ఏపీలో మరో ఎన్నికల సందడి నెలకొంది. ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరి ఓట్లు వేస్తున్నారు. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పుతో పరిషత్ ఎన్నికలు ఈ ఉదయం నుంచి నిర్వహిస్తోంది ఎన్నికల సంఘం. ఏపీలోని 13 జిల్లాల్లో 660 జడ్పీటీసీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 126 ఏకగ్రీవమయ్యాయి. వివిధ కారణాలతో 8 స్థానాలకు జరగడం లేదు.
ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఏపీ వ్యాప్తంగా 2,46,71,002 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
గత ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు పోటీలో ఉన్న 11 మంది అభ్యర్థులు మరణించారు. మిగిలిన 515 జడ్పీటీసీ స్థానాలకు 2058 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 10047 ఎంపీటీసీలకు గాను 2371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 652 జడ్పీటీసీ, 7220 ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 2,46,71,002 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పరిషత్ ఎన్నికల కోసం ఏపీ వ్యాప్తంగా 27751 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేవం పార్టీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించినా.. కొన్ని చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు బరిలో నిలిచారు. అధికార వైసీపీ పెద్ద ఎత్తున పోటీపడుతోంది. ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. కోవిడ్ నిబంధనల మేరకు పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు.