూహాలపై చర్చిస్తారు. రాత్రికి విజయవాడలోనే బసచేయనున్నారు. మంగళవారం ఉదయం కనకదుర్గమ్మను దర్శించుకుని రాజమహేంద్రవరం వెళతారు. అక్కడ కేంద్ర పభుత్వ పథకాల లబ్ధిదారులతో సమావేశమవుతారు. సాయంత్రం బహిరంగసభలో పాల్గొని ఢిల్లీ వెళతారు.

బంతి బీజేపీ, టీడీపీ కోర్టులో..
పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో పొత్తుల అంశంపై తెరపైకి తెచ్చిన రెండు రోజుల్లోనే బీజేపీ చీఫ్ ఏపికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. జనసేనాని పవన్ కళ్యాణ్ పొత్తుల పైన మూడు ఆప్షన్లు ప్రకటించారు. అందులో బీజేపీ- టీడీపీ-జనసేన ఉమ్మడిగా పోటీ చేయటం…లేదా బీజేపీ-జనసేన కలిసి పొత్తుతో ముందుకు వెళ్లటం.. జనసేన ఒంటరిగా బరిలో నిలవటం.. ఈ మూడు ఆప్షన్ల పైన ఇప్పుడు బీజేపీ – టీడీపీ పార్టీలే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని జనసేన నేతలు చెబుతున్నారు.ఆ రెండు పార్టీలకే ఇప్పుడు జనసేన అవసరం ఉందని..జనసేన ఒంటరి పోరుకు అయినా సిద్దమనే సంకేతాలు పవన్ కళ్యాణ్ ఇచ్చారు. అయితే, బీజేపీతో తాము మిత్రులుగానే ఉన్నామంటూ పవన్ చెప్పుకొచ్చారు. పవన్ వ్యాఖ్యల పైన బీజేపీ నేతలు స్పందించారు. జనసేనతో పొత్తుపై ఎలా వెళ్లాలనేది తమ పార్టీ జాతీయ నాయకులు నిర్ణయిస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేయటం పైన బీజేపీ నేతలకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూసే బాధ్యత తనదేనంటూ పవన్ చెప్పటం..టీడీపీతో కలిసి పోటీ చేయాలనేది ఒక ఆప్షన్ కావటంతో..ఇక, బీజేపీ సైతం తమ వైఖరి స్పష్టం చేయాల్సిన అవసరం ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తాను రెండు సార్లు తగ్గానని, ఇక తగ్గేది లేదని పవన్ తేల్చి చెప్పడం ద్వారా బంతిని టీడీపీ, బీజేపీ కోర్టులోకి నెట్టారు.

అసలు చిక్కు ఆ రెండు పార్టీలే..
పొత్తులపై తెల్చుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు టీడీపీ, బీజేపీలపై పడింది. బీజేపీ తిరిగి టీడీపీతో పొత్తుకు సిద్దంగా ఉందా లేదా అనే దాని పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ మాత్రం జనసేనతోనే తమ పొత్తు చెబుతుండగా..టీడీపీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. ఈ సమయంలో.. టీడీపీతో తమ భవిష్యత్ సంబంధాల పైన రాజమండ్రిలో జరిగే బహిరంగ సభలో బీజేపీ చీఫ్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, నడ్డాతో జనసేన చీఫ్ పవన్ సమావేశం లేదు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటంతో తాను నడ్డాను కలవటం లేదని పవన్ స్పష్టం చేసారు. ఇదే సమయంలో.. బీజేపీ తమ సొంత బలం పెంచుకొనే కసరత్తు ముమ్మరం చేస్తోంది. రాష్ట్రంలో 40 వేలకుపైగా ఉన్న పోలింగ్ కేంద్రాలను బీజేపీ తొమ్మిదివేల శక్తికేంద్రాలుగా వర్గీకరించి వాటికి ఇన్‌చార్జీలను నియమించింది. దీంతో..నడ్డా ఏపీ పొత్తులు..భవిష్యత్ కార్యాచరణ పైన ఎటువంటి దిశా నిర్దేశం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.