Meat prices : దసరా.. తెలంగాణ ప్రజలకు పెద్ద పండుగ. పల్లె, పట్నం తేడా లేకుండా అందరూ సంబురంగా జరుపుకునే పండుగ.. దసరా నాడు గడపగడపకు పసుపు కుంకుమలు పెట్టి, గుమ్మానికి తోరణాలు కట్టి పూజలు చేస్తారు. దసరా రోజు ఎర్రటి పట్టు వస్త్రాలు కట్టుకొని పూజలు చేస్తే రాజరాజేశ్వరి దేవి అనుగ్రహిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే పెద్దలు అమ్మవారి ఎదుట ఎర్రటి అక్షింతలు, గాజులు పెడతారు. ఆయుధ పూజలు చేస్తారు. దసరా పెద్ద పండుగ కాబట్టి ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చి ఆనందంగా ఆడిపాడతారు. ఇంతవరకు బాగానే ఉన్నా పండగ అంటేనే తెలంగాణ పల్లెల్లో మాంసాహారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. కానీ ఈసారి ఈ యాట ముక్క తినాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి.

-ముక్క దొరుకుడు కాన కష్టమైంది
తెలంగాణ పల్లెల్లో యాట కూరకు డిమాండ్ ఎక్కువ. ఇక పండుగ రోజుల్లో అయితే చెప్పాల్సిన పనిలేదు. గత కొన్ని సంవత్సరాల నుంచి తెలంగాణలో మాంసం వినియోగం గణనీయంగా పెరిగింది.. ఎంతలా అంటే పొరుగు రాష్ట్రాల నుంచి గొర్రెపోతులను దిగుమతి చేసుకునే అంతగా. ప్రస్తుతం మార్కెట్లో 800 నుంచి 1000 రూపాయల వరకు కిలో మాంసం లభిస్తుంది. హైదరాబాదు లాంటి ప్రాంతాల్లో అయితే 1100 వరకు పలుకుతోంది. ఇక దసరా పండుగనాడు అయితే కిలో కు 1200 రేటు పెట్టినా మాంసం లభించలేదు. దీంతో చాలామంది చికెన్ తీసుకెళ్లారు.
-మాంసం వినియోగం పెరిగింది
ముందుగానే చెప్పినట్టు తెలంగాణలో మాంసం వినియోగం పెరిగింది.. ఇక్రిసాట్ నిర్వహించిన సర్వేలో గతంలో సరాసరి వినియోగం మూడు కిలోలు ఉండగా, ఇప్పుడు అది ఏకంగా ఐదు కిలోలకు పెరిగింది. రాష్ట్రంలో పెరుగుతున్న గొర్రెపోతులు సరిపోక… ఇతర ప్రాంతాల నుంచి మాంసం వ్యాపారం చేసేవారు గొర్రె పోతులను దిగుమతి చేసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాదు లాంటి ప్రాంతాల్లో అయితే క్వింటాళ్ల కొద్ది మాంసం వినియోగం జరుగుతున్నదని వ్యాపారులు అంటున్నారు. కోవిడ్ తర్వాత మాంసం వినియోగం భారీగా పెరిగిందని చెబుతున్నారు. దసరా సమయంలో మాంసానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి డిమాండ్ చుక్కలనంటింది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో కిలో మాంసం 1200 వరకు పలికింది. మాంసం లభించని వారు తలా ఇంత నగదు వేసుకొని గొర్రెపోతులను కొనుగోలు చేసి పోగులు వేసుకున్నారు. దసరా ఒక్క రోజే తెలంగాణ వ్యాప్తంగా సుమారు 30 కోట్ల వరకు మాంసం వ్యాపారం జరిగినట్టు అంచనా. ఇది ఇంకా ఎక్కువగానే ఉంటుందని వ్యాపారులు అంటున్నారు. అయితే మాంసం అధికంగా తినడం వల్ల వ్యాధులు సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎంతమంది ఎన్ని హెచ్చరికలు జారీచేసినా తగ్గేదేలే అంటూ తెలంగాణ ప్రజలు లొట్టలు వేసుకుంటూ ముక్కలను ఆరగించారు. ఈ జన్మమే రుచి చూసేందుకు దొరికేరా అంటూ పాడుకున్నారు.