Electric Bike Showroom : దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల పేలుడు కలకలం రేపుతోంది. వరుసగా చోటుచేసుకుంటున్న ఈ ప్రమాదాల్లో పలువురి మరణం ఈ వాహనాల భద్రతపై నీలి నీడలు కమ్ముకునేలా చేస్తోంది. తాజాగా సికింద్రాబాద్ ఎలక్ట్రిక్ బైకుల షోరూంలోనూ పేలుడు సంబవించి ఏడుగురి ప్రాణాలు పోయాయి.

సికింద్రాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. సికింద్రాబాద్ లోని రూబీ ఫ్రైడ్ లగ్జరీ హోటల్ లో సోమవారం రాత్రి భవనం కింది అంతస్థులో ఉన్న ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో పేలుడు సంభవించింది. దీంతో దట్టమైన పొగ వ్యాపించి ఊపిరి ఆడక అదే భవనంలో పైనున్న లాడ్జిలో వసతి పొందుతున్న ఏడుగురు టూరిస్టులు మరణించడం విషాదం నింపింది. ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. మరో నలుగురు ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు పురుషులు.. ఒక మహిళ ఉన్నట్లుగా అధికార వర్గాలు తెలిపాయి.
అగ్నిప్రమాదంలో మరణించిన వారంతా యువకులే కావడం విశేషం. వీరంతా 35-45 ఏళ్లలోపు వారే. ప్రమాదం జరిగిన సమయంలో ఈ హోటల్ లో దాదాపు 25 మంది ఉన్నట్లుగా సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
సికింద్రాబాద్ పాస్ పోర్ట్ ఆఫీస్ సమీపంలో ఉన్న రూబీ మోటార్స్ షోరూంలో ఉంచిన ఎలక్ట్రిక్ బైక్ లు పేలి మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. మంటలు మెట్లపైకి వ్యాపించి.. వెంటనే భవనంలోని సెల్లార్, గ్రౌండ్, మొదటి, రెండో అంతస్థులను చుట్టుముట్టాయని.. మంటల కంటే దట్టమైన పొగ హోటల్ లో ఉన్న వారిని ఉక్కిరి బిక్కిరి చేసి వారికి శ్వాస అందక మరణించినట్టు ప్రాథమికంగా తేలింది.
దట్టమైన పొగలు భారీగా రావడం.. తగ్గకపోవడంతో అగ్నిమాపక అధికారులు, స్థానికులు వెళ్లి సహాయచర్యలను ఎంతో కష్టమైనా చేపట్టారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి, యశోద ఆస్పత్రికి తరలించారు. హోటల్ లోని మొత్తం 23 గదులుండగా.. అందులో 50 శాతం గదుల్లో పర్యాటకులు ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పేరిగే అవకాశం ఉందని.. ప్రమాదంలో 30 మంది గాయపడ్డారని తెలుస్తోంది.
హోటల్ జీ+4 అంతస్థుల్లో ఉంది. దీనికి అత్యవసర నిష్క్రమణ ద్వారాలు లేకపోవడంతో ఏడుగురు వ్యక్తులు తమను తాము రక్షించుకోవడానికి వివిధ అంతస్థుల నుంచి దూకారు. కొందరు పైప్ లైన్ నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే అగ్ని మాపక శాఖ వారిని కాపాడింది. హోటల్ లోని ఫైర్ స్ప్పింకర్లు సరిగా పనిచేయలేదని తేలింది.
హోటల్ లో బసచేసిన వారిలో చాలా మంది వ్యాపారవేత్తలు, ఉత్తర భారతీయులుగా పోలీసులు తెలిపారు. మొత్తంగా ఈ ఎలక్ట్రిక్ వాహనాల వరుస పేలుళ్లు.. మరణాలు పెరుగుతుండడంతో వీటి భద్రతపై మరోసారి అనుమానాలు రేకెత్తుతున్నాయి.