ఏప్రిల్ 17న తిరుపతి ఉప ఎన్నికకు పోలింగ్ జరగబోతోంది. ఈ ఎన్నికకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. ప్రధాన పార్టీల అభ్యర్థులూ ఖరారయ్యారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మికే మళ్లీ ఛాన్స్ ఇచ్చారు. అధికార పార్టీ వైసీపీ నుంచి జగన్ వ్యక్తిగత డాక్టర్ గురుమూర్తి పోటీలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత డాక్టర్ చింతా మోహన్‌ను బరిలో నిలిచారు. మరోవైపు.. బీజేపీ–జనసేన కూటమి అభ్యర్థిలో రత్నప్రభ పోటీలో నిలిచారు. అయితే.. ఈ సీటుపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పూర్తి నమ్మకంతో ఉన్నారు. గెలుపు నల్లేరు మీద నడకే కానీ.. మెజార్టీ ముఖ్యమంటూ నేతలకు నూరిపోశారు. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మెజార్టీ సాధించాలని దిశానిర్దేశం చేశారు.
ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న జగన్ ఇప్పటికే పది మందికి పైగా మంత్రులను అక్కడ ఇన్‌చార్జిగా పెట్టారు. అంతేకాదు.. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ ఎంపీకి 2.28 లక్షల మెజార్టీ వచ్చింది. కానీ.. ఈసారి ఆ మెజార్టీని దాటి 4 లక్షలు రావాలన్నదే జగన్ పెట్టిన టార్గెట్. ఇక సెగ్మెంట్లలో తాము అంచనా వేసుకున్న మెజార్టీ వస్తుందని వైసీపీ నేతలు కూడా లెక్కలు వేసుకుంటున్నారు. తిరుపతి, సర్వేపల్లిలో మాత్రం తమకు మరీ అంత వన్‌సైడ్ పరిస్థితి లేదని వైసీపీ చేయించిన సర్వేలో తేలినట్టు సమాచారం. తిరుపతిలో గత ఎన్నికల్లోనే వైసీపీ ఎమ్మెల్యే గెలిచినా పార్లమెంటుకు వచ్చేసరికి పనబాక లక్ష్మికి 800 ఓట్ల మెజార్టీ వచ్చింది.
ఇటీవల తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ వన్‌సైడ్‌గా గెలిచినా.. స్థానిక ప్రభావం ఇప్పుడు ఉండదని చాలా డివిజన్లలో టీడీపీ, జనసేన పోటీలో లేకపోవడంతో తప్పనిసరిగా వైసీపీకి అందరూ ఓట్లేశారని.. ఈసారి ఆ పరిస్థితి ఉండదని చాలా మంది చెప్తున్నారు. వైసీపీలోనూ తిరుపతి విషయంలో ఈ డౌట్ కొంచెం నెలకొంది. ఈ సారి ఇక్కడ కొన్ని సామాజిక వర్గాలు మరీ వన్‌సైడ్‌గా వైసీపీని నెత్తిన పెట్టుకునే పరిస్థితి లేదట తెలుస్తోంది. ఇక తిరుపతి ఆధ్యాత్మిక నగరం కావడంతో ఈ సారి బీజేపీ జాతీయ నాయకత్వం ఇక్కడ ప్రధానంగా ఆసక్తి చూపుతోంది. సత్తా లేకపోయినా బీజేపీ ఇక్కడ ధనం వెదజల్లి గౌరవప్రద ఓట్ల కోసం ప్లాన్ చేస్తోంది. దీంతో ఈ సెగ్మెంట్ వరకు అయినా వైసీపీకి గట్టి పోటీ తప్పేలా లేదు. ఆ పార్టీకి మెజార్టీ వచ్చినా అనుకున్న స్థాయిలో వస్తుందా? రాదా? అన్నది కూడా డౌట్‌లా మారింది.
ఇక.. ఈ సెగ్మెంట్ పరిధిలోని సర్వేపల్లిలో సోమిరెడ్డి ఓడిపోతున్నా మెజార్టీ ఎప్పుడూ ఐదారు వేలకు మించడం లేదు. గట్టి పోటీ మధ్యే ఆయన ఓడిపోతున్నారు. ఈ సారి ఆయనకు అక్కడ సానుభూతి పనిచేసేలా ఉంది. ఇక్కడ కూడా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి గట్టిగా కష్టపడుతున్నారు. ఆయనకు మెజార్టీ వచ్చినా వైసీపీ అనుకున్న 3 లక్షల మెజార్టీ రావాలంటే ఇక్కడ 50 వేలు రావాలి. కానీ.. ఆ పరిస్థితి లేదు. ఏదేమైనా తిరుపతిలో వైసీపీ లక్ష్యానికి తిరుపతి, సర్వేపల్లి సెగ్మెంట్లు ఖచ్చితంగా దెబ్బకొట్టేలా ఉన్నాయి. మరి ఇక్కడ టీడీపీ ఎంత టఫ్ ఫైట్ ఇస్తుందో ? చూడాలి.